వేలెడు చేపంట... పుట్టెడు పళ్లంట!

మనకెన్ని పళ్లుంటాయి?అన్నీ వచ్చినా ముప్ఫై రెండేగా! పులుల్లాంటి వాటికి? వాటికీ మూడు పదుల్లోనే..! అయితే ఓ చిట్టి చేపకు మాత్రం వేల పళ్లున్నాయిట! ఆ వింత సంగతులేంటో చూద్దామా?

Published : 05 May 2017 01:26 IST

వేలెడు చేపంట... పుట్టెడు పళ్లంట!

మనకెన్ని పళ్లుంటాయి?అన్నీ వచ్చినా ముప్ఫై రెండేగా! పులుల్లాంటి వాటికి? వాటికీ మూడు పదుల్లోనే..! అయితే ఓ చిట్టి చేపకు మాత్రం వేల పళ్లున్నాయిట! ఆ వింత సంగతులేంటో చూద్దామా?

ద్దరు శాస్త్రవేత్తలు.. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఓ మ్యూజియం చూడ్డానికెళ్లారు. అక్కడో మూలన ఎముకలతో నిండి ఉన్న ఓ గాజు సీసా కనిపించింది. ఏంటబ్బా ఈ ఎముకలు చిత్రంగా ఉన్నాయి అనుకుని వాటిపై పరిశోధన మొదలెట్టారు. అప్పుడే తెలిసింది అవి ఓ కొత్త రకం చేప ఎముకలని. దాని నోట్లో ఏకంగా 2000కు పైగా పళ్లున్నాయని. ఇక ఆశ్చర్యపోవడమే వారి వంతయ్యింది.

* ఈ బుల్లి చేప ‘క్లింగ్‌’ జాతి చేపల్లో కొత్త రకందిట. మన వేలెడంత మాత్రమే ఉండే దీనికి కొంగ ముక్కులాంటి నోరుంటుంది. దాని నిండా బోలెడు వరుసల్లో విడివిడిగా పళ్లుంటాయి. ఎన్నంటే? ఏకంగా 1800 నుంచి 2300 వరకు ఉంటాయి. చిన్న చిన్న శిలీంద్రాలు, పగడపు దిబ్బల్లోని ఆకుల్ని వాటి సాయంతోనే ఇది భోంచేస్తుంది.

* దీని పొట్టలో గరాటు ఆకారంలో ఉన్న ఓ ప్రత్యేక నిర్మాణాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

* దీనిపై పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే ఔషధాల తయారీలో ఈ విజ్ఞానం ఉపయోగపడుతుందట.

* 1977కు మునుపు ఈ చేపలు వేడి ప్రాంతపు సముద్రాల్లో ఉండేవి. తర్వాత ఇవి అంతరించిపోయాయి. అందుకే వీటి చిత్రమైన సంగతులు ఇప్పటి వరకు మనకు తెలియలేదు.


 

మీకు తెలుసా?

* ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉండే ‘షీప్స్‌హెడ్‌’ చేపకు అచ్చం మనిషికి ఉండేలాంటి పళ్లే ఉంటాయి.
* షార్క్‌లకు పళ్లు వూడిపోతూ ఉంటే కొత్త పళ్లు వస్తాయి. జీవితకాలంలో వాటికి 40 వేల వరకు కొత్త పళ్లు వస్తాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని