కన్నీటి ధారల కథ వింటారా!

ఎక్కడైనా పర్వతాలు కన్నీళ్లు పెట్టుకోవడం చూశారా? అలాంటివీ ఉంటాయా? అనలా అళ్చర్యంగా చూడకండి. నిజ్జంగానే ఏడ్చే పర్వతాలున్నాయి. కావాలంటే ఈ వివరాలు చూడండి.......

Published : 06 Sep 2017 01:29 IST

కన్నీటి ధారల కథ వింటారా!

ఎక్కడైనా పర్వతాలు కన్నీళ్లు పెట్టుకోవడం చూశారా? అలాంటివీ ఉంటాయా? అనలా అళ్చర్యంగా చూడకండి. నిజ్జంగానే ఏడ్చే పర్వతాలున్నాయి. కావాలంటే ఈ వివరాలు చూడండి.

ది అమెరికాలోని హవాయి. అక్కడ వయాలెయాలె అనే పర్వతాలున్నాయి. స్థానిక హవాయన్‌ భాషలో వయాలెయాలె అంటే పొంగిపొర్లే నీరున్నదని అర్థమట. వీటికి ఇంకో ముద్దు పేరూ ఉందండోయ్‌. ఏంటంటే ‘వాల్‌ ఆఫ్‌ టియర్స్‌’. అంటే ఏడ్చే గోడన్నమాట.
* ఆ పేరు వీటికి వూరికే వచ్చిందనుకుంటున్నారేంటి? అందుకో పేద్ద కథే ఉంది. ఇవి ఒట్టి మట్టి పర్వతాలు కావు. ఎప్పుడో ఇక్కడో అగ్ని పర్వత బిలం ఉండేది. దాన్లోంచి లావా పొంగుకొచ్చి కొన్ని చోట్ల నిటారు గోడలాంటివీ ఏర్పడ్డాయి.

ఆ గోడలపై లావా పొంగుకొచ్చినప్పుడు ఏర్పడ్డ సన్నని కాలువల్లాంటి సందులూ ఉన్నాయి. అసలు విషయం అంతా వీటిలోనే దాగుంది.
* హవాయిలోని ఎత్తయిన శిఖరాల్లో రెండోది ఇక్కడే ఉంది. అందుకే దీని మీద విపరీతంగా వర్షం పడుతుంటుంది. ఆ తడికి కొండలన్నీ నాచు పట్టేసి పచ్చ దుప్పటి కప్పినట్టుంటాయి. ఆ వర్షం నీరు పై నుంచి వేరు వేరు జలపాతాల్లా మారి సన్నని కాలువల్లా కిందికి కారుతుంటుంది.
* ఈ నీరు 5,148 అడుగులు పై నుంచి ప్రయాణిస్తూ కిందికి చేరుతుంది. ఈ ప్రయాణంలో ఈ నీటి ధారల్ని దూరం నుంచి చూస్తే భలేగా అచ్చం కొండ కన్నీరు పెట్టుకున్నట్లే అనిపిస్తుంది. పిల్లలకైతే ‘మనం కన్నీళ్లు కార్చినట్టు ఇవీ కన్నీరు పెడుతున్నాయా’ అన్న అనుమానమూ కలిగేస్తుంది.
* ఏడాదిలో చాలా రోజులు వీటి కన్నీటి ధారలిలా కారుతూనే ఉంటాయి. నిజానికి ఇవి మనం చూసే జలపాతాల్లాంటివే. కానీ చూసేందుకిలా భిన్నంగా ఉంటాయి. అందుకే వేల మంది పర్యటకుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి భలే కన్నీటి పర్వతాల్లేండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని