విసురుగా... జోరుగా... జారిపో!!

ఝామ్మంటూ దూసుకుపోతుంది...ఒక్కసారిగా వూహించని కోణంలో పరుగులు తీస్తుంది... వంపులు వంపులు తిప్పేస్తుంది.... ఉల్టాపల్టా పడేస్తుంది... ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ఏటవాలు రోలర్‌కోస్టర్‌ విశేషాలు...ఎక్కడానికి గుండె ధైర్యం ఉందా? అంతకు ముందు వివరాలు చదివేయండి మరి!

Published : 26 Nov 2016 00:49 IST

విసురుగా... జోరుగా... జారిపో!!

ఝామ్మంటూ దూసుకుపోతుంది...ఒక్కసారిగా వూహించని కోణంలో పరుగులు తీస్తుంది... వంపులు వంపులు తిప్పేస్తుంది.... ఉల్టాపల్టా పడేస్తుంది... ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ఏటవాలు రోలర్‌కోస్టర్‌ విశేషాలు...ఎక్కడానికి గుండె ధైర్యం ఉందా? అంతకు ముందు వివరాలు చదివేయండి మరి!

రోలర్‌కోస్టర్‌పై ఎక్కాక కాస్త పైకీ, కిందకీ అది వంపులు తిరిగితేనే వామ్మో అంటూ కేకలు పెడతాం. మరి ఏకంగా 121 డిగ్రీల కోణంలో తిప్పితే? ఇంకేమైనా ఉందా? గుండెలు అదిరిపోవూ. కానీ ఇలాంటి రోలర్‌కోస్టర్‌ ఒకటి ఉంది. పేరు తకబిష. చూడాలంటే జపాన్‌లోని ఫుజియోషిడా యమనషికి వెళ్లాల్సిందే.

* ప్రపంచంలోనే ఇది ‘స్టీపెస్ట్‌ రోలర్‌కోస్టర్‌’. అంటే అత్యంత ఏటవాలుగా తిరుగుతుందన్నమాట.

* 3,300 అడుగుల పొడవుతో ఉండే ఈ కోస్టర్‌ 141 అడుగుల ఎత్తుతో ఉంటుంది.

* రోలర్‌కోస్టర్‌ కారులో కూర్చోగానే ఒక్కసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ హఠాత్తుగా 121 డిగ్రీల కోణంలో పైనుంచి కిందకు పరుగులు పెడుతుంది. ఏడు పెద్ద పెద్ద మలుపులు తిరుగుతూ నిమిషాల్లో రైడు పూర్తిచేస్తుంది.

* క్షణాల్లో పైకీ కిందకీ రకరకాల వంపులు తిరుగుతుంటే ఎక్కినవారికి గాల్లో తేలిపోయినట్టు వింత అనుభూతి కల్గుతుందిట.

* దీని ఈ ప్రత్యేకత వల్లనే తకబిష అని పేరు. అంటే ఎంతో ఎత్తులో గాల్లో తేలే కారు అని అర్థమట.

* 2011లో ప్రారంభమైన ఈ కోస్టర్‌ వేలాదిమందిని ఆకట్టుకుంటోంది.

మీకు తెలుసా?
* ప్రపంచంలోనే ఎత్తయిన స్టీలు రోలర్‌కోస్టర్‌ అమెరికా సిక్స్‌ఫ్లాగ్స్‌ గ్రేట్‌ అడ్వెంచర్‌లోని కింగ్‌డా కా. ఇది ఏకంగా 456 అడుగుల ఎత్తుంటుంది.

* ప్రపంచంలోని పొడవైన స్టీలు రోలర్‌కోస్టర్‌ జపాన్‌లోని స్టీల్‌డ్రాగన్‌ 2000. ఇది ఏకంగా 8,133 అడుగుల పొడవుంటుంది.

* ప్రపంచంలోనే వేగవంతమైన స్టీలు రోలర్‌ కోస్టర్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లోని ఫార్ములా రోస్సా. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వెళుతుందిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని