పదేళ్ల పిల్లాడు... ప్రపంచ పోటీకి ఎదిగాడు!

కరాటే నేర్చుకోవడం వేరు. దానిలో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం వేరు. కేవలం పదేళ్లకే ఆ ఘనత సాధించాడో పిల్లాడు. కరాటేలో సత్తా చాటుతూ ప్రపంచ యూత్‌ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ అబ్బాయే హైదరాబాద్‌కు చెందిన దేవరకొండ దుర్గాసాయి తనిష్క్‌.....

Published : 19 May 2017 01:49 IST

పదేళ్ల పిల్లాడు... ప్రపంచ పోటీకి ఎదిగాడు!

కరాటే నేర్చుకోవడం వేరు. దానిలో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం వేరు. కేవలం పదేళ్లకే ఆ ఘనత సాధించాడో పిల్లాడు. కరాటేలో సత్తా చాటుతూ ప్రపంచ యూత్‌ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ అబ్బాయే హైదరాబాద్‌కు చెందిన దేవరకొండ దుర్గాసాయి తనిష్క్‌.

* చిన్న వయసులోనే విదేశాలకు వెళ్లగలిగేంత సత్తా చూపే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన అబ్బాయే తనిష్క్‌. ఈమధ్యే దిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఈ పిల్లాడు పాల్గొన్నాడు. మొత్తం దేశంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 32 మందితో పోటీపడి గెలిచాడు. సబ్‌ జూనియర్‌ విభాగం బాలుర ఫైనల్లో తమిళనాడు అబ్బాయి ప్రకాశ్‌ దాస్‌ను ఓడించి బంగారు పతకం పట్టేశాడు. దీంతో ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్‌) యూత్‌ కప్‌కు ఎంపికయ్యాడు. జూన్‌ 26 నుంచి జులై 2 వరకు క్రొయేషియాలోని ఉమాగ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ పోటీల కోసం తనిష్క్‌ జాతీయ కోచ్‌ కీర్తన్‌ దగ్గర మెలకువలు నేర్చుకుంటూ సిద్ధమవుతున్నాడు.

*ఏడాది క్రితమే తనిష్క్‌ కరాటేలో అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే ప్రతిభ చూపిస్తున్నాడు. తనకంటే సీనియర్లు.. ఆటలో ఎంతో మెరుగైన క్రీడా కారుల్ని దాటుకుంటూ దూసుకెళ్తున్నాడు. పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ పతకాలు సాధిస్తూ ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో 8 స్వర్ణ, రజత పతకాలు అందుకున్నాడు.

* అసలు తనిష్క్‌ అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్లాడు అంటే... కిందటి నెల తెలంగాణ రాష్ట్రస్థాయిలో కరాటే పోటీలు జరిగాయి. హైదరాబాద్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. వీరిలో సబ్‌జూనియర్ల విభాగంలో తనిష్క్‌ విజయం దక్కించుకున్నాడు. స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదిగాడన్నమాట.

* తనిష్క్‌ ఆటల్లోనే కాదు చదువులోనూ ఫస్టే. బర్కత్‌పురాలోని శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ సాయంత్రం కరాటే సాధన చేస్తాడు. ఇంకా సంగీతం, కీబోర్డ్‌ కూడా నేర్చుకుంటున్నాడు. డాక్టర్‌ కావాలనేది తన లక్ష్యమంటూ చెబుతున్నాడీ కరాటే కుర్రాడు.

(ఫొటో: వసంత్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు