కాలినడకన చుట్టి వచ్చే బుల్లి రాజధాని!

జెండా: నీలం రంగు ఆకాశానికి, సముద్రానికి గుర్తు; పసుపు సూర్యకాంతికి, జీవానికి; ఎరుపు- ఐకమత్యానికి, ప్రేమకి చిహ్నం. తెలుపు సామాజిక న్యాయానికి, సామరస్యానికి గుర్తు. ఆకుపచ్చ ప్రకృతికి, పర్యావరణానికి సూచిక.

Published : 09 Oct 2016 01:22 IST

కాలినడకన చుట్టి వచ్చే బుల్లి రాజధాని!

సీషెల్స్‌...

* సీషెల్స్‌... హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపదేశం. మొత్తం 115 దీవులతో ఉంటుందిది.

* ఈ బుల్లి దేశంలో ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునేవారు. వచ్చిపోయే నౌకల్ని లూటీ చేసి డబ్బులు ఇక్కడ దాచుకునేవారట. ‘ఆలివర్‌ లే వస్సెర్‌’ అనే సముద్రపు దొంగ దాచుకున్న లక్ష యూరోలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు.


* రాజధాని విక్టోరియా ప్రపంచంలోనే అతి చిన్న రాజధానుల్లో ఒకటి. నడిచి వెళ్లినా ఒక్కరోజులో నగరమంతా చుట్టిరావచ్చు.

* మొత్తం భూభాగంలో సగానికిపైగా జాతీయ పార్కులతో ఉంటుందిది. పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ విధానాల వల్ల ఇది సాధ్యమైంది.

* కింగ్‌ లూయిస్‌ - 15 రాజు ఆస్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి జీన్‌ మోరియో డి సీషెల్స్‌ పేరును ఈ ద్వీపానికి పెట్టారు.


* ఈ దీవిలో అందమైన తోకతో ఉన్న ‘ప్యారడైజ్‌ ఫ్లైకాట్చర్‌’ వంటి బోలెడు వింత పక్షులు ఉన్నాయి.

* మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ‘వాస్కో డా గామా’ 15వ శతాబ్దంలో ఈ దీవిని గుర్తించారు. తర్వాత ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ అధీనంలో ఉండి ఈ దేశం 1976లో స్వాతంత్య్రం పొందింది.

* ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సహజవనరులతో సంపన్నంగా ఉన్న దేశాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.


* ప్రపంచంలోనే భారీ విత్తనం ఉన్నది ఈ దేశంలోనే. పేరు ‘కోకో డి మెర్‌’. కొబ్బరికాయని పోలి ఉన్న ఈ విత్తనం 30 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ‘డబుల్‌ కోకోనట్‌’ అని కూడా పిలుస్తారు.

* జేమ్స్‌బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ‘ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ’ రాయడానికి అవసరమైన ప్రేరణ కోసం సీషెల్స్‌ని సందర్శించారు.

* హిందూ మహా సముద్రంలో ఎగరలేని పక్షి అయిన ‘వైట్‌ త్రోటెడ్‌ రైల్‌’ ఉండేది ఇక్కడే.

* 304 కిలోల అత్యధిక బరువుండే ‘ఎస్మెరాల్డా’ అనే తాబేళ్లు ఉండేది ఇక్కడే.


* ఈ ద్వీపదేశం మంచి సందర్శక ప్రాంతం. దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ ఆదాయం పర్యటకం ద్వారా పొందుతారు.

* ఇక్కడ అరుదైన జెల్లీఫిష్‌ చెట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇవి ఎనిమిది మాత్రమే ఉన్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని