కొలను ఒకటే...నీళ్లు రెండు రకాలు!

ఆ నీళ్లలో డైవింగ్‌ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో బోలెడు మంది వస్తుంటారు. లోపలున్న వింతల్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. అద్భుతాల్ని చూసి కేరింతలు కొడతారు. ఇదంతా మెక్సికోలోని ‘యుకటాన్‌’ ద్వీపకల్పంలోని సెనోట్‌ అనే సింక్‌ హోల్‌ సంగతి.

Published : 06 Oct 2016 01:12 IST

కొలను ఒకటే...నీళ్లు రెండు రకాలు!

అదో సహజ సిద్ధమైన నీటి కొలను...రెండు వందల అడుగుల లోతుంటుందంతే...అయినా ఓ మంచి పర్యటక ప్రాంతం...ఎందుకో? దాని గొప్పేంటో?చదివేస్తే పోలా?

నీళ్లలో డైవింగ్‌ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో బోలెడు మంది వస్తుంటారు. లోపలున్న వింతల్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. అద్భుతాల్ని చూసి కేరింతలు కొడతారు. ఇదంతా మెక్సికోలోని ‘యుకటాన్‌’ ద్వీపకల్పంలోని సెనోట్‌ అనే సింక్‌ హోల్‌ సంగతి. చిన్న నీటి కొలనులా ఉండే ఇది ఎన్నో ఏళ్లక్రితం సున్నపురాళ్లు బద్ధలై భూగర్భంలోంచి నీరు బయటికి రావడం వల్ల ఏర్పడింది. నీటి అడుగున చెట్లు ఉండడం మరో విశేషం. మరి దీని సంగతులు తెలుసుకుందాం.

* పారదర్శకమైన నీటితో కనిపించే ఈ సింక్‌హోల్‌లో రెండు రకాల నీళ్లు విడివిడిగా కలిసిపోకుండా ఉంటాయి. అవును... పైనుంచి 100 అడుగుల లోతు వరకు మంచి నీరు, దాని కింద వంద అడుగుల లోతు వరకు ఉప్పు నీళ్లు ఉంటాయి.

* ఇది ఎలా సాధ్యం అంటే? ఈ రెండు రకాల నీళ్లు కలిసి పోకుండా మధ్యలో హైడ్రోజన్‌ సల్ఫేట్‌ పదార్థంతో ఏర్పడిన మూడు అడుగుల మందపాటి పొర ఉంటుంది. పైనున్న మంచి నీటిని, కిందున్న ఉప్పు నీటిని ఇది గోడలా ఉండి వేరుచేస్తూ ఉంటుంది. సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పు నీరు మంచి నీటి కన్నా కింద ఉంటుందన్నమాట. ఒకే దాంట్లో ఈ రెండు రకాల నీళ్లు ఉండడం వల్ల సాహసికులకు ఇదో అద్భుత లోకంలా కనిపిస్తుంది.

* దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో ఓ ఉత్తుత్తి భూగర్భ నది ఉంటుంది. ఉత్తుత్తి భూగర్భ నది ఏంటి అనుకుంటున్నారా? ఇందులో పైన, కింద ఉన్న ఈ రెండు రకాల నీళ్లమధ్యలో ఉన్న హైడ్రోజన్‌ సల్ఫేట్‌ పొర అటూ ఇటూ కదలడం వల్ల నీళ్లలో తరంగాలు వస్తాయి. దీంతో ఆ పొర చుట్టూ ఉన్న నీరు ప్రవహిస్తుంది. అందుకే ఈ మధ్యలోని ప్రాంతాన్ని భూగర్భ నదిగా పిలుస్తారు. దీనికి ‘సెనోట్‌ ఏంజలిటా’ అని పేరు కూడా పెట్టారు. అంటే ఆంగ్లంలో లిటిల్‌ ఏంజెల్‌ అని అర్థం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని