పొద్దుతిరుగుడంట... కనుల పండగంట!

బోలెడు పొద్దుతిరుగుడు పూలు... అదరగొట్టే నృత్యాలు.. మరెంతో సందడి...ఇవన్నీ ‘సన్‌ఫ్లవర్‌ ఫెస్టివల్‌’ సంగతులు...చూడాలంటే జపాన్‌ వెళ్లాల్సిందే!

Published : 19 Aug 2016 00:49 IST

పొద్దుతిరుగుడంట... కనుల పండగంట!

బోలెడు పొద్దుతిరుగుడు పూలు... అదరగొట్టే నృత్యాలు.. మరెంతో సందడి...ఇవన్నీ ‘సన్‌ఫ్లవర్‌ ఫెస్టివల్‌’ సంగతులు...చూడాలంటే జపాన్‌ వెళ్లాల్సిందే!

సూర్యుడు ఉదయించే తొలి దేశం జపాన్‌. సూర్యుడు ఎటు ఉంటే అటు తిరిగిపోయే పసుపు పచ్చని పొద్దుతిరుగుడు పూలంటే కూడా ఆ దేశ ప్రజలకు భలే ఇష్టం. అందుకే ఏకంగా ఈ పూల పేరుతో ఓ పండగే జరుపుకుంటారు. ఏటా జులై, ఆగస్టు నెలల్లో ఈ వేడుకని సంబరంగా చేసుకుంటారు.

* ఇక్కడి సెరాలో ‘నోజీ ఫ్లవర్‌ఫాం’ పేరుతో ఓ పూల తోటుంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోటలో ఎక్కడ చూసినా పొద్దుతిరుగుడు పూలే కనిపిస్తాయి. ఆ మొక్కల మధ్య ఉన్న సన్నని దారుల్లో నుంచుని ఫొటోలు దిగడం భలే గమ్మత్తుగా ఉంటుంది.
* ఈ తోటే సన్‌ఫ్లవర్‌ ఫెస్టివల్‌కి వేదిక. ఓ వైపు పది లక్షలకు పైగా విరబూసిన పొద్దుతిరుగుడు పూలు కనువిందు చేస్తాయ్‌. మరోవైపు పసందైన జపాన్‌ వంటకాలు నోరూరిస్తుంటాయ్‌. ఈ వంటకాలన్నీ పొద్దుతిరుగుడు నూనెతో చేసినవే. ఇంకోవైపు పిల్లలు, పెద్దలు ఆడుకోడానికి వీలుగా బోలెడు ఆటలుంటాయి. ఈ తోటలోనే సన్నని తికమక మార్గాలతో ‘దారి కనుక్కోండి’ పజిల్‌ కూడా ఉంది. అక్కడికి వచ్చే పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ దారుల్లో తిరుగుతూ, నృత్యాలు చేస్తూ సంబరపడిపోతుంటారు.
* ఈ తోట చుట్టూ తిరిగి రావడానికి ఇక్కడ సైకిళ్లు, బైకులు, ట్రాక్టర్లులాంటి వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
* ఇక్కడి ప్రభుత్వమే ఈ తోటను సాగుచేసి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తుంటుంది. అరుదైన 30 రకాల జాతుల పొద్దుతిరుగుడుల్ని ఇందులో ఓ పక్కన పెంచుతారు. వీటిని మాత్రం స్థానిక పాఠశాల విద్యార్థులే సాగు చేస్తారు. పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా ఈ పచ్చని పూలతోటలే కనిపిస్తుంటాయి.
* ఏటా ఈ సమయంలో లక్షలాది మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. బోలెడు మంది విదేశీ సందర్శకులూ వరస కట్టేస్తారు.

భలే రికార్డు!

ర్మనీలోని నార్డర్హీన్‌ వెస్ట్‌ఫెలెన్‌లో పెరిగిన ఓ పొద్దు తిరుగుడు మొక్క గిన్నిస్‌బుక్‌ రికార్డులకెక్కింది. 30 అడుగుల పొడుగున్న ఇది అత్యంత పొడవైనదిగా రికార్డు కొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని