గాలిలో నేనే... బాహుబలి!

ప్రపంచంలోనే పేద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌...ఎంతుంటుందంటే ఫుట్‌బాల్‌ మైదానమంత...ఈ మధ్యే మొదటిసారిగా గాల్లోకెగిరింది...మరి దాని సంగతులు మనం మాత్రం తెలుసుకోవద్దూ! రెండు విమానాల్ని పక్క పక్కన కలిపితే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమైన పేద్ద ఆకారం ఒకటి ఉన్నట్లుండి ఆకాశంలో రివ్వున తిరగడం ప్రారంభించింది.

Published : 25 Aug 2016 00:50 IST

గాలిలో నేనే...బాహుబలి!

ప్రపంచంలోనే పేద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌...ఎంతుంటుందంటే ఫుట్‌బాల్‌ మైదానమంత...ఈ మధ్యే మొదటిసారిగా గాల్లోకెగిరింది...మరి దాని సంగతులు మనం మాత్రం తెలుసుకోవద్దూ!

రెండు విమానాల్ని పక్క పక్కన కలిపితే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమైన పేద్ద ఆకారం ఒకటి ఉన్నట్లుండి ఆకాశంలో రివ్వున తిరగడం ప్రారంభించింది. ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో తోకలేని పెద్ద పిట్టలా ఉన్న అది చక్కర్లు కొట్టింది. ఆ ఆకారం ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ అని తెలియని వారంతా దాని వైపు ఆశ్చర్యంగా చూశారు. తెలిసిన వారంతా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.

* ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌. యంత్రాల సాయంతో గాల్లో ఎగిరే హెలికాఫ్టర్లు, విమానాల్లాంటి వాటినన్నింటినీ ఎయిర్‌క్రాఫ్ట్‌లనే అంటారు. అలా గాల్లో ఎగిరే వాటన్నింటిలో ఇదే పెద్దదన్నమాట.

* దీని పేరు ఎయిర్‌ల్యాండర్‌ 10. ఇది ఏకంగా 92 మీటర్ల పొడవు, 43.5 మీటర్ల వెడల్పు ఉంది. అంటే దాదాపుగా ఓ ఫుట్‌బాల్‌ మైదానమంత పరిమాణమన్నమాట. మరి దీని ఎత్తు చూస్తే... తొమ్మిది అంతస్తుల భవనమంతుంది! 10 టన్నుల బరువును ఒక్కసారే మోసుకెళ్లిపోగలదు.

* మరి దీని ప్రత్యేకతలేంటో తెలుసా? గంటకు 90 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. 1600 అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదు. అవసరమైతే రోజుల తరబడి గాల్లోనే ఉండి భూమిపై నిఘా పెట్టగలదు. వాతావరణం బాగాలేకపోయినా, గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నా కూడా ఇది సురక్షితంగా ఎగరగలదు. అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యల కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నమాట.

* 2011లో దీన్ని అమెరికా.. తమ సైనికావసరాల కోసం తయారు చెయ్యడం ప్రారంభించింది కానీ నిధులు లేక దీని తయారీ మధ్యలోనే ఆగిపోయింది.

* తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన హైబ్రిడ్‌ ఎయిర్‌ వెహికల్స్‌(హెచ్‌ఏవీ) అనే ప్రైవేటు సంస్థ దీన్ని పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందు కోసం అది ఇప్పటి వరకు ఏకంగా 300 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. అంటే రెండు వేల కోట్ల రూపాయలకు పైమాటే!

* దీన్ని మరికొన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత పెద్ద సంఖ్యలో వీటి తయారీ ప్రారంభిస్తామని సంస్థ చెబుతోంది. సరుకులు, ప్రయాణికుల రవాణాకు వీలుగా దీన్ని రూపొందిస్తామంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని