ఎమోజీ బొమ్మలు... అయ్యాయి గడుగ్గాయ్‌లు!!

బొమ్మలకే ప్రాణాలొస్తే.. హావభావాలే గెంతులేస్తే... ఆడుతూ పాడుతూ మనల్ని కడుపుబ్బా నవ్విస్తే? పరుగులు పెట్టి మనకు గిలిగింతలు పెడితే అంతకన్నా ఆనందమా? అయితే ఇవన్నీ త్వరలో మన మందుకు రాబోతున్న ‘ది ఎమోజీ’ త్రీడీ యానిమేషన్‌ ఆంగ్ల చిత్రంలో చూడొచ్చు....

Published : 12 Jul 2017 01:59 IST

ఎమోజీ బొమ్మలు... అయ్యాయి గడుగ్గాయ్‌లు!!

బొమ్మలకే ప్రాణాలొస్తే.. హావభావాలే గెంతులేస్తే... ఆడుతూ పాడుతూ మనల్ని కడుపుబ్బా నవ్విస్తే? పరుగులు పెట్టి మనకు గిలిగింతలు పెడితే అంతకన్నా ఆనందమా? అయితే ఇవన్నీ త్వరలో మన మందుకు రాబోతున్న ‘ది ఎమోజీ’ త్రీడీ యానిమేషన్‌ ఆంగ్ల చిత్రంలో చూడొచ్చు.

మీకు తెలుసా?
* ఎమోజీ అంటే చిన్న డిజిటల్‌ ఇమేజ్‌ అన్నమాట. ఎమోజీ అనేది జపనీస్‌ పదం.
* ఎమోజీల వాడకం 1990లోనే మొదలైంది.

* ఎమోజీ అంటే తెలుసుగా? స్మార్ట్‌ఫోన్లలో సందేశాలు పంచే యాప్స్‌లో అందరికీ సుపరిచితమే. నవ్వడానికి సూచికకగా స్మైలీ బొమ్మ, ఎర్రని రంగులో కళ్లుపైకి లేపి కనిపించే ఎమోజీ, ముభావంగా ఉన్నామని చెప్పే బొమ్మ ఇలా ప్రతి భావానికి ఈ ఎమోజీలున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే? ఈ రకరకాల ఎమోజీల చుట్టూ తిరుగుతుందీ సినిమా.

* ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే... ఈ చిత్రంలో హీరో ఎమోజీ జీన్‌. ఈ ఎమోజీ యువత వాడే స్మార్ట్‌ ఫోన్‌లోని టెక్స్‌టింగ్‌ ఆప్‌లో ఉంటుంది. అయితే దీని లోకంలో తోటి ఎమోజీలన్నీ ఒక్కోటి ఒక్కో హావభావాన్ని మాత్రమే సూచిస్తే ఇది మాత్రం రకరకాల భావాల్ని పలికించగలదు. దీంతో మిగతా వాటిలా లేనే అని దీనికి దిగులుపుడుతుంది. ఇతర ఎమోజీల్లా ఉంటేనే గుర్తింపని భావిస్తుంది. ఎలాగైనా ఇది కూడా మిగతా ఎమోజీల్లా మారాలని ప్రయత్నిస్తుంది. ఓ కోడ్‌ ద్వారా తన ప్రోగ్రామ్‌ను సరిచేసుకోవాలనుకుంటుంది. కొంతమంది ఎమోజీ స్నేహితులతో కలిసి ఆ కోడ్‌ను కనుక్కునే పనిలో పడుతుంది. ఈ ఎమోజీలన్నీ కలిసి యువత స్మార్ట్‌ ఫోన్లలో ఎన్నో సాహసాలు చేస్తారు. టెక్సిటింగ్‌ యాప్‌ నుంచి గేమింగ్‌, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌, ఫొటో షేరింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌, డ్యాన్స్‌, ఫైల్‌ షేరింగ్‌ ఇలా రకరకాల యాప్స్‌ గుండా పరుగులు తీస్తాయి. ఇదంతా భలే సరదా సరదాగా ఉంటుంది.

* ఎలాగోలా చివరకు ఆ కోడ్‌ను కనిపెడుతుందీ జీన్‌. కానీ భిన్నంగా ఉండటమే తన ప్రత్యేకత, ఇదే గొప్ప విషయం అని తెలుసుకుంటుంది. చివరకు తన భావాలను ఎలాంటి మినహాయింపులూ లేకుండా స్వేచ్ఛగా వ్యక్తపరుస్తూ ఉండాలనీ నిర్ణయించుకుంటుంది. అదన్నమాట కథ.

* చక్కని గ్రాఫిక్స్‌తో కనువిందు చేస్తాయి సన్నివేశాలన్నీ. ఫోన్‌లో ఈ ఎమోజీల లోకం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎమోజీలతోపాటు రకరకాల జంతువులు, చాక్లెట్లు, బిస్కెట్లు, హైఫై, చెట్లు, పూలు, సంగీత వాద్యాలు ఇలా బోలెడు ఉంటాయి. ఇవన్నీ ఎంచక్కా ఆడుతూ పాడుతూ తమ లోకంలో సరదాగా గడుపుతూ ఉంటాయి.

* సోనీ పిక్చర్స్‌ వాళ్లు తీసిన ఈ సినిమాలో పాత్రలన్నీ దేనికవే భిన్నంగా ఆకట్టుకుంటాయి.

* ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్స్‌ అంతర్జాలంలో అభినందనలు పొందుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని