జిల్‌ జిల్‌ జిగేల్‌... రంగు రంగుల హొయల్‌!!

ఓ రాయి లావాలా ఎర్రగా ధగధగా మెరుస్తుంది... మరో రాయి ఆకుపచ్చ రంగులో జిగేలుమంటుంది... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఒక్కో రాయి ఒక్కో రంగులో వెలిగిపోతుంది... వింత కాంతుల లోకాన్ని కళ్లముందుకు తెస్తాయి... ఇంతకీ ఏంటీ ఇదంతా?

Published : 12 Nov 2016 01:25 IST

జిల్‌ జిల్‌ జిగేల్‌... రంగు రంగుల హొయల్‌!!

ఓ రాయి లావాలా ఎర్రగా ధగధగా మెరుస్తుంది... మరో రాయి ఆకుపచ్చ రంగులో జిగేలుమంటుంది... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఒక్కో రాయి ఒక్కో రంగులో వెలిగిపోతుంది... వింత కాంతుల లోకాన్ని కళ్లముందుకు తెస్తాయి... ఇంతకీ ఏంటీ ఇదంతా?

కరకాల కళాఖండాలతో, అద్భుతమైన చిత్రాలతో మ్యూజియాలు ఆకట్టుకుంటాయి. కానీ ఫ్లోరొసెంట్‌ ఆర్ట్‌ ప్రదర్శనశాల మాత్రం దాని తళతళ మెరుపులతో కట్టిపడేస్తుంది. సందర్శకుల్నీ ఓ కళాఖండంలో భాగంగా చేసేస్తుంది. అదే దీని ప్రత్యేకత.

* ఇది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంది.

* ప్రపంచంలోనే ఏకైక ‘ఫ్లోరొసెంట్‌ ఆర్ట్‌’ మ్యూజియమిది. అంటే ప్రకాశవంతమైన కళారూపాలతో ఉన్న వింతైన ప్రదర్శనశాలన్నమాట.

* దీనికే ‘ఎలక్ట్రిక్‌ లేడీల్యాండ్‌’ అని కూడా పిలుస్తారు.

* ఇందులో అడుగుపెట్టగానే వింత ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం ఇలా ఇంద్రధనుస్సు రంగులన్నీ జిగేలుమంటాయి.

* ఇంతకీ ఈ కాంతులకు కారణం ఏంటి అంటే? ఇక్కడ ఉంచిన రకరకాల రాళ్ల వల్లే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అరుదైన రాళ్లను ఇక్కడ చూడొచ్చు. మామూలు కాంతిలో సాధారణంగా ఉండే ఈ రాళ్లు అతినీల లోహిత కాంతి పడగానే రకరకాల రంగుల్లో మెరుస్తుంటాయి.

* చేతిలో పట్టేంత రాళ్ల దగ్గర్నించి భారీ పరిమాణం రాళ్లవరకు వేలాదిగా ఉన్నాయిక్కడ. వీటికే కాస్త కళానైపుణ్యం జతచేసి మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చిమ్మచీకట్లో వెలుగు పడగానే చమక్కుమంటాయివి. సందర్శకులు వీటి దగ్గర నిలబడితే వివిధ వర్ణాల కాంతులు వాళ్లపై పడి ఆ వింత లోకంలో భాగంగా కనిపిస్తుంటారు.

* అమెరికాకు చెందిన నిక్‌ పడలినో అనే కళా కారుడు 1999లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.

* అరుదైన రాళ్లతో పాటు ఇక్కడ ఫ్లోరొసెంట్‌ కళకు సంబంధించిన చిత్రాల ఆర్ట్‌గ్యాలరీనీ చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని