కళ్లకు గంతలు! రైడంతా వింతలు!!

బాగున్నారా నేస్తాలూ! నేనే.చిన్నూని. అమెరికాలో ఫ్లోరిడా ఉంది కదా? ఈ మధ్యే అక్కడి ‘సీ వరల్డ్‌’కి వెళ్లొచ్చా. అక్కడో గమ్మత్తైన రైడు ఎక్కొచ్చా. ఒళ్లు గగుర్పొడిచే దాని సంగతులు మీతో పంచుకుందామనే ఇలా వచ్చేశా.....

Published : 12 Aug 2017 01:24 IST

కళ్లకు గంతలు!
రైడంతా వింతలు!!
చిన్నూ కబుర్లు!

బాగున్నారా నేస్తాలూ! నేనే.చిన్నూని. అమెరికాలో ఫ్లోరిడా ఉంది కదా? ఈ మధ్యే అక్కడి ‘సీ వరల్డ్‌’కి వెళ్లొచ్చా. అక్కడో గమ్మత్తైన రైడు ఎక్కొచ్చా. ఒళ్లు గగుర్పొడిచే దాని సంగతులు మీతో పంచుకుందామనే ఇలా వచ్చేశా.

* మామూలుగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే ఎలా ఉంటుంది? రయ్యి రయ్యిమని గాల్లో దూసుకుపోతున్నట్టు... ఉన్నట్టుండి కింది కిందికి పడిపోతున్నట్టు... ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంటున్నట్టు... ఇలా చిత్రంగా అనిపిస్తుంది.. అంతే కదూ! మరి నేనెక్కిన రైడు మాత్రం అలాంటి ఇలాంటిది కాదు. దానిపైకి ఎక్కాక ఈ అనుభూతులకు తోడు కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లనిపిస్తుంది. అదెట్లా చెప్మా అంటారా? అక్కడికే వస్తున్నా.

* ఈ రైడు ఎక్కగానే ఒక్కసారిగా సముద్ర లోతుల్లో నీళ్లల్లోకి వెళ్లిపోతాం. అక్కడ పెద్ద చేపలు నోరు చాపేస్తూ మీదికి వచ్చేస్తుంటాయి. ఆ పక్కనే అగ్ని పర్వతాలూ ఢాంఢాంమని పేలిపోతుంటాయి. వాటి దగ్గరగా మా ప్రయాణం. నాకైతే ఒళ్లు చెమట్లు పట్టేశాయ్‌. కంగారులో నా కేకలు.. తోడుగా చుట్టూ ఉన్న వారి అరుపులు. బాబోయ్‌! ఆ అనుభూతే వేరులేండి.

* అసలు సంగతేంటంటే... నేనెక్కింది మామూలుగా మనం ఎప్పుడూ చూసే రోలర్‌కోస్టరే. మొత్తం 150 అడుగుల పొడవుందది. పైగా అదేమీ సముద్రంలో లేదు. అయితే అదెక్కగానే నా కళ్లకి వర్చువల్‌ రియాలటీ బాక్స్‌ని పెట్టేశారు. కళ్లజోడు బాక్సులా ఉన్న అది నా కళ్లకు పెట్టుకున్నాక ఇక చుట్టుపక్కల ఏమీ కనపడదు. ఆ పెట్టెలో ఓ తెర ఉంటుంది. దానిపై చూస్తే చేపలు ఈదులాడే లాంటి సన్నివేశాలు నిజంగా ఎదురైనట్టు వింత భ్రాంతి కలుగుతుంది.

* ఓ పక్క రైడ్‌ మలుపులు, మరో పక్క తెరపై కనిపించే సముద్రపు దృశ్యాలు. కలిపి మనకి వింత అనుభూతి కలుగుతుందన్నమాట. నిజం చెప్పాలంటే ఈ రైడు చాలా పాతదేగానీ ఈ వర్చువల్‌ రియాలటీ బాక్సుల్ని కొత్తగా దీనికి అమర్చారు. నాలా ఇదెక్కిన వారందరికీ ఇప్పుడిది కొత్త ఆనందాల్ని పంచుతోంది. మొత్తానికి భలే రైడులెండి. మరైతే మీరూ బయల్దేరండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని