కొత్త భవనమోయ్‌! అన్నీ తిరగెయ్‌!!

ఎప్పుడైనా సరదాగా తల కిందికి చేసి కాళ్లుపైకెత్తి మీ ఇంటిని చూశారా? వస్తువులన్నీ తిరగేసినట్టు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువూ మన పైనున్నట్టు వింతగా అనిపిస్తుంది. కానీ జర్మనీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభమైన ‘అప్‌సైడ్‌ డౌన్‌ కేఫ్‌’ దగ్గరికి వెళ్లామనుకోండి...

Published : 16 Sep 2016 00:57 IST

కొత్త భవనమోయ్‌! అన్నీ తిరగెయ్‌!!

  ఒక భవనం తలకిందులైంది... అందులో వస్తువులు కూడా ఉల్టా అయ్యాయి... ఇదేదో భూకంపం వచ్చి జరగలేదు... మరి ఎందుకో ఏమిటో తెలుసుకుందామా!

ప్పుడైనా సరదాగా తల కిందికి చేసి కాళ్లుపైకెత్తి మీ ఇంటిని చూశారా? వస్తువులన్నీ తిరగేసినట్టు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువూ మన పైనున్నట్టు వింతగా అనిపిస్తుంది. కానీ జర్మనీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభమైన ‘అప్‌సైడ్‌ డౌన్‌ కేఫ్‌’ దగ్గరికి వెళ్లామనుకోండి... ఇలా శీర్షాసనం వేయకున్నా భవనమంతా తిరగబడినట్టే ఉంటుంది. అందుకే దీనికా పేరు.

* సందర్శకులు ఇందులో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసేస్తున్నాయి. దీంతో దీనికి మరింత ఆదరణ పెరిగిపోయింది.

* ఇలాంటి తిరగబడి ఉన్న నిర్మాణాలు గతంలో కొన్ని ఉన్నా వాటి ప్రత్యేకత బయటి భాగం వరకు మాత్రమే. కానీ ఈ కొత్త కేఫ్‌ అలా కాదు. లోపల ఉన్న అతి చిన్న వస్తువు కూడా తిరగేసే ఉండటం దీని విశేషం.

* దూరం నుంచి చూస్తే ‘భవనం ఇలా తలకిందులయ్యిందేమిటి?’ అనిపిస్తుంది. లోపలికి వెళితే మరింత ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ కేఫ్‌ భవనం ఇంటిని బోర్లిస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలా ఉంటుంది. కుర్చీలు, బల్లలు, సోఫాలు, సింకులు, కిటికీలు, విద్యుత్తు దీపాలు, మంచాలు, వాషింగ్‌ మెషిన్‌, రిఫ్రిజిరేటర్‌ ఇలా ప్రతి ఒక్క వస్తువూ తిరగేసినట్టే దర్శనమిస్తుంది.

* ఈ భవంతిలో అటూ ఇటూ నడుస్తుంటే భలే గమ్మత్తయిన అనుభూతి కల్గుతుంది. మంచాలు, టేబుళ్లు మన నెత్తి మీద ఉంటాయి. క్యాలెండర్లు, అలంకరణ వస్తువులు అన్నీ తలకిందులుగానే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో తిరగేసిన లోకంలా ఉంటుందన్నమాట.

* అంతేకాదు ఈ కేఫ్‌లోని కాఫీకప్పులు కూడా తిరగేసే ఉంటాయి.

* పర్యటకుల్ని ఆకట్టుకోవడానికి భవనం నిర్మాణంతో పాటు ఈ కేఫ్‌ మొత్తాన్ని విభిన్నంగా నిర్మించాలనే ఆలోచనతో ఇలా తయారుచేశారు. మరి 

లోపలున్న వస్తువులు ఎలా నిలబడి ఉన్నాయి అంటే? ప్రతి వస్తువును పైకప్పునకు అతికించి పడిపోకుండా రూపొందించారు. డైనింగ్‌ బల్లపై ఉంచిన పండ్లు, కంచాలు వంటివి కూడా అతికించి నిజంగా తిరగేసి చూస్తే ఎలా ఉంటుందో అలా అచ్చుగుద్దినట్టు మలిచి పెట్టారు.

* స్నానాల గది, వంట గది ఎందులోకి వెళ్లినా కూడా ఇలా తిరగేసినట్టే విభిన్నంగా తీర్చిదిద్దారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని