కురూపి యువరాణి... అందాల జలపాతమైంది!

అనగనగా ఓ రాజు, రాణి. వీరికి అధికార దర్పం చాలా ఎక్కువ. రాణి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు ఓ తపస్విని యాచకురాలిగా వేషం వేసుకుని రాణి దగ్గరకు వెళ్లింది. గర్వంతో ఆ రాణి యాచకురాలిని చీదరించుకుని బయటకు వెళ్లగొట్టింది.

Published : 05 Nov 2016 00:41 IST

కురూపి యువరాణి... అందాల జలపాతమైంది!

అందమైన జలపాతం...ఓ లోయలో దాక్కుంది...అదే దాని ప్రత్యేకత...చూడాలంటే ఎన్నో మెట్లు దిగాలి...ఇంతకీ ఎక్కడుందిది?

నగనగా ఓ రాజు, రాణి. వీరికి అధికార దర్పం చాలా ఎక్కువ. రాణి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు ఓ తపస్విని యాచకురాలిగా వేషం వేసుకుని రాణి దగ్గరకు వెళ్లింది. గర్వంతో ఆ రాణి యాచకురాలిని చీదరించుకుని బయటకు వెళ్లగొట్టింది. దాంతో ఆ తపస్విని కోపంతో మీకు పుట్టబోయే బిడ్డ వికారంగా పుడుతుందని శపించింది. కొన్నాళ్లకు రాణికి అందవికారమైన పాప పుట్టింది. ఆమెను ఎవరికీ చూపించలేక రాజు, రాణి అడవిలోని ఓ గుహలో ఉంచి పెంచారు. ఆ పాపకి టినాగ్‌ అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసా? దాగిన ముఖం అని! ఆ పాప పెరిగి పెద్ద దయ్యాక గుహలోంచి బయటకు వచ్చి ప్రకృతి అందాల్ని చూసి మురిసిపోయింది. కానీ తన కురూపితనానికి కుమిలిపోయింది. ఆమెను చూసి జాలిపడిన తపస్విని ‘నిన్నూ అందంగా మార్చమంటావా?’ అని అడిగింది. ఆ అమ్మాయి సరే అనగానే అందమైన జలపాతంగా మార్చేసింది. ఇదంతా ‘టినాగో వాటర్‌ఫాల్స్‌’ వెనక ప్రచారంలో ఉన్న ఓ కథ.

* పచ్చని చెట్ల మధ్యలో ఉండే ఈ జలపాతాన్ని చూడాలంటే ఫిలిప్పీన్స్‌ వెళ్లాలి.

* ఇక్కడి ఇలిగాన్‌ నగరానికి దగ్గర్లో ఉండే బరంగే డిటుకలన్‌ అనే పేద్ద లోయలో 240 అడుగుల ఎత్తు నుంచి ఇది జాలువారుతుంది. కిందుండే నీళ్లు ఈత కొలను నీటిలా ఆకట్టుకుంటాయి.

* లోయలో దాగి ఉంటుంది కాబట్టే దీనికి టినాగో అని పేరు.

* ఈ లోయను చూడాలంటే పై నుంచి కిందకు దాదాపు 500 మెట్లు దిగి వెళ్లాలి.

* ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతూ ఈ జలపాతం భలేగా ఉంటుంది.

* ఇదో మంచి పర్యటక ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో ట్రెక్కింగ్‌ సాహసికులు, సందర్శకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని