తీరం దాటడమంటే?

హరికేన్‌... ఈమధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్న మాట. మొన్నేమో టెక్సస్‌లో... ఇప్పుడేమో ఫ్లోరిడాలో... విధ్వంసం సృష్టించింది... ఆ ప్రాంతాల్ని అతలాకుతలం చేసింది... ఆ వివరాలన్నీ విన్న కిట్టూకి మనకు లానే బోలెడు సందేహాలు వచ్చాయి. మరి తెలుసుకోవాలిగా. అందుకే వెంటనే వాళ్ల సైన్స్‌ టీచర్‌ దగ్గరకు పరుగు తాశాడు... ఏం తెలుసుకున్నాడో ఏంటో మనమూ తెలుసుకుందామా!

Published : 12 Sep 2017 01:18 IST

తీరం దాటడమంటే?

హరికేన్‌... ఈమధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్న మాట. మొన్నేమో టెక్సస్‌లో... ఇప్పుడేమో ఫ్లోరిడాలో... విధ్వంసం సృష్టించింది... ఆ ప్రాంతాల్ని అతలాకుతలం చేసింది... ఆ వివరాలన్నీ విన్న కిట్టూకి మనకు లానే బోలెడు సందేహాలు వచ్చాయి. మరి తెలుసుకోవాలిగా. అందుకే వెంటనే వాళ్ల సైన్స్‌ టీచర్‌ దగ్గరకు పరుగు తాశాడు... ఏం తెలుసుకున్నాడో ఏంటో మనమూ తెలుసుకుందామా!

* కిట్టు: టీచర్‌! మరేమో ఈరోజు పొద్దున్నే వార్తా పత్రికలు చదివా. ఎక్కడ చూసినా హరికేన్‌ హరికేన్‌ అనే ఉంది. అసలు అదంటే ఏంటి టీచర్‌?

* టీచర్‌: మంచి ప్రశ్నే అడిగావు కిట్టూ! ఇలా కూర్చో చెబుతా. ముందు తుపాన్‌ అంటే ఏంటో తెలుసా?

* కిట్టు: తెలియదు టీచర్‌!

* టీచర్‌: సముద్రంలో ఉన్నట్టుండి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అంటే అక్కడ గాలి ఉండదన్నమాట. దీంతో చుట్టూ ఉన్న గాలి ఆ ప్రాంతంలోకి వేగంగా చొరబడి సుడులు తిరుగుతుంది. ఆ వేగంగా తిరిగే సుడుల్నే తుపాను అంటారు. దాని మధ్య భాగాన్ని ‘తుపాను నేత్రం’ అంటారు. ఇది అర్థమైందిగా. ఇక అసలు విషయానికి వస్తే... హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టే తుపానులను ‘సైక్లోన్లు’ అంటారు. దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రం, వెస్టిండీస్‌ దీవులు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వచ్చే తుపాన్లను ‘హరికేన్లు’ అంటారు. పడమర పసిఫిక్‌ మహా సముద్రం,. చైనా సముద్రం, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ల్లో వీటిని ‘టైఫూన్లు’ అంటారు. మరేమీ లేదు. ప్రాంతాల్ని బట్టి తుపాన్లకే ఇన్ని పేర్లన్నమాట.

* కిట్టు: మరి తుపాను తీరం దాటడమంటే?

* టీచర్‌: తుపాను నేత్రం అలా సుడులు తిరుగుతూ సముద్రం మీద నుంచి నేలమీదకు ప్రవేశించడమే. అప్పుడు దాని తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది.

* కిట్టు: ఫ్లోరిడాలో హరికేన్‌ మూడు నుంచి నాలుగో స్థాయి(కేటగిరి)కి చేరుకుందని చెప్పారు. అసలు అదేంటి?

* టీచర్‌: భలే గమనించావే. వీచే గాలుల వేగాన్ని బట్టి హరికేన్లు ఐదు స్థాయిల్లో ఉంటాయి. కాస్త శ్రద్ధగా విను. వీటిల్లో గాలి వేగాన్ని బట్టి ఆస్తి, ప్రాణ నష్టాలూ ఉంటాయి.

మొదటి స్థాయిలో వీచే గాలి వేగం గంటకు 74 నుంచి 95 మైళ్ల వరకు ఉంటుంది. దీని వల్ల స్వల్పంగా ఆస్తి నష్టం ఉంటుంది. ఎగురుతున్న చెత్త మీద పడటం వల్ల జీవులకు గాయాలు కావచ్చు. కొన్ని ఇళ్ల పైకప్పులు, భవంతులు దెబ్బతినే అవకాశం ఉంది.

ఇక రెండో స్థాయి హరికేన్‌లో గాలి వేగం గంటకు 96 నుంచి 110 మైళ్లు ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. కొన్ని రోజుల నుంచి వారాల పాటు విద్యుత్తు నిలిచిపోతుంది.

మూడో స్థాయి హరికేన్‌ విషయానికి వస్తే గాలి వేగం గంటకు 111 నుంచి 129 మైళ్ల వరకు ఉంటుంది. ఆస్తి, ప్రాణ నష్టాలు చాలా ఎక్కువ.

నాలుగో స్థాయి హరికేన్‌లో గాలి గంటకు 130 నుంచి 156 మైళ్ల వేగంతో వీస్తుంది. దీని వల్ల భారీ నష్టం ఉంటుంది.

ఇక చివరి స్థాయి హరికేన్‌ చాలా చాలా ప్రమాదకరం. గాలుల వేగం గంటకు 157 మైళ్లకు మించిపోయి ఉంటుంది. చెట్లు వేళ్లతో సహా బయటకొచ్చేస్తాయి.

* కిట్టు: అంటే ఫ్లోరిడాలో వచ్చింది అంత భయంకరమైనదన్నమాట. మరో సంగతి చెప్పండి టీచర్‌. అక్కడ బహమాస్‌ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లిపోయి మళ్లీ 13 గంటలకు తిరిగి వచ్చిందట. నిజమేనా? అసలు అలా జరుగుతుందా?

* టీచర్‌: అదా... నువ్వు ఒక చెంచాడు నీళ్లు తీసుకుని నోటితో ఒకవైపు నుంచి వూది చూడు... చెంచా ముందుభాగంలోని నీరు ఖాళీ అయి వెనక్కి పోగవుతుంది. వూదడం ఆపితే పోగైన ఆ నీరు తిరిగి మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడా సముద్రం విషయంలోనూ జరిగింది ఇదేనన్నమాట. తీరం నుంచి సముద్రంలోకి సముద్రజలాలు దూరంగా లోపలికి వెళ్లిపోయి కొన్ని గంటల తర్వాత తిరిగి అవి తీరం వైపునకు రావడం ఒక విడ్డూరంగా అనిపిస్తుంది కానీ దీనికి కారణం తీవ్రమైన గాలులే.

- సి.వి.సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌ - కోనసీమ సైన్సు పరిషత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని