ఎంత చిన్న దేశమో!

తువాలూ... ఇదో బుల్లి దేశం. చాలా చి....న్నగా ఉంటుంది. దీని పేరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోని బుల్లి దేశాల్లో ఒకటి. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్నవైన వాటికన్‌ సిటీ, మోనాకో, నౌరు దేశాల తర్వాతి స్థానం దీందే. నాలుగో అతి చిన్న దేశమన్నమాట. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంటుంది. ఈ ద్వీప దేశంలో మొత్తం తొమ్మిది దీవులు. వీటిలో అయిదు పగడపు దీవులు....

Published : 03 Sep 2017 00:37 IST

ఎంత చిన్న దేశమో!
తువాలూ


అనగనగా ఓ దేశం... మన తిరుపతి నగరం కన్నా చిన్నగా ఉంటుంది... ఇంతకీ ఎక్కడుంది? అది ఏ దేశం? చకచకా చదివేద్దాం రండి!

* తువాలూ... ఇదో బుల్లి దేశం. చాలా చి....న్నగా ఉంటుంది. దీని పేరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోని బుల్లి దేశాల్లో ఒకటి. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్నవైన వాటికన్‌ సిటీ, మోనాకో, నౌరు దేశాల తర్వాతి స్థానం దీందే. నాలుగో అతి చిన్న దేశమన్నమాట. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంటుంది. ఈ ద్వీప దేశంలో మొత్తం తొమ్మిది దీవులు. వీటిలో అయిదు పగడపు దీవులు.

* దేశం: తువాలూ
* రాజధాని: ఫునాఫుతి
* జనాభా: 10,045
* విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లు
* భాషలు: తువాలూయన్‌, ఆంగ్లం కరెన్సీ: తువాలూయన్‌, ఆస్ట్రేలియన్‌ డాలర్లు

* జెండా: తువాలూ బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఎక్కువ కాలం ఉన్నందుకు జెండా పై భాగంలో ఎడమవైపున్న యూనియన్‌ జాక్‌ సూచిక, తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది ద్వీపాలకు గుర్తు.
* ఈ ద్వీప దేశానికి ‘ఎలైస్‌ దీవులు’ అనే పేరూ ఉంది.
* ఈ దేశ జనాభా కేవలం పదివేలే. రోడ్లన్నీ కలిపితే ఎనిమిది కిలోమీటర్ల పొడవే ఉంటాయి. మన దగ్గర ఓ పట్టణమంత ఉంటుందంతే.

* అరె... భలే గమ్మత్తుగా ఉందే... వెళ్లి చూద్దామనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్లడం అంత సులువేం కాదు. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి కూడా పడవల్లో వెళ్లాల్సిందే. దేశం మొత్తంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది.

* ఎక్కువ మంది వ్యవసాయం, చేపలు వేటాడటం మీదే ఆధారపడతారు. కొబ్బరిని ఎక్కువగా సాగుచేస్తారు.
* ఈ దేశ రాజధాని ఫునాఫుతిలో మాత్రమే దేశ జనాభాలో 56 శాతం మంది నివసిస్తారు.
* బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి ఈ దేశం 1978లో స్వాతంత్య్రం పొందింది.
* రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్‌తో పోరాటం జరుపుతున్నప్పుడు ఈ దీవులే అమెరికా సైనిక స్థావరాలుగా ఉండేవట.
* మూడు వేల సంవత్సరాల క్రితం పాలినేషియన్లు ఇక్కడికి మొదటిసారిగా వలస వచ్చారట.

* ఎక్కడో దూరాన సముద్రం మధ్యలో కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ. ఏడాది మొత్తంలో రెండు వేలమంది లోపే సందర్శిస్తారట.
* ఇక్కడ ‘కిలికిటి’ అనే ఆట ఆడుకుంటారు. ఇది అచ్చు మనం ఆడుకునే క్రికెట్‌ ఆటలానే ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని