చెక్క గుడి... చిత్రమే మరి!

గుడంటే ఓ గోపురం, లోపల దేవుడి విగ్రహం ఇవే మనకు గుర్తొస్తాయి. అయితే చైనాలోని షాంక్సీలో ‘సఖ్యముని పగోడా ఆఫ్‌ ఫోగోంగ్‌’ అని ఓ బౌద్ధాలయం ఉంది. గోపురం సహా దాన్నంతా అచ్చంగా చెక్కతోనే కట్టారు. ఎక్కడా కొంచెం ఇనుమును కూడా వాడలేదట.

Published : 08 Oct 2016 00:44 IST

చెక్క గుడి... చిత్రమే మరి!

ఓ దేవాలయం ఉంది...దానికి భలే ప్రత్యేకత ఉంది...అందుకే ప్రపంచ రికార్డూ కొట్టింది... ఇంతకీ ఏంటో అది? చదివేద్దామా?
గుడంటే ఓ గోపురం, లోపల దేవుడి విగ్రహం ఇవే మనకు గుర్తొస్తాయి. అయితే చైనాలోని షాంక్సీలో ‘సఖ్యముని పగోడా ఆఫ్‌ ఫోగోంగ్‌’ అని ఓ బౌద్ధాలయం ఉంది. గోపురం సహా దాన్నంతా అచ్చంగా చెక్కతోనే కట్టారు. ఎక్కడా కొంచెం ఇనుమును కూడా వాడలేదట. అందుకే ఇది చెక్కతో కట్టిన అతి ఎత్తైన దేవాలయంగా రికార్డు కొట్టింది. గిన్నిస్‌బుక్‌లో ఈ మధ్యే చోటూ సంపాదించింది.
* ఇది చైనా సంప్రదాయ కట్టడాలకు అద్దంపట్టేలా ఉంటుంది. గోపురం ఎత్తు ఎంతో తెలుసా? 220 అడుగులు. బయటకి ఐదంతస్తుల గోపురంలా ఉంటుంది కానీ లోపల చిత్రంగా తొమ్మిది అంతస్తులుంటాయి. ఓ బండ రాయిపై దీన్ని కట్టారు.
* దీన్ని క్రీస్తు శకం 1056లో కట్టారు. అంటే దీని వయసు ఇప్పుడు 960 ఏళ్లు. చక్రవర్తి డ్యోజోంగ్‌ దీన్ని ఎనిమిది తలాల గొడుగు ఆకారంలో ఉండేట్లుగా కట్టించారు.
* ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని ఇది ఇప్పటి వరకు అలాగే నిలిచి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
* ఎక్కడా ఇనుము వాడకుండా మరి దీన్ని ఎలా కట్టారబ్బా? కనీసం ఇనుప మేకులైనా వాడరా? అన్న సందేహం ఎవ్వరికైనా వస్తుంది. కానీ దీనిలో చెక్క మేకుల్నే వాడారు. మూలల్ని కలిపేందుకు 54 రకాలకు పైగా చెక్క బ్రాకెట్లను ఉపయోగించారు.
* ప్రపంచంలో ఉన్న చెక్క దేవాలయాల్లో ఇదే అతి ఎత్తైనదని గిన్నిస్‌ వాళ్లు రికార్డు ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని