కళ్లతో రక్తం చిమ్ముతా... జాగ్రత్త!

అనగనగా ఓ తొండ... శత్రు జీవులతో హోళీ ఆడుతుంది... రంగులతో కాదు రక్తంతో... పండగ రోజు కాదు ప్రాణాల కోసం... బాబోయ్‌ ఇదేం జీవి? చూస్తే కప్పలా కనిపిస్తుంది. కానీ అదో తొండ. తలపై కొమ్ముల కిరీటం దాని ప్రత్యేకత. అంతేనా?

Published : 27 Feb 2017 01:23 IST

కళ్లతో రక్తం చిమ్ముతా... జాగ్రత్త!
అనగనగా ఓ తొండ... శత్రు జీవులతో హోళీ ఆడుతుంది... రంగులతో కాదు రక్తంతో... పండగ రోజు కాదు ప్రాణాల కోసం... బాబోయ్‌ ఇదేం జీవి?

చూస్తే కప్పలా కనిపిస్తుంది. కానీ అదో తొండ. తలపై కొమ్ముల కిరీటం దాని ప్రత్యేకత. అంతేనా? శత్రుజీవి నుంచి తప్పించుకోవడానికి ఇది వేసే ఎత్తుల్ని చూస్తే విస్తుపోవాల్సిందే.

* దీని రూపంవల్ల దీనికి హార్న్‌డ్‌ లిజర్డ్‌ అని, హార్న్‌డ్‌ ఫ్రాగ్‌, హార్న్‌డ్‌ టోడ్‌ అంటూ పిలుస్తారు.

* రూపం చిన్నగానే ఉన్నా తోక మాత్రం పొడవుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తుంటాయి.

* బూడిద, గోధుమ రంగుల్లో పరిసరాల్లో కలిసిపోయినట్టు ఉంటుంది. వేడి వాతావరణంలో దీనికి చురుకుదనం ఎక్కువ. సూర్యుడు వచ్చే వరకు తలను ఇసుక బొరియలో దాచుకుని శరీరం వెచ్చగా ఉండేలా చేసుకుంటుంది.

* ఏదైనా శత్రుజీవి ఎదురైతే దాని దృష్టి తనపై పడకుండా ఉండటానికి ఇది వేసే ఎత్తు ఎలా ఉంటుందంటే... మొదట కదలకుండా స్థిరంగా అలానే నిల్చుంటుంది. శత్రువును గందరగోళంలో పడేస్తుంది. అయినా లాభం లేదనుకుంటే... తన తలపై ఉన్న కొమ్ముల్లాంటి భాగాలతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదీ ఫలించకపోతే ఆఖరి అస్త్రం ప్రయోగిస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? కళ్లల్లోంచి రక్తాన్ని ఎదుటి జీవి మీదకు విసురుగా చిమ్ముతుంది. అవును మీరు విన్నది నిజమే. దీని బుల్లి తలలో రక్తపోటు పెంచుకుని పైపులోంచి నీళ్లొచ్చిన్నట్టు రక్తాన్ని చిమ్ముతుంది. గబ్బు కంపు కొట్టే ఈ రక్తానికి వెగటు పుట్టి ఏంటిది అని శత్రుజీవి గమనించేలోపే తుర్రుమని పారిపోతుంది.

* కళ్ల నుంచి చిమ్మే దీని ఈ రక్తం మూడు అడుగుల దూరం వరకు వెళుతుందిట.

* వేటలోనూ దీనికి తెలివి ఎక్కువే. చీమల్ని ఇష్టంగా తినే ఈ తొండ ఓపిగ్గా వేచి చూస్తూ చీమలు గుంపులు గుంపులుగా కనిపించగానే నాలుకతో లటుక్కున మింగేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు