పదమూడేళ్ల పిల్లాడు... యోగా గురువయ్యాడు!

బోలెడు ఆసనాలు నేర్పించే యోగా గురువు. ఇంత వరకే అయితే చెప్పక్కర్లేదు. మన దగ్గర చిన్నారులు యోగా నేర్చుకోవడం మామూలే కావచ్చు. కానీ ఈ అబ్బాయిది మనదేశమే కాదు. అందుకే మన పేజీలోకి వచ్చాడు మరి.....

Published : 31 Aug 2017 01:12 IST

పదమూడేళ్ల పిల్లాడు... యోగా గురువయ్యాడు!

* ఎవరీ పిల్లాడు? మన పేజీలోకి ఎందుకొచ్చాడు?
బోలెడు ఆసనాలు నేర్పించే యోగా గురువు. ఇంత వరకే అయితే చెప్పక్కర్లేదు. మన దగ్గర చిన్నారులు యోగా నేర్చుకోవడం మామూలే కావచ్చు. కానీ ఈ అబ్బాయిది మనదేశమే కాదు. అందుకే మన పేజీలోకి వచ్చాడు మరి.

* మరి పేరేంటీ? వూరేంటీ?
ఈ అబ్బాయి పేరు అడమ్‌ అవిన్‌. వయసు పదమూడేళ్లు. ఉండేది అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌.

* అసలీ అబ్బాయి యోగా ఎక్కడ నేర్పిస్తాడు?
పొద్దున్నే టీవీలో యోగా నేర్పించడం చూసే ఉంటారుగా. అలా ఈ పిల్లాడు కూడా ఇక్కడి ‘చిల్డ్రన్స్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌’లో చిన్నారులకు యోగాసనాలు చెబుతుంటాడు. ఈ కార్యక్రమానికి ‘వుఫ్‌ శాంతి’ అని పేరు కూడా పెట్టారు. పిల్లలకు బొమ్మలంటే తెగ ఇష్టం కదా... అందుకే అడమ్‌... పేద్ద కుక్కబొమ్మలాంటి దుస్తులు వేసుకుని టేడ్డీబేర్‌లా వస్తాడు. కెమెరా ముందు అక్కడున్న చిన్నారులకు రకరకాల ఆసనాలు నేర్పిస్తాడు. మంచి మంచి విషయాలు చెబుతుంటాడు.

ప్రస్తుతం అక్కడ ప్రసారమయ్యే ఈ యోగా కార్యక్రమానికి ఆదరణ బాగా పెరిగిపోయిందట. అందుకే త్వరలో అమెరికా మొత్తం ప్రసారాలు చేయనున్నారు. ఫ్లోరిడాలో ‘అతి చిన్న యోగా గురువు’గా పేరు తెచ్చేసుకుని ఫేస్‌బుక్‌ల్లాంటి వాటిల్లో వేల మంది అభిమానుల్ని తెచ్చేసుకున్నాడీ బుల్లి గురువు. అంతేకాదూ... చిన్నారుల ఆసుపత్రులకు వెళ్లి వాళ్లు సంతోషంగా ఉండటానికి సరదాగా యోగాసనాలు నేర్పిస్తున్నాడట.

* ఇంతకీ అడమ్‌కీ యోగాపై ఆసక్తి ఎలా వచ్చింది?
అడమ్‌ వాళ్ల తాతయ్య ‘నువ్వు నవ్వితే ప్రపంచమూ నవ్వుతుంది’, ‘నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పాలి’, ‘మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది’ అనే మూడు మంత్రాలు చెప్పాడట. వాటి ప్రాముఖ్యతను అందరికీ చెప్పడానికి ఈ అబ్బాయి యోగా నేర్చుకుని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టాడట. అడమ్‌ వాళ్ల అమ్మ రాసిన ‘మై గ్రాండ్‌-డాగ్‌ వజ్‌ ఎ యోగా ఇన్‌స్ట్రక్టర్‌’ పుస్తకానికి ఈ బుల్లి గురువు బొమ్మ కూడా వేశాడు. అచ్చం ఆ బొమ్మ వేషంలోనే తయారై టీవీలో యోగా చెప్పేస్తున్నాడన్నమాట.

* మరి మనం చూడలేమా?
చక్కగా చూడొచ్చు. యూట్యూబ్‌లో ఈ కార్యక్రమానికి చెందిన వీడియోలున్నాయి. ఇంకా... త్వరలోనే యాపిల్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, సామ్‌సంగ్‌ స్మార్ట్‌ టెలివిజన్‌ల్లో ఈ యోగా గురువు కనిపించబోతున్నాడట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని