ఆహా... కరగని మంచు గుహ!

‘ఫ్రోజెన్‌’ త్రీడీ సినిమా చూసే ఉంటారు...అదో మంచు రాజ్యం... అందులో అందమైన రాకుమారి ఎల్సా... తన కోసం ఓ పెద్ద మంచుకోటను కట్టుకుంటుంది... అచ్చం అలాంటి కోట నిజంగానే ఉంది... ఇంతకీ ఎక్కడ....

Published : 23 Sep 2016 01:57 IST

ఆహా... కరగని మంచు గుహ!

‘ఫ్రోజెన్‌’ త్రీడీ సినిమా చూసే ఉంటారు...అదో మంచు రాజ్యం... అందులో అందమైన రాకుమారి ఎల్సా... తన కోసం ఓ పెద్ద మంచుకోటను కట్టుకుంటుంది... అచ్చం అలాంటి కోట నిజంగానే ఉంది... ఇంతకీ ఎక్కడ?
ప్రపంచవ్యాప్తంగా బోలెడు మంచుగుహలు ఉంటాయి. కానీ చైనాలోని ‘లుయుషాన్‌ మౌంటెన్‌ నింగ్‌వు’ మంచుగుహ మాత్రం ప్రత్యేకం. ఎందుకో ఏమిటో చదివేస్తే పోలా!

* మంచుగుహలు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే లోపల మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటాయి. కానీ ఈ మంచు గుహ మాత్రం ఏడాది పొడవునా చల్లచల్లని మంచుగడ్డలతోనే ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉన్నా ఏమాత్రం కరిగిపోకుండా ఉంటుందిట.
* హిమ మయంగా ఉండే ఈ గుహలో అడుగుపెట్టగానే పైనుంచి పొడుచుకు వచ్చిన పొడవైన మంచుకడ్డీలు, మంచు గోడలు ఫ్రోజెన్‌ చిత్రంలోని మంచుకోట విశేషాల్ని గుర్తుకు తెస్తాయి. ఆ మంచుకోటను పోలినట్టు ఉండే ఆకారాలే ఉంటాయి. 278 అడుగుల లోతుండే ఈ గుహలో ఏర్పాటు చేసిన మెట్లు కూడా మంచుతో కప్పబడిపోయి భలేగా ఉంటాయి.
* ఇందులో ఏర్పాటు చేసిన 200 విద్యుత్తు బల్బుల కాంతి ఆ మంచుగడ్డలపై పడుతుంటే రంగు రంగులతో మెరిసిపోతూ మరింతగా ఆకట్టుకుంటాయి. చమక్కు చమక్కుమంటూ రంగు రాళ్లలా కనువిందుచేస్తాయి.
* వేసవిలో కూడా కరిగిపోకుండా ఈ గుహ ఎలా ఉంటుంది అంటే? షాపింగ్‌ మాల్స్‌లో కనిపించే ‘బౌలింగ్‌ పిన్‌’ ఆట తెలుసుగా. బంతి విసిరితే దూరంగా వరుసలో ఉన్న బౌలింగ్‌ పిన్స్‌ పడిపోతుంటాయి. అచ్చం ఆ బౌలింగ్‌ పిన్‌ ఆకారంలో ఈ గుహ వింతగా ఉండటం వల్లే ఇందులోని మంచు ఎప్పుడూ కరిగిపోకుండా ఉంటుంది. వేడి లోపలికి రాకుండా ఉంటుంది.
* చైనాలో ఇప్పటి వరకు గుర్తించిన వాటిల్లో ఇదే అతి పెద్ద మంచుగుహ. ఇది ఎప్పుడో ముప్ఫై లక్షల ఏళ్లక్రితమే మంచుయుగంలో ఏర్పడిందిట.
* మే నుంచి అక్టోబర్‌ వరకు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహని చూడ్డానికి రోజుకు వెయ్యి మంది పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని