దేశంలో దేశమిది... పర్వతాల రాజ్యమిది!

జెండా: నీలం రంగు వర్షానికి, తెలుపు శాంతికి చిహ్నాలు. ఆకుపచ్చ సంపదకు గుర్తు. మధ్యలో ఉండే నలుపు టోపీ స్థానిక ప్రజలకు ప్రతీక. రాజధాని : మసేరు విస్తీర్ణం : 30,355 చ.కి.మీ జనాభా : 20,67,000 కరెన్సీ : లోటీ భాషలు: సెసోతో, ఆంగ్లం...

Updated : 12 Nov 2022 16:26 IST

దేశంలో దేశమిది... పర్వతాల రాజ్యమిది!

  లెసోతో

జెండా: నీలం రంగు వర్షానికి, తెలుపు శాంతికి చిహ్నాలు. ఆకుపచ్చ సంపదకు గుర్తు. మధ్యలో ఉండే నలుపు టోపీ స్థానిక ప్రజలకు ప్రతీక.
రాజధాని : మసేరు
విస్తీర్ణం : 30,355 చ.కి.మీ
జనాభా : 20,67,000
కరెన్సీ : లోటీ
భాషలు: సెసోతో, ఆంగ్లం

 

*లెసోతో... ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. చుట్టూ అన్ని దిక్కులా దక్షిణ ఆఫ్రికా దేశం ఆవరించి ఉండటం ఈ దేశపు ప్రత్యేకత. అంటే ఒకవేళ మన హైదరాబాద్‌ ఒక స్వతంత్ర దేశంగా ఉండి ఉంటే ఎలా ఉండేది? చుట్టూ భారతదేశమే ఉండేది కదా! అలా దీని చుట్టూ దక్షిణ ఆఫ్రికా దేశం ఉంటుందన్నమాట. లెసోతో ప్రజలు ఏ దిక్కుకు వెళ్లి సరిహద్దులు దాటినా దక్షిణ ఆఫ్రికా భూభాగంలో అడుగుపెట్టాల్సిందే.

* లెసోతో చాలా చిన్న దేశం. మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా చిన్నగా ఉంటుంది.
* లెసోతో సార్వభౌమాధికార దేశమే అయినా లాంఛనంగా ఓ చక్రవర్తి ఉంటారు.
* ఈ దేశం 1966లో యూకే నుంచి స్వాతంత్య్రం పొందింది.
* దేశ భూభాగంలో 80శాతం సముద్రమట్టం కన్నా 1,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. చేతికి అందినట్లుండే మేఘాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉంటాయి.

* గడ్డితో చేసిన ప్రత్యేకమైన టోపీలు ఇక్కడ ప్రసిద్ధి. ‘బసోతో టోపీ’లుగా పిలిచే ఇవి ఈ ప్రాంతంలోని వివిధ పర్వతాల రూపాల్లో తయారవుతాయి.
* ఈ దేశంలోని ‘కాట్సే డ్యామ్‌’ ఆఫ్రికా మొత్తంలో ఎత్తయిన ఆనకట్ట. ఇది దక్షిణ ఆఫ్రికా, లెసోతో దేశాలు కలిపి నిర్మించిన ప్రాజెక్టు. ఇక్కడి నుంచి నీళ్లను దక్షిణ ఆఫ్రికాకు సరఫరా చేస్తారు.

* ఈ దేశాన్నే ‘పర్వతాల రాజ్యం’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి భూభాగంలో మూడింట రెండో వంతు పర్వతాలే ఉంటాయి.
* లెసోతో మొత్తం జనాభాలో ఎక్కువ మంది రాజధాని మసేరులోనే నివసిస్తుంటారు.
* ఇక్కడ 90 శాతం మంది క్రైస్తవులే.

* ఈ దేశంలో వజ్రాల గనులు, జల వనరులు అధికం.
* ఉన్ని, దుస్తులు, పాదరక్షలు ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం. ‘లెవిస్‌’ జీన్స్‌ ఇక్కడ ఎక్కువగా తయారవుతాయి.
* అక్షరాస్యత శాతం 82.

* ఇక్కడి ‘ఆఫ్రిస్కై రిసార్ట్‌’ సముద్రమట్టానికి ఏకంగా 3,050 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
* ‘మలెట్‌సన్‌యనె’ అనే ఏకధార జలపాతం మంచి పర్యటక ప్రాంతం. ఇది 192 మీటర్ల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది.* కంబళిని ఈ దేశ ప్రజలు సంప్రదాయ దుస్తులుగా భావిస్తారు. ఈ తరహా మరే దేశంలోనూ కనిపించదు. రకరకాల రంగులతో పూర్తిగా ఉన్నితో వీటిని తయారు చేసుకుంటారు. చలి నుంచి రక్షణ కోసమే కాకుండా కంబళిని హోదాకు గుర్తుగా భావిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని