గొట్టాల పురుగండీ! 300ఏళ్లు ఆయువండీ!!

ఈ మధ్యే శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నారు. అదేంటంటే... సముద్రపు లోతుల్లో ఉండే ట్యూబ్‌వార్మ్‌ అనే ఓ జీవుల్లో ఒకటి ‘ఎస్కర్పియా లామినటా’. ఇది ఏకంగా 300 ఏళ్ల..

Published : 31 Jul 2017 01:27 IST

గొట్టాల పురుగండీ!
300ఏళ్లు ఆయువండీ!!

మనిషి జీవిత కాలం 100 ఏళ్లు... ఏనుగులు బతికుండే కాలం దాదాపు 70 సంవత్సరాలు...కొన్ని తాబేళ్ల జీవిత కాలం సుమారు 200 ఏళ్లు... మరి ఎక్కువ జీవిత కాలం ఏ జీవిది?
మధ్యే శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నారు. అదేంటంటే... సముద్రపు లోతుల్లో ఉండే ట్యూబ్‌వార్మ్‌ అనే ఓ జీవుల్లో ఒకటి ‘ఎస్కర్పియా లామినటా’. ఇది ఏకంగా 300 ఏళ్ల కన్నా ఎక్కువే జీవిస్తుందట. అందుకే ఇప్పుడున్న జీవరాశులన్నింటిలో అత్యధికంగా బతికే ప్రాణి ఇదే కావచ్చని అంటున్నారు.
* దేహమంతా గొట్టాల్లా ఉండే ఈ జీవి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇది ఎక్కువగా గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో సముద్రం లోపల 3,200 నుంచి 10 వేల అడుగుల లోతులో ఉంటుంది. అసలే చిన్న ఆకారం, దానికి సాయం లోతుల్లో ఉండడం వల్ల ఇంత వరకు దీని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియలేదు.
* కొందరు శాస్త్రవేత్తలు వీటి జీవిత కాలం ఎంతబ్బా? అని ఓ పరిశోధన చేశారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ప్రాంతంలో వివిధ చోట్ల నుంచి మొత్తం 356 ట్యూబ్‌వార్మ్స్‌ను తీసుకున్నారు. ఒక సంవత్సరంలో వాటి శరీర పొడవు ఎంత పెరుగుతుందో పరిశీలించారు. ప్రత్యేక పద్ధతి ద్వారా 50 సెంటీమీటర్ల పొడవున్న ట్యూబ్‌వార్మ్‌ వయసు 202 ఏళ్లు అని తెలుసుకున్నారు. అలా మిగతా వాటి వయసులూ లెక్క కట్టి వీటిల్లో కొన్ని జీవుల వయసు 250 ఏళ్లు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, కొన్నింటి వయసైతే ఏకంగా 300 ఏళ్లు కూడా దాటిందట. అలా దీని జీవిత కథా కమామీషూ తెలిసిందన్నమాట.

మీకు తెలుసా?
* అతి తక్కువ జీవిత కాలం ఉన్న జీవి మేఫ్లై. ఈ కీటకం కేవలం 24 గంటలు బతుకుతుందంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని