చక్రాలు కట్టేస్తా... రికార్డులు కొట్టేస్తా!

పదేళ్ల పిల్లాడు... కాళ్లకు చక్రాలు కట్టాడు... శరీరాన్ని భూమికి సమాంతరంగా వంచాడు... అరవై పతకాలు సాధించాడు... కొత్తగా 4 గిన్నిస్‌ రికార్డులు కొట్టేశాడు... ఇంతకీ ఎవరీ బుడతడు? ‘అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా లక్ష్యం... దాని కోసం కఠోరంగా శ్రమిస్తా’ అని చెబుతున్నాడీ చిచ్చర పిడుగు.....

Published : 02 Sep 2017 01:36 IST

చక్రాలు కట్టేస్తా... రికార్డులు కొట్టేస్తా!


పదేళ్ల పిల్లాడు... కాళ్లకు చక్రాలు కట్టాడు... శరీరాన్ని భూమికి సమాంతరంగా వంచాడు...అరవై పతకాలు సాధించాడు...కొత్తగా 4 గిన్నిస్‌ రికార్డులు కొట్టేశాడు... ఇంతకీ ఎవరీ బుడతడు?

‘అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా లక్ష్యం... దాని కోసం కఠోరంగా శ్రమిస్తా’ అని చెబుతున్నాడీ చిచ్చర పిడుగు.

కారు కిందనుంచి దూరగలమా? బాబోయ్‌ అదెలా సాధ్యం అంటారా? కానీ ఓ పిల్లాడు చాకచక్యంగా దూరేశాడు. పేరు దేవీశ్రీప్రసాద్‌. అలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 60 కార్ల కింద నుంచి మొత్తం 115 మీటర్ల దూరాన్ని 23.151 సెకన్లలో పూర్తిచేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. అంతేనా నాలుగు గిన్నిస్‌ రికార్డులు కొట్టేశాడు.
* లింబో స్కేటింగ్‌ పేరు వినే ఉంటారుగా. కాళ్లకు చక్రాలు కట్టుకుని శరీరాన్ని పూర్తిగా వంచి ముందుకు దూసుకుపోవాలి. ఇది ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కాదు. దీంట్లో దేవీశ్రీప్రసాద్‌ ఆరితేరి పోయాడు. చిన్న వయసులోనే లింబో స్కేటింగ్‌లోనే బోలెడు విన్యాసాలు చేస్తూ రికార్డులు తెచ్చేసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర జరిగిన ప్రదర్శనలో తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుని పది లక్షల రూపాయల బహుమతి కూడా తీసుకున్నాడు.


* ఈ అబ్బాయిది తిరుపతి. చిన్న వయసు నుంచే లింబోస్కేటింగ్‌ నేర్చుకుంటున్నాడు. ఆ ఇష్టం ఎలా వచ్చిందంటే... దేవీశ్రీకి నాలుగేళ్ల వయసున్నప్పుడు వాళ్ల అమ్మ ఈత నేర్పించాలనుకుని తీసుకెళ్లిందట. వయసు సరిపోదని చెప్పారట. ఆమె నిరాశగా వెళ్లిపోతుంటే చంకలో ఉన్న దేవిశ్రీప్రసాద్‌ మాత్రం అక్కడున్న లింబోస్కేటింగ్‌ రింకు దగ్గరకు తీసుకెళ్లాలని వాళ్లమ్మను అడిగాడట. అలా మొదలైన దేవీశ్రీ ఇష్టం మరింత పెరిగిపోయింది. దీంతో ఆరేళ్ల వయసు నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుని దూసుకుపోతున్నాడు. నేర్చుకోవడం మొదలుపెట్టిన మూడునెలల్లోనే చాలా వేగంగా స్కేటింగ్‌ చేస్తుండటంతో డెహ్రాడూన్‌లో తొలి పోటీకి వెళ్లాడు. మొదటి విభాగంలో రజత పతకం, అక్కడే మరో విభాగంలో స్వర్ణం అందుకున్నాడు.
* ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో సుమారు 60 పతకాలను సాధించాడు. ఇంకా దేవీశ్రీ ప్రతిభను మెచ్చిన ‘కాలేజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, ఇరాన్‌’ డాక్టరేట్‌తో చిన్నారిని అభినందించింది.స్కేటింగ్‌లోని అన్ని విభాగాల్లోనూ ఈ పిల్లాడు సత్తా చాటుతున్నాడు.
* ఉదయమే యోగా చేసి 6 గంటలకే రింకులోకి వెళతాడట. మళ్లీ స్కూలు నుంచి రాగానే కాళ్లకు చక్రాలు కట్టేస్తాడట. అలా రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తున్నాడు ఈ బుజ్జి ఆటగాడు.
* ప్రస్తుతం తిరుపతిలోని సిల్వర్‌బెల్స్‌ స్కూల్లో ఆరోతరగతి చదువుతున్నాడు. ఆటలోనే కాదు... చదువులోనూ ఫస్టేనట.

- శివ మావూరి, ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని