ముత్యం దొరికిందోచ్‌! కోట్లు తెచ్చిందోచ్‌!

ముత్యం ఎంతుంటుంది?మహా అయితే గోళీ కాయంత...మరి రెండడుగుల ముత్యం ఉందని తెలుసా? ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది... ప్రపంచంలో పెద్దదని రికార్డూ కొట్టింది!

Published : 29 Aug 2016 01:01 IST

ముత్యం దొరికిందోచ్‌! కోట్లు తెచ్చిందోచ్‌!

ముత్యం ఎంతుంటుంది?మహా అయితే గోళీ కాయంత...మరి రెండడుగుల ముత్యం ఉందని తెలుసా? ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది... ప్రపంచంలో పెద్దదని రికార్డూ కొట్టింది!

నగనగా ఓ జాలరి. సముద్రంలో చేపల వేటకెళ్లాడు. ఓచోట పడవ నిలిపేందుకు లంగరేశాడు. కాసేపటి తర్వాత లంగరును బయటికి లాగబోయాడు. ఏంటో బరువుగా ఉంది. పైకి రావడం లేదు. ఎలాగోలా పైకి లాగి చూస్తే దానికో పేద్ద ఆల్చిప్ప చిక్కుకుంది. దాని లోపల మెరిసే రాయిలాంటిదేదో బరువుగా ఉంది. ఏంటో అర్థంకాలేదుగానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. మంచం పక్కనే పెట్టుకుని రోజూ దాన్ని అపురూపంగా చూసుకునేవాడు. పదేళ్లు గడిచింది. హఠాత్తుగా తానుంటున్న ఇల్లు ఈ మధ్యే కాలిపోయింది. గబగబా ఇంట్లో వస్తువులన్నీ బయటేశాడు. అప్పుడే ఆ రాయి ప్రపంచంలోనే పెద్ద ముత్యమని స్థానిక అధికారి గుర్తించారు. అంతే... హఠాత్తుగా ఆ జాలరిప్పుడు కోటీశ్వరుడైపోయాడు. కథలా ఉందిగానీ ఫిలిప్పీన్స్‌లో ఇది నిజంగానే జరిగింది.

* ఇప్పటి వరకు దొరికిన ముత్యాల్లో ఇంత పెద్దది లేనేలేదట. ఇది ఏకంగా 12 అంగుళాల వెడల్పు, 26 అంగుళాల పొడవుంది. అంటే దాదాపుగా ఓ మాదిరి టీవీ అంత పరిమాణమన్నమాట! మొత్తం 34 కిలోల బరువుంది.
* ఇక దీని విలువ ఆరు వందల కోట్లకు పైనే ఉంటుందని తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
* ఫిలిప్పీన్స్‌లోని పలవాన్‌ అని ఓ దీవుంది. అక్కడే ఈ ముత్యం దొరికింది.
* పర్యటకుల్ని ఆకర్షించేందుకు ఈ పేద్ద ముత్యాన్ని ఆ దేశంలోనే ప్రదర్శనకు ఉంచాలని అనుకుంటున్నారట.
* అన్నట్టు ఇది దొరికే ముందరి వరకు ‘పర్ల్‌ ఆఫ్‌ అల్లా’ అనే ముత్యం ప్రపంచంలో అతి పెద్దది. అది కూడా 1934లో ఈ పలవాన్‌ దీవిలోనే దొరికిందిట. దాని బరువు 6.4కిలోలు. విలువ 200కోట్లకు పైనే. అదిప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఓ మ్యూజియంలో ఉంది.

మీకు తెలుసా?
* సహజంగా బుల్లి ముత్యం తయారవ్వాలంటే రెండు, మూడేళ్లు పడుతుంది.
* పది వేల ఆల్చిప్పల్లో ఒకటి, రెండింటిలోనే ముత్యాలు ఏర్పడతాయట.
* జీవి నుంచి వచ్చే విలువైన రాయి ఇదొక్కటి మాత్రమే.
* వేల ఏళ్ల క్రితమే మనిషి కనిపెట్టిన మొదటి రత్నం ఇదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని