కళ్లు చెదిరే ఫీట్లు...కార్టూన్‌ హీరోల ఫైట్లు!

28 ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణం... ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చు... లక్షలాది సందర్శకులు... వందలాది కార్టూన్‌ పాత్రలు... బోలెడు రైడ్లు... మరెన్నో వినోదాలు... ఇంతకీ ఏంటబ్బా ఇదీ?

Published : 07 Sep 2016 00:58 IST

కళ్లు చెదిరే ఫీట్లు...కార్టూన్‌ హీరోల ఫైట్లు!

28 ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణం... ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చు... లక్షలాది సందర్శకులు... వందలాది కార్టూన్‌ పాత్రలు... బోలెడు రైడ్లు... మరెన్నో వినోదాలు... ఇంతకీ ఏంటబ్బా ఇదీ?

మ్యూజ్‌మెంట్‌ పార్కులు అంటే మీకు తెలిసే ఉంటుంది. రకరకాల రైడ్లతో, సరదా ప్రదర్శనలతో మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఈ మధ్య దుబాయ్‌లో ప్రారంభమైంది.పేరు ‘ఐఎంజీ వరల్డ్స్‌ ఆఫ్‌ అడ్వెంచర్‌’. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్‌ థీమ్‌ పార్కు ఇది. అంటే మిగిలిన వాటిలా పైకప్పు లేకుండా కాక పెద్ద గుమ్మటంలాంటి భవనాల్లోనే దీన్ని ఏర్పాటుచేశారన్నమాట.

* కొత్తగా ప్రారంభమైన ఈ పార్కు విశేషాలు ఇన్నీ అన్నీ కావు. ఇది ఏకంగా 15,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే దాదాపు 28 ఫుట్‌బాల్‌ మైదానాలంత పెద్దదన్నమాట.

* ఇందులో కార్టూన్‌ నెట్‌వర్క్‌, మార్వెల్‌ కామిక్స్‌, లాస్ట్‌ వ్యాలీ డైనోసార్‌ అడ్వెంచర్‌, ఐఎంజీ బౌలేవర్డ్‌ అనే నాలుగు రకాల విభాగాలు ఉంటాయి. ఒక్కోటి ఒక్కో ప్రత్యేక అంశంతో తీర్చిదిద్దారు.

* కార్టూన్‌ నెట్‌వర్క్‌, మార్వెల్‌ కామిక్స్‌ విభాగాలు వందలాది కార్టూన్‌ పాత్రలతో సందడిగా ఉంటాయి. ఐరన్‌ మ్యాన్‌, బ్యాట్‌మాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, బెన్‌10, పవర్‌పఫ్డ్‌ గర్ల్స్‌ ఇలా ఒక్కటేంటీ మనకు నచ్చే ఎన్నో కార్టూన్‌ పాత్రలూ ఇక్కడ కనిపిస్తాయి. ఈ పాత్రల బొమ్మలతోనే గుండెలదరగొట్టే రైడ్లు, కళ్లు తిరిగే రోలర్‌ కోస్టర్లు, ఆకట్టుకునే లైవ్‌ ప్రదర్శనలూ ఉంటాయి.

* లాస్ట్‌ వ్యాలీ డైనోసార్‌ అడ్వెంచర్‌లో 70కిపైగా నిలువెత్తు రాకాసిబల్లుల శిల్పాలు కను విందుచేస్తాయి. ఈ బొమ్మ శిల్పాలు అటూ ఇటూ కదులుతూ ‘నిజంగానే ఇవి డైనోసార్లేనేమో’ అనిపిస్తుంటాయి. ఈ డైనో బొమ్మలతోనూ బోలెడు ఆటలుంటాయి.

* ఇవే కాదు హాంటెడ్‌ హౌస్‌ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఇందులో కారు చీకట్లో బెదరగొట్టే రూపాలు, బొమ్మలు ఉంటాయి.

* 2013లో మొదలుపెడితే ఇది ఇప్పటికి పూర్తయ్యింది.

* దీనికోసం ఒక బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. అంటే మన రూపాయల్లో దాదాపు ఆరువేల ఏడువందల కోట్లు.

* ముప్ఫైవేల మంది ఒకేసారి దీన్ని సందర్శించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని