కలం, కాగితం పుట్టిందిక్కడే!

మూడు రంగుల మధ్యలో జాతీయ చిహ్నం ‘బంగారు గద్ద’ ఉంటుంది. ఆక్రమణ, అణచివేతలపై జరిగిన పోరాటాలకి ఎరుపు, ఉజ్వల భవితకు తెలుపు, బ్రిటిషర్లపై పోరాటం ముగింపునకు నలుపు ప్రతీకలు. ఈజిప్టనగానే గుర్తొచ్చేవి పిరమిడ్లే. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు,

Published : 18 Sep 2016 01:43 IST

కలం, కాగితం పుట్టిందిక్కడే!

* రాజధాని: కైరో, విస్తీర్ణం: 10,10,407 చదరపు కిలోమీటర్లు
* జనాభా: 9,16,70,000, కరెన్సీ: ఈజిప్షియన్‌ పౌండ్‌, భాష: అరబిక్‌

 


 

జెండా: మూడు రంగుల మధ్యలో జాతీయ చిహ్నం ‘బంగారు గద్ద’ ఉంటుంది. ఆక్రమణ, అణచివేతలపై జరిగిన పోరాటాలకి ఎరుపు, ఉజ్వల భవితకు తెలుపు, బ్రిటిషర్లపై పోరాటం ముగింపునకు నలుపు ప్రతీకలు.


 

* ఈజిప్టనగానే గుర్తొచ్చేవి పిరమిడ్లే. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు, వారి కుటుంబాల్లో చనిపోయిన వారి శరీరాల్ని భద్రపరిచేందుకు వీటిని నిర్మించేవారు. 130కి పైగా పిరమిడ్లు ఉన్నాయిక్కడ.
* టోలెమిక్‌ రాజవంశంలో చివరిగా ఈజిప్టును పరిపాలించిన రాణి క్లియోపాత్ర. అందగత్తె అయిన ఆమె అంతర్యుద్ధంతో రగిలిపోతున్న రాజ్యంలో శాంతిని నింపి చరిత్రలో నిలిచిపోయింది.


 

* మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. జనాభాలో 90 శాతం మంది ముస్లింలే.
* పిల్లుల్ని పూజిస్తారు. గతంలో వాటిని చంపడం నేరం. ప్రమాదవశాత్తూ అలా జరిగినా ఇక్కడ కఠిన శిక్షలుండేవి. వాటిని తమ అదృష్ట దేవతలుగా భావించేవారు.


 

* ప్రాచీన కాలంలోనే వీరికి రాసేందుకు లిపి ఉంది. వారు అప్పట్లోనే రాళ్లతో తయారు చేసిన తలగడల్ని వాడేవారు. మనం ఇప్పుడు ఆడే బోర్డ్‌గేమ్‌లు వారికి రెండు వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి.
* ప్రపంచంలోనే పాత చొక్కా ఇక్కడ దొరికింది. ఇది 5000 ఏళ్ల క్రితం నాటిదట.


 

* కాగితం, కలం, తాళాల్ని తొలుత వీరే తయారుచేశారు. ఎప్పటి నుంచో వీరు టూత్‌పేస్ట్‌ని కూడా తయారుచేసుకుని ఉపయోగించేవారు.
* ఇక్కడున్న పిరమిడ్లన్నింటిలో ఖుఫు పిరమిడ్‌ అతి పెద్దది. అన్నింటికీ నాలుగు తలాలు ఉంటే దీనికి ఎనిమిది తలాలుంటాయి. దీన్నే గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా అని కూడా అంటారు. దీని పొడవు 460 అడుగులు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే ఇదే పెద్దది.


 

* పడవల్ని మొట్టమొదట తయారుచేసిందిక్కడే. క్రీ.పూ. 3000 సంవత్సరాల్లోనే వీరు వాటిలో ప్రయాణించి వ్యాపారాలు చేసేవారు.


 

* అతి పొడవైన నైలు నది ఈ దేశంలోనే కాకుండా పది దేశాల్లో ప్రవహిస్తోంది. దీని పరీవాహక ప్రాంతాల్లోనే పంటలు పండిస్తారు. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కావడంతో మిగిలిన ప్రాంతాలు ఎడారుల్ని తలపిస్తాయి.


 

* ఇక్కడి అలెగ్జాండ్రియాలో ఓ గ్రంథాలయం ఉంది. అంతర్జాల వెబ్‌సైట్లలో ఉండే ప్రతి వెబ్‌సైట్‌ పేజీలు ఇందులో ఉంటాయిట. 1996లో దీన్ని ప్రారంభించారు.   

* ప్రాచీన ఈజిప్షియన్లు, 2000 మందికి పైగా దేవుళ్లను కొలిచేవారు. స్త్రీలు, పురుషులు మేకప్‌ వేసుకునేవారు. సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం కళ్ల దగ్గర రాగి లేదా సీసంతొ  తయారు చేసిన నల్లటి రంగు వేసుకునేవారు.


 

* ప్రపంచంలో అంతర్జాలాన్ని ఎక్కువగా వాడే దేశాల్లో ఇది 21వ స్థానంలో ఉంది.
* మరుగుజ్జులన్నా వీరికి గౌరవం ఎక్కువ. వారిని చులకనగా చూడరు.
* పెళ్లిళ్ల సమయంలో ఉంగరాలు మార్చుకునే సంప్రదాయం ఇక్కడిదే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని