కొత్తదాననండీ...నా గుట్టు చెబుతానంగడీ...

కుందేలులా ఉంటుంది కానీ కుందేలు కాదు..ఎలుకలా అనిపిస్తుంది కానీ ఎలుకా కాదు...అదో బుల్లి కొత్త జీవట... దాని విశేషాలేవో అదే చెబుతుందట! హాయ్‌ మిత్రులారా! నన్ను చూస్తే ఏమీ అర్థం కావడం లేదా? ‘మనకు తెలిసినదేనా? మరేదైనా కొత్త జీవా?’ అని తికమకపడుతున్నారా? మీ అనుమానాలన్నీ చిటికెలో తీర్చేస్తానుండండి.

Published : 10 Oct 2016 01:42 IST

కొత్తదాననండీ...నా గుట్టు చెబుతానంగడీ

కుందేలులా ఉంటుంది కానీ కుందేలు కాదు..ఎలుకలా అనిపిస్తుంది కానీ ఎలుకా కాదు...అదో బుల్లి కొత్త జీవట... దాని విశేషాలేవో అదే చెబుతుందట!

హాయ్‌ మిత్రులారా! నన్ను చూస్తే ఏమీ అర్థం కావడం లేదా? ‘మనకు తెలిసినదేనా? మరేదైనా కొత్త జీవా?’ అని తికమకపడుతున్నారా? మీ అనుమానాలన్నీ చిటికెలో తీర్చేస్తానుండండి.

* మరేమో ఒచొటొనో జాతికి చెందిన ‘పికా’ అని ఓ బుల్లి క్షీరదం ఉందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను దాని దూరపు చుట్టాన్ని.

* ముందు నుంచి చూస్తే కుందేలులా కనిపిస్తా. కానీ పొడవాటి చెవులుండవు. మరో వైపు నుంచి చూస్తే ఎలుకలా, ముదురు గోధుమ రంగులో కనిపిస్తా. పరిమాణంలోనూ అంతే. కానీ తోకుండదు.

* మీ దేశంలోనే సిక్కిం రాష్ట్రం లేదూ? అక్కడి హిమాలయ పర్వతాల దగ్గర శాస్త్రవేత్తలు నన్ను గుర్తించారు. మొదట వారూ మీలాగే తికమక పడ్డారు. కానీ నా డీఎన్‌ఏని మిగిలిన పికాల డీఎన్‌ఏతో పోల్చి చూసి, పుర్రె కొలతల్ని పరీక్షించారు. అప్పుడే నేనూ వాటిల్లో ఓ ఉపజాతికి చెందిన దాన్నని తేలింది.

* దీంతో వారంతా కలిసి నాకు ఒచొటొనో సికిమేరియా అనీ, సిక్కిం పికా అని పేర్లు పెట్టేశారు.

* మేము సిక్కింలో మాత్రమే ఉంటామా? లేకపోతే చైనా, మయన్మార్‌, భూటాన్‌ దేశాల్లోనూ విస్తరించి ఉన్న హిమాలయాల్లో ఉంటామా? అనే దానిపై ఇప్పుడు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.

* ఆ విషయం తెలిస్తే ముందుగా సంతోషించేది నేనే మరి. నా అక్క, చెల్లెళ్లు, బంధువులు అక్కడా ఉన్నారని తెలుస్తుంది కదా.

* మేము మనుషులెవరికీ పెద్దగా కనిపించం. హిమాలయాల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బొరియల్లో, రాళ్ల మధ్యలో నివసిస్తాం. ఆకులు, అలమల్లాంటివి తిని బతికేస్తాం. చలిగా ఉండే ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతాం. బాగా చలుంటే ఆహారం వెతుక్కోవడం కష్టమవుతుంది కదా? అందుకే శీతకాలం కోసం ముందుగానే ఆహారాన్ని బొరియల్లో దాచుకుంటాం.

* మీ మనుషులు చేసే పనుల పుణ్యమా అని ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి కదా! అంత వేడిని మేము తట్టుకోలేమట. అందుకే ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు. మరి మమ్మల్ని కాపాడేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఇక ఉంటానే బైబై.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని