ఎంతెంత గొప్పంట.. రూపాయి బిళ్లంట!

కొత్తక వింత పాతొక రోత అన్నది సామెత. అందుకే మొన్నొచ్చి తళతళ మెరిసిపోతున్న కొత్త 200 నోటును మనమంతా ఆసక్తిగా చూస్తున్నాం. అది చూసి రూపాయి బిళ్ల చిన్నబోయింది. ‘ఇప్పుడిప్పుడు వచ్చిందని అంతా దాన్ని చిత్రంగా చూస్తున్నారు....

Published : 28 Aug 2017 01:31 IST

ఎంతెంత గొప్పంట.. రూపాయి బిళ్లంట!

కొత్తక వింత పాతొక రోత అన్నది సామెత. అందుకే మొన్నొచ్చి తళతళ మెరిసిపోతున్న కొత్త 200 నోటును మనమంతా ఆసక్తిగా చూస్తున్నాం. అది చూసి రూపాయి బిళ్ల చిన్నబోయింది. ‘ఇప్పుడిప్పుడు వచ్చిందని అంతా దాన్ని చిత్రంగా చూస్తున్నారు. మరి ఎప్పటి నుంచో ఉన్న మా నాణేల్ని మాత్రం ఎప్పుడూ పట్టించుకోరేం. అసలు పిల్లాడి చేతిలో అమ్మ ఒక్క నాణెం పెట్టిందంటే వాడి ముఖంలో ఆనందం చూడాలి. అసలదీ రూపాయి మజాకా’ అంటూ దాని గొప్పలేవో తనే చెప్పడం ప్రారంభించింది.

మన దేశంలో ఐదు, పది వేల నోట్లూ ఉండేవి తెల్సా. ఎప్పుడంటే 1954-1978ల మధ్య.

మా చరిత్ర ఎంతో ఘనమండీ!
* ప్రపంచంలో మొదటగా డబ్బు నాణేలు వాడిన వాళ్లలో భారతీయులూ ఒకరు. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచీ ఇక్కడ మా గలగలున్నాయి.
* 1509-1529ల మధ్య శ్రీకృష్ణదేవరాయలు పాలనలో మా నాణేలన్నీ బంగారంతోనే తయారయ్యేవి. మౌర్యుల కాలంలో వెండి నాణేలే డబ్బులు.
* ఇప్పుడంటే మా విలువ తగ్గి పెద్ద నోట్ల వాడకం పెరిగిపోయిందిగానీ.... మీ తాతలు, ముత్తాతలూ అంతా మమ్మల్నే వాడేవాళ్లు. పైసలతోనే పళ్లూ, కూరగాయల్లాంటివీ కొనుక్కునేవాళ్లు. పైసా, రెండు, మూడు పైసల్లాంటి నాణేలు ఇప్పుడు మీలో ఎంత మందికి తెలుససలు? చూద్దామన్నా కనిపించవిప్పుడు.
* ఇప్పుడు మీరు చూస్తున్న మా నాణేలు 1950 తర్వాత తయారైనవే. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మమ్మల్ని తయారు చేయిస్తుంది.
* మేమంతా ఓ రకమైన ఉక్కు, నికెల్‌ లోహాలతో తయారవుతున్నాం.

మా పుట్టుక ఇక్కడేనండీ!
* మేమూ, మా అన్నలూ ఎక్కడ నుంచి పుట్టుకొస్తామో తెలుసా? హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాల నుంచి. అక్కడి ప్రభుత్వ తయారీ కేంద్రాల్లో తయారవుతాం.
* మేం ఎక్కడ తయారయ్యామన్న దాన్ని మీరు చిటికెలో చెప్పేయొచ్చు. నాణెంపై ఎప్పుడు తయారైందో తెలిసేలా సంవత్సరం సంఖ్య ఉంటుంది కదా. దానికి కిందవైపు చూడండి. అక్కడ గుండ్రటి చుక్క ఉంటే నోయిడా, నక్షత్రం ఉంటే హైదరాబాద్‌, డైమండ్‌ ఉంటే ముంబయి, ఏ గుర్తూ లేకపోతే కోల్‌కతాలో తయారయినట్లు అర్థమన్నమాట.

ఆశ్చర్యపోతారండీ!
* ఇంతకీ మా తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? మా పెద్దన్న పది నాణెం తయారీకి ఆరు రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిందే.
* మా చిన్నన్న ఐదు రూపాయల నాణేన్ని చూసుంటారు. ఆ మధ్య ఓసారి దీన్ని బంగ్లాదేశ్‌ వాళ్లు స్మగ్లింగే చేసేసుకున్నారు. ఎందుకనుకుంటున్నారు. గడ్డం గీసుకునే బ్లేడ్‌ల తయారికి. దిట్టంగా ఉండే ఒక ఐదు బిళ్లని కరిగిస్తే ఆరు బ్లేడ్‌లు తయారవుతాయట. వాటిని రెండు రూపాయలకొకటి చొప్పున అమ్మేసేవారు. అంటే ఐదు బిళ్లని కరిగించి 12 రూపాయల విలువైన బ్లేడ్‌లను అమ్మేసేవారన్న మాట. తర్వాత ఈ విషయం మన ప్రభుత్వానికి తెలిసి వీటిని అక్రమ రవాణాని నిలిపేసిందిలేండి.

గ్రాఫిక్‌: పార్థు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు