పగడాల దిబ్బలో...మర జలకన్య!

సముద్రాల లోతుకు వెళుతుంది... నీటిలో చక్కర్లు కొడుతుంది... అక్కడి వివరాలన్నీ పంపిస్తుంది... ఇదంతా ఓ జలకన్య గురించి అంటే నమ్మగలరా? అయితే ఇది మర జలకన్య!

Published : 24 Aug 2016 00:56 IST

పగడాల దిబ్బలో...మర జలకన్య!

సముద్రాల లోతుకు వెళుతుంది... నీటిలో చక్కర్లు కొడుతుంది... అక్కడి వివరాలన్నీ పంపిస్తుంది... ఇదంతా ఓ జలకన్య గురించి అంటే నమ్మగలరా? అయితే ఇది మర జలకన్య!

ముద్ర జలాల్లో చేపల్లా ఈదే జలకన్యల గురించి పురాణ గాధల్లో వినుంటారు. మరి నిజంగా చూస్తే ఆశ్చర్యమే కదూ. ఈమధ్యే అమెరికా స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన పని కోసం దీన్ని రూపొందించారు. ఇంతకీ ఆ వివరాలేంటో చదివేద్దామా?

* ఇదో హ్యూమనాయిడ్‌ రోబో మర్‌మెయిడ్‌. అంటే మర జలకన్య అన్నమాట. పేరు ఓషన్‌వన్‌. పొడవైన రెండు చేతులతో, హెల్మెట్‌ ధరించినట్టుండే తలతో ఉంటుందిది. తల నుంచి తోక వరకు మొత్తం ఐదు అడుగుల పొడవు. గోళీల్లాంటి కళ్లను అటూ ఇటూ తిప్పుతూ భలేగా కనిపిస్తుంది.

* ఇంతకీ ఇదేం చేస్తుందో తెలుసా? మానవులు ఎవరూ అడుగుపెట్టలేని సముద్ర అడుగు భాగంలోకి నీటి ఒత్తిడిని తట్టుకుంటూ తేలికగా వెళుతుంది.దీన్ని నియంత్రించే పైలట్‌ సూచనల ప్రకారం నీళ్లలోకి చొచ్చుకుపోతూ అక్కడున్న పరిసరాల్ని స్కాన్‌ చేస్తుంది. అంటే దీనికి మార్గాన్ని చూపే వ్యక్తి నీటిలోకి వెళ్లకుండానే పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నమాట. దీని అత్యాధునిక స్టీరియోస్కోపిక్‌ కళ్ల సాయంతో సముద్ర గర్భంలో ఉన్న వాటన్నింటినీ చూస్తుంది. చేతుల్లో ఉంచిన సెన్సార్ల ద్వారా అడుగు భాగంలో కనిపించే వస్తువుల్ని పరీక్షిస్తుంది. పగడపు దిబ్బలు (కోరల్‌ రీఫ్స్‌) ఏమాత్రం దెబ్బతినకుండా సున్నితంగా వాటిని పైకి తీస్తుంది.

* ఈ మర జలకన్యకు ఎంత తెలివో తెలుసా? లోపలికి వెళుతున్న కొద్దీ ఏదైనా అడ్డువచ్చినా, లేదా ఇది ఎక్కడైనా ఇరుక్కుపోయినా తన చేతుల సాయంతో వాటిని తొలగించుకుంటుంది. ఈతకొడుతూ సాఫీగా ముందుకు వెళుతుంది.

* సముద్ర గర్భంలోని పరిసరాలు, జీవజాతుల గురించి తెలుసుకోవడానికి రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ప్రత్యేక వాహనాల్ని వాడుతుంటారు. అయితే ఇవి కూడా వెళ్లలేని ప్రాంతాలకూ, పగడపు దీవుల దగ్గరకూ ఇది వెళ్లి ఎంచక్కా అక్కడి పరిసరాల గురించి సమాచారం అందిస్తుంది.

* ఇంతకీ ఇది ఎలా ఈదుతుంది అంటే? ఈ మర జలకన్యను నీటిలో తడిసినా పాడవ్వని ఆధునిక పరికరాలతో తయారు చేశారు. తోకలో బ్యాటరీ, కంప్యూటర్లు అమర్చి ఉంచారు. వీటి సాయంతో పైలట్‌ ఇచ్చిన ఆదేశాల్ని పాటిస్తూ సమాచారాన్ని పంపిస్తుంది. ఇంకా ఇది సముద్రాల్లో మునిగిపోయిన ఓడల జాడల్ని కూడా చెప్పగలుగుతోంది. ఫ్రాన్స్‌ తీరంలో 1664లో మునిగిపోయిన ఓ నౌకలోని వస్తువుల్ని ఈమధ్యే వెలికి తీసిందిది.

* అంతేకాదు, ఇది డైవింగ్‌ చేసే వాళ్లకు తోడుగా ఉంటూ, చేతి సంజ్ఞలతో వారితో సమాచారాన్ని కూడా పంచుకోగలదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని