అనగనగా గుహ ఉంది... అందులో వింత ఉంది!

ఎక్కడైనా మంచు చలికాలంలో ఏర్పడుతుంది... వేసవిలో కరిగిపోతుంది... కానీ ఆ గుహలో మాత్రం అలా కాదు... వేసవిలో ఏర్పడుతుంది! చలికాలంలో కరిగిపోతుంది! అందుకే అదొక వింత...దాని సంగతులేంటో తెలుసుకుందామా?

Published : 25 Oct 2016 01:10 IST

అనగనగా గుహ ఉంది... అందులో వింత ఉంది!

ఎక్కడైనా మంచు చలికాలంలో ఏర్పడుతుంది... వేసవిలో కరిగిపోతుంది... కానీ ఆ గుహలో మాత్రం అలా కాదు... వేసవిలో ఏర్పడుతుంది! చలికాలంలో కరిగిపోతుంది! అందుకే అదొక వింత...దాని సంగతులేంటో తెలుసుకుందామా?

గుహ అవడానికి చిన్నదే. అయితే అందులో ఒక వింత ఏర్పడుతుంది. దాన్ని చూడ్డానికి పర్యటకులు వేలాదిగా వస్తుంటారు. అలాగని ఇదేదో కృత్రిమ గుహ అనుకునేరు. సహజంగా ఏర్పడిందే. పేరు ‘కౌడర్‌స్ఫోర్ట్‌ ఐస్‌ మైన్‌’.

* చూడాలంటే విమానమెక్కి అమెరికాలోని పెన్సిల్వేనియాకు వెళ్లాల్సిందే.

 

* ఈ ఐస్‌మైన్‌ గుహ ఎనిమిది అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవు, నలభై అడుగుల లోతుతో ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు ఉత్సాహంగా ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. ఈ గుహ హిమమయంగా మారిపోతుంది. మూడు అడుగుల మందంతో 25 అడుగుల పొడవుతో మంచుగడ్డలు చిన్న సైజు కొండలుగా పేరుకుపోతాయి. ఈ మంచు ఏర్పడటం ఏప్రిల్‌ నుంచి మొదలై సెప్టెంబరు వరకు ఉంటుంది. వేసవి ముగిసేంత వరకూ కొనసాగుతుందీ ప్రక్రియ.

* అయితే శీతకాలంలో ఈ పరిస్థితి తలకిందులవుతుంది. బయట చల్లగా ఉన్నా... రాతి గుహల్లో దాగున్న వేడి గాలుల వల్ల ఈ మంచు అంతా కరిగిపోవడం మొదలుపెడుతుంది.

 

* ప్రపంచంలో ఎక్కడా లేని ఈ చిత్రమైన గుహ రహస్యం ఏంటో తెలుసా? ఓ వాదన ప్రకారం శీతకాలంలో వచ్చే చల్లని గాలులు ఇక్కడ పర్వత పగుళ్లలో చొచ్చుకుని ఉండిపోతాయి. వేసవికాలం రాగానే ఆ చల్లగాలులు బయటకు వచ్చి ఈ గుహలో ఒక దగ్గర చేరి భూగర్భ నీటితో కలుస్తాయి. అలా మంచుగడ్డలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ ప్రకృతి వింత అందర్నీ అబ్బురపరుస్తుంది.

* ఈ మంచు గనిని 1894లో జాన్‌ డాడ్‌ అనే ఆయన తొలిసారిగా కనిపెట్టారు.

* చాలా ఏళ్లుగా మూతబడి ఉన్న ఈ గుహను సందర్శకుల కోసం 2014లోనే కొత్తగా తెరిచారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు