గాల్లో తేలినట్టుందే... గుండె జారినట్టుందే!

అనగనగా ఓ వంతెన... దానిపై నడవాలంటే ఎంతో గుండె ధైర్యముండాలి... ఎందుకంటే వేల అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం అంచున ఉందది...పర్యటకుల కోసం ఈ మధ్యే కొత్తగా ప్రారంభమైంది... ఇంతకీ ఎక్కడుందిది?

Published : 20 Aug 2016 01:30 IST

గాల్లో తేలినట్టుందే... గుండె జారినట్టుందే!

అనగనగా ఓ వంతెన... దానిపై నడవాలంటే ఎంతో గుండె ధైర్యముండాలి... ఎందుకంటే వేల అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం అంచున ఉందది...పర్యటకుల కోసం ఈ మధ్యే కొత్తగా ప్రారంభమైంది... ఇంతకీ ఎక్కడుందిది?

గాజుతో తయారుచేసిన వంతెనలు అరుదేమీ కాదు. కానీ చైనాలో కొత్తగా ప్రారంభమైన ఓ గాజు వంతెన మాత్రం ఇప్పుడు అందరినీ తెగ ఆకర్షిస్తోంది. ఎంచక్కా ఆకాశ వీధుల్లో నడుస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. గుండెలదరగొట్టే సాహస అనుభవాన్నిస్తోంది.
* ఎందుకంటే ఇది ఓ పర్వత శిఖరం అంచు వారగా, భూమికి ఏకంగా 4,600 అడుగుల ఎత్తులో ఉంది! అంటే దాదాపుగా నాలుగు ఈఫిల్‌ టవర్లు ఒకదానిపై మరొకటుంటే ఎంత ఎత్తుంటుందో అంతకంటే ఎత్తులోనే ఉందన్నమాట!
* అంతపైకెళ్లి కాళ్లకిందున్న గాజు నుంచి కిందకు చూస్తే ఇంకేమైనా ఉందా? మామూలు వాళ్లకైతే పై ప్రాణాలు పైనే పోతాయి. అందుకే కాస్త ధైర్యవంతులు మాత్రమే దీనిపై నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరేమో ధైర్యంగా దానిపై నడక ప్రారంభించినా మధ్యలో భయపడిపోయి కిందికి చూడకుండా మోకాళ్లపై పాక్కుంటూ దాన్ని దాటేస్తున్నారు.
* అసలు గాజు వంతెనలనగానే చైనానే గుర్తొస్తుంది. అక్కడి జాంగ్‌జియాజీలో ఉన్న నేషనల్‌ ఫారెస్ట్‌ పార్కుకి ఆనుకుని ఎత్తయిన తియాన్మెన్‌ పర్వతం ఉంది. దాని శిఖరానికి చివరన 100 మీటర్ల పొడవు, 1.6 మీటర్ల వెడల్పుతో నడక దారిలా దీన్ని గాల్లో నిర్మించారు.
* అసలే గాజంటున్నారు? మరి మనుషులు దీని మీద నడిస్తే పగిలిపోదా? అని అనుమానం వస్తోందా? ఏమీ కాదు. బద్దలుకాకుండా పొరలు పొరలుగా ఉండే ప్రత్యేకమైన గాజు పలకల్ని దీని నిర్మాణంలో వాడారు. దీనిపై నడిచేవారికి చాలా జాగ్రత్తలు చెబుతారు. నిర్వాహకులిచ్చే ప్రత్యేకమైన సాక్సుల్ని మాత్రమే ధరించి దీనిపై నడవాల్సి ఉంటుంది.
* ఇదే కాదండోయ్‌. దీనికి దగ్గర్లో ఉన్న నేషనల్‌ ఫారెస్ట్‌ పార్కులో ఇంకా మూడు గాజు వంతెనలున్నాయి. ప్రపంచంలో అత్యంత పొడవైనదిగా రికార్డు కెక్కిన పేద్ద గాజు వంతెన కూడా ఉన్నదిక్కడే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని