రాళ్లలో దాగున్న రూపాలు అతిశయం!

పేరుకు అదో రాళ్ల ప్రదర్శనశాల. అందులో అడుగుపెడితే ఎంతో ఆశ్చర్యపోతాం. ఎందుకో తెలుసా? ఆ రాళ్లలోనే మనకు ఎన్నో రూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ జపాన్‌ టోక్యో దగ్గర ఉన్న ‘రాక్స్‌ మ్యూజియం’ సంగతులు. ....

Published : 25 Nov 2016 01:19 IST

రాళ్లలో దాగున్న రూపాలు అతిశయం!

ఓ రాయి మిక్కీమౌస్‌ తలగా కనిపిస్తుంది... నిమో కార్టూన్‌ చేప మరో రాతిలో దర్శనమిస్తుంది...
ఇంతేనా? వందలాది మనుషుల రాతి తలల్నీ చూడొచ్చు... అసలు వీటి ప్రత్యేకత ఏంటి?


పేరుకు అదో రాళ్ల ప్రదర్శనశాల. అందులో అడుగుపెడితే ఎంతో ఆశ్చర్యపోతాం. ఎందుకో తెలుసా? ఆ రాళ్లలోనే మనకు ఎన్నో రూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ జపాన్‌ టోక్యో దగ్గర ఉన్న ‘రాక్స్‌ మ్యూజియం’ సంగతులు.
* దీని పేరు చిన్‌సెక్కికన్‌. అంటే ఉత్సుకత పెంచే రాళ్ల ప్రదర్శన అన్నమాట.
* దీంట్లో బోలెడు వరుసల్లో 1700 రాళ్లను పేర్చి ఉంచారు. వీటిలో 900 రాళ్లు మనుషుల ముఖాల్లా ఉంటాయి. ఇవి ఎవరో చెక్కినవైతే వింతేమీ లేదు. కానీ ఈ మ్యూజియంలో ఉన్న రాళ్లన్నీ ప్రకృతి సిద్ధంగా రూపొందినవే.
* మరో విశేషం ఏంటంటే... ఈ రాతిముఖాల్లో ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన అమెరికా ప్రసిద్ధ పాప్‌ గాయకుడు ఎల్విస్‌ ప్రెస్లీ వంటి కొన్ని ప్రముఖులవీ దర్శనమిస్తాయి. ఇంకా మనకెంతో ఇష్టమైన మిక్కీమౌస్‌, నిమో చేప, డాంకీ కింగ్‌, సూపర్‌ మారియో వీడియోలో కనిపించే కూప ట్రూప షెల్‌ ఇలా... మనకు పరిచయమున్న రకరకాల ముఖాల పోలికల్ని ఈ రాళ్లలో చూడొచ్చు.
* చూసినవారికి ‘నిజంగానే ఎవరైనా కళాకారులు ఈ రాళ్లని ఇలా చెక్కారేమో!’ అన్నట్లు భలే గమ్మత్తుగా ఉంటాయివి.
* షోజో హయమ అనే ఆయన 50 ఏళ్ల పాటు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ సహజసిద్ధంగా ఏర్పడి, ఆసక్తికరంగా కనిపించే రాతి రూపాల్ని సేకరించాడు. వాటన్నింటితో ఈ మ్యూజియం ఏర్పాటు చేసి అందులో భద్రపరిచాడు.
* ఈ వింత రాళ్ల ప్రదర్శనశాలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని