మార్స్‌పై మంచోయ్‌... ఓ దేశమంత ఉందోయ్‌!!

మన పొరుగు గ్రహం అంగారకుడిపై మనకెంతో ఆసక్తి... ఎప్పుడూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి...ఇప్పుడు మరో కొత్త విషయం తెలిసింది... ఇక్కడ మంచు భారీగా ఉందిట... అంతో ఇంతో కాదు... ఏకంగా ఓ దేశమంత!

Published : 05 Dec 2016 01:17 IST

 మన పొరుగు గ్రహం అంగారకుడిపై మనకెంతో ఆసక్తి... ఎప్పుడూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి...ఇప్పుడు మరో కొత్త విషయం తెలిసింది... ఇక్కడ మంచు భారీగా ఉందిట... అంతో ఇంతో కాదు... ఏకంగా ఓ దేశమంత!

 న సూర్య కుటుంబంలో గ్రహాలు తెలుసుగా? అందులో అంగారకుడు (మార్స్‌) ఒకటి. దానిపై నీరు ఉందా? లేదా? అన్న విషయంపై తీవ్రంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే కొత్తగా ఈ గ్రహంపై భారీగా మంచు ఉందని బయటపడింది.

* అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాళ్లు ఈమధ్యే మార్స్‌పై ఉన్న ‘ఉటోపియా ప్లానిటియా’ అనే ప్రాంతాన్ని పరిశీలించారు. ‘మార్స్‌ రికనైజాన్స్‌ ఆర్బిటార్‌’ అనే అంతరిక్ష నౌక ద్వారా ఇక్కడ ఉపరితలం కింద గర్భంలో వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు పేరుకుపోయి ఉన్నట్టు గుర్తించారు.

* ఈ భారీ మంచు ఫలకాలు ఏకంగా 19,72,550 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెక్సికో దేశమంత ఉన్నాయిట. మన భూమితో పోలిస్తే భూమధ్య రేఖ నుంచి ఉత్తరధ్రువం వరకు విస్తరించినంతన్నమాట.

* ఒకవేళ ఈ మంచంతా కరిగితే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద సరస్సు అయిన అమెరికాలోని ‘లేక్‌ సుపీరియర్‌’లో పట్టేంత నీరుగా మారుతుందిట.

* 260 అడుగుల నుంచి 560 అడుగుల మందంతో ఈ మంచు ఉంది. దీనిలో పెద్ద పెద్ద రాతి శకలాలు, దుమ్ము, ధూళితో నిండిన నీరు 50 నుంచి 85 శాతం ఉంది.

* అసలీ మంచు ఎప్పుడు ఏర్పడింది అంటే... అంగారక గ్రహపు అక్షం ఇప్పుడున్న దానికన్నా ఒకప్పుడు ఎక్కువగా వంగి ఉండేదిట. ఆ కాలంలో ఈ మంచు పేరుకుపోయి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా.

* ఇంతకాలం ఆ మంచు ఉపరితలం కింద ఎలా నిలిచి ఉందో తెలుసా? దాదాపు 33 అడుగుల మందంతో మట్టి మంచు చుట్టూ కవచంలా ఉండటం వల్లే. వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఈ మంచు మరెన్నో పరిశోధనలకు అవకాశం ఇస్తోంది. శాస్త్రజ్ఞులు ఆసక్తికరమైన అంశాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

మీకు తెలుసా?
* సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలో కన్నా అంగారకుడిపైనే ఎక్కువ ధూళి తుపాన్లు వస్తుంటాయి.

* మార్స్‌పై నీరు ఉన్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కనిపించిన మరకల ద్వారా తొలిసారిగా బయటపడింది.

* ఈ గ్రహంపై ఉన్న మౌండ్స్‌ (దిబ్బలు) గురించి బయటపడటం ద్వారా ఒకప్పుడు నీరు ఉండేదనే విషయం తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని