ఆకులో ఆకునై.... ఈ అడవీ దాగిపోనా!!

సాలీడును మీరు గుర్తుపడతారా? అది ఎలా ఉంటుందో తెలుసా? ఇవేం ప్రశ్నలు? మాకు సాలెపురుగు తెలియకపోవడమేంటీ అంటారు కదా! కానీ కొత్తగా బయటపడ్డ ఓ సాలీడును మీరసలు గుర్తుపట్టలేరు... ఎందుకో ఏమిటో చకచకా చదివేయండి!

Published : 21 Nov 2016 01:11 IST

ఆకులో ఆకునై.... ఈ అడవీ దాగిపోనా!!

సాలీడును మీరు గుర్తుపడతారా? అది ఎలా ఉంటుందో తెలుసా? ఇవేం ప్రశ్నలు? మాకు సాలెపురుగు తెలియకపోవడమేంటీ అంటారు కదా! కానీ కొత్తగా బయటపడ్డ ఓ సాలీడును మీరసలు గుర్తుపట్టలేరు... ఎందుకో ఏమిటో చకచకా చదివేయండి!

కొంతమంది శాస్త్రవేత్తలు ఓ అడవిలోకి వెళ్లారు. ఏవో జీవులపై పరిశోధన చేస్తున్నారు. అదాటున ఏదో కనిపించింది. ‘ఇదేదో ఎండిపోయిన చెట్టు ఆకులా ఉందే’ అనుకున్నారు. కాసేపటికి నిశితంగా చూస్తే అది అటూ ఇటూ కదులుతోంది. అది ఆకు కాదు, ప్రాణమున్న జీవేనని తెలుసుకున్నారు. అన్ని రకాలుగా పరీక్షిస్తే ఓ కొత్తజాతి సాలెపురుగని తేలింది.

* ఈమధ్యే చైనాలో యున్నాన్‌లో దొరికిందిది.
* ఈ సాలీడు వెనక భాగం ఆకుపచ్చ రంగులో, ముందు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి గమ్మత్తుగా పైనుంచి పచ్చని ఆకులా, కిందవైపు నుంచి ఎండిపోయిన ఆకులా ఉంటుంది. అంటే ఒకసారే రెండు రకాల ఆకుల్లా కనిపిస్తుందిది. మామూలు సాలీడులా కాకుండా దీని శరీరం ఆకు ఆకారంలో చివరన వంపు తిరిగి ఉంటుంది.

* ఈ కొత్త సాలీడుకు శాస్త్రవేత్తలు ఇంకా పేరు పెట్టలేదు. కానీ ఇది ఆర్బ్‌ స్పైడర్‌ కుటుంబానికి చెందినదని మాత్రం తెలుసుకున్నారు.
* శత్రువుల నుంచి కాపాడుకోవడానికి, బెదిరించడానికి రకరకాల జీవులు ఇలా రూపాలు, రంగులు మారుస్తాయని తెలిసిందే. కొన్ని సాలెపురుగులూ ఇంతే. కానీ ఇలా అచ్చంగా ఆకులా వేషంతో మాయ చేసేది కనిపించడం ఇదే మొదటిసారిట.
* దీని చిత్రమైన ఆకు వేషధారణతో ఇతర జీవుల్ని సులువుగా బోల్తా కొట్టిస్తుందిది. రకరకాల ఆకుల్ని సేకరించి ఇది చెట్టుపై సాలెగూడును చేసుకుంటుందిట. అలా సాలెపోగుల మధ్యలో నిజమైన ఆకులతో ఉన్న ఈ సాలీడును ఏ జీవీ గుర్తించకుండా తనను తాను రక్షించుకుంటుందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని