ఎగిరే విమానం... నీటిలో ప్రయాణం

‘కొన్ని ఉభయ చరాల పేర్లు చెప్పండి?’ అని టీచర్‌ అడగ్గానే మొసళ్లు, తాబేళ్లు, కప్పలు... అంటూ టకటకా కొన్నింటి పేర్లు చెప్పేస్తాం. అయితే ఇప్పుడు ఆ జాబితాలో సరదాగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ పేరు కూడా చేర్చేయొచ్చు. ఎందుకంటే ఇది వాటిలాగే భూమ్మీదా, నీటిలోనూ ఉండగలదు....

Published : 03 May 2017 01:04 IST

ఎగిరే విమానం... నీటిలో ప్రయాణం
ఓ పేద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉంది... అచ్చంగా ఎగరడమే కాదు..దీనికి మరో ప్రత్యేకత ఉంది.. ఏంటో ఏమో తెలుసుకుంటే పోలా?

‘కొన్ని ఉభయ చరాల పేర్లు చెప్పండి?’ అని టీచర్‌ అడగ్గానే మొసళ్లు, తాబేళ్లు, కప్పలు... అంటూ టకటకా కొన్నింటి పేర్లు చెప్పేస్తాం. అయితే ఇప్పుడు ఆ జాబితాలో సరదాగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ పేరు కూడా చేర్చేయొచ్చు. ఎందుకంటే ఇది వాటిలాగే భూమ్మీదా, నీటిలోనూ ఉండగలదు. ఇప్పటి వరకు ఉన్న ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్దది కూడా. పేరు ఏజీ600.
మన పక్క దేశం చైనాకు చెందిన ‘చైనా ఏవియేషన్‌ ఇండస్ట్రీ జనరల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కో లిమిటెడ్‌’ సంస్థ దీన్ని తయారు చేసింది. ఆ మధ్యే తయారీ పూర్తయ్యింది. ఈ మధ్య జరిగిన పరీక్షల్లో విజయం సాధించింది కూడా.

* అయితే ఇది మిగతా వాటిల్లా ప్రయాణికుల్ని చేర్చడానికే కాదు.. భూమిపై అగ్ని ప్రమాదాల్లాంటివి జరిగినప్పుడు ఇది ఎంతో సహకరిస్తుంది. 20 సెకెన్లలోనే తనకున్న 12 టన్నుల నీటి ట్యాంకును నింపేసుకుంటుంది. రివ్వున గాల్లోకి ఎగిరి మంటలపై చల్లేస్తుంది. బాహుబలిలా ఒక్కసారే 53 టన్నుల బరువును మోసుకుపోతుంది. అంటే దాదాపుగా ఎనిమిది ఆఫ్రికా ఏనుగులంత బరువన్నమాట!

* గంటకు 570 కిలోమీటర్ల వేగంతో గాల్లో దూసుకుపోగలదిది.

* కావాలనుకుంటే పడవలా మారి సముద్రాల్లోనూ ప్రయాణించగలదు. దీని అడుగు భాగం పడవ అడుగు భాగాన్ని పోలి ఉండటంతో నీటిలో చక్కగా తేలిపోగలదు.

* తుపానుల్లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో నౌకాదళ సిబ్బందికి సాయపడుతుంది. అత్యవసరంగా కావల్సిన వస్తువుల్ని సముద్రంలో ఉన్న వారి వద్దకు చేరవేస్తుంది.

* ఇది 121 అడుగుల పొడవు, 39 అడుగుల ఎత్తు ఉంది. అంటే కొంచెం తక్కువగా నాలుగంతస్తుల భవనమంత ఎత్తన్నమాట! అటూఇటూ ఉండే రెక్కలైతే 127 అడుగుల పొడుగుంటాయి. వాటి కదలిక వల్లే ఇది నీళ్లలోనూ చక్కగా ప్రయాణించగలదన్నమాట.

* మరికొన్ని సార్లు దీని పనితీరును పరీక్షించాక చైనా మిలటరీకి దీన్ని అప్పగిస్తారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని