సీతాకోకమ్మా... ఎగిరేది ఎక్కడికమ్మా!

రంగు రంగుల సీతాకోక చిలుకలు...వందలో వేలో కాదు లక్షలు...ఎక్కడెక్కడి నుంచో ఓ చోటికి చేరతాయి...సుదూర తీరాలకు ప్రయాణం మొదలెడతాయి...అందుకు గుర్తుగా అక్కడో పండగ జరుగుతుంది!

Published : 22 Aug 2016 01:18 IST

సీతాకోకమ్మా... ఎగిరేది ఎక్కడికమ్మా!

రంగు రంగుల సీతాకోక చిలుకలు...వందలో వేలో కాదు లక్షలు...ఎక్కడెక్కడి నుంచో ఓ చోటికి చేరతాయి...సుదూర తీరాలకు ప్రయాణం మొదలెడతాయి...అందుకు గుర్తుగా అక్కడో పండగ జరుగుతుంది!కొన్ని రకాల పక్షులు ఎంతో దూరం వలస వెళతాయని మనకు తెలుసు. మరి సీతాకోక చిలుకలు వలస వెళతాయని తెలుసా? అన్నీ కాదుకానీ శీతల ప్రాంతాల్లో ఉండే ‘మోనార్క్‌’ జాతి సీతాకోక చిలుకలు మాత్రం వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి.

* కెనడాలోని టొరంటోలో ‘టామీ థామ్సన్‌’ పార్కుంది. వీటి వలసకు గుర్తుగా ఇక్కడ అంతా కలిసి ‘బటర్‌ఫ్లై ఫెస్టివల్‌’ని సందడిగా జరుపుకుంటారు.

* టొరంటోలో మామూలుగానే బోలెడు చలి. ఇక శీతకాలమైతే గడ్డకట్టుకుపోతాం. పాపం.. అంత చలిని సీతాకోక చిలుకలు మాత్రం తట్టుకోగలవా? అందుకే అవన్నీ గుంపులు గుంపులుగా మెక్సికోకి ఎగిరిపోతాయన్నమాట.

* ఆగస్టు నెలొస్తే చాలు ఈ పార్కుకు ఎక్కడెక్కడి నుంచో బోలెడు సీతాకోకచిలుకలు ఎగురుకుంటూ వచ్చేస్తాయి. పార్కే కాదు ఆ చుట్టు పక్కల ప్రాంతాలూ ఈ జాతి సీతాకోక చిలుకలతో కళకళలాడతాయి.

* చలికాలం వస్తుందనగా... అంటే ఆగస్టు నుంచి నవంబరులోపు ఇవి టొరంటోకి బైబై చెప్పేస్తాయి. లక్షల సంఖ్యలో మెక్సికోకి వలస వెళ్లిపోతాయి. మళ్లీ శీతకాలం అయిపోగానే వెనక్కొచ్చేస్తాయి. అలా ఏడాదిలో ఇవి మొత్తం ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయట!

* టొరంటో నుంచి ఇవి వెళ్లిపోవడానికి గుర్తుగానే అయిదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే థామ్సన్‌ పార్కులో ఏటా ఈ నెలలో ఒకరోజు బటర్‌ఫ్లై ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ఇటీవలే జరిగిన ఈ పండగలో ఆ చుట్టుపక్కల ఉండే మొత్తం 55 జాతుల సీతాకోక చిలుకల ఫొటోల్ని, వివరాల్ని ప్రదర్శించారు. పిల్లలు, పెద్దలు అడిగే సందేహాలకూ అక్కడి నిపుణులు సమాధానాలిచ్చారు. అంతేనా? పిల్లల్ని ఉత్సాహపరిచేందుకు అక్కడే బోలెడు ఆటలు, పోటీలు నిర్వహించారు.* ఈ పండగ పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటూ ఇటు విజ్ఞానాన్నీ, అటు ఉత్సాహాన్నీ పంచుతోంది.

* చాలా జాతుల సీతాకోక చిలుకలు మూడు, నాలుగు వారాలు మాత్రమే బతుకుతాయట. అయితే ఈ మోనార్క్‌ జాతివి మాత్రం ఏకంగా 8 నుంచి 9 నెలల వరకు జీవించగలవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని