కొండలు తొలిచి... ఇళ్లుగ మలిచి!

కొండల్లో గుహలుండటం చూసుంటారు. మరి గుహల్లో ఇళ్లుండటం చూశారా? ఎక్కడో ఒకళ్లిద్దరు అలా ఉంటేనే వాళ్లు ఎలా ఉంటున్నారన్న దాని గురించి మనకు బోలెడంత ఆసక్తి. మరేమో ఓ దేశంలో ఏకంగా కోట్ల మంది ఇలా గుహ ఇళ్లల్లోనే ఉంటారు తెలుసా? ఈ కాలంలోనూ అసలు ఇలా ఉండేవాళ్లున్నారా? అనలా ఆశ్చర్యంగా చూడకండి. ఎక్కడో ఏంటో ఓ సారి చదివేయండి...

Updated : 12 Nov 2022 17:10 IST

కొండలు తొలిచి... ఇళ్లుగ మలిచి! 

కొండల్లో గుహలుండటం చూసుంటారు. మరి గుహల్లో ఇళ్లుండటం చూశారా? ఎక్కడో ఒకళ్లిద్దరు అలా ఉంటేనే వాళ్లు ఎలా ఉంటున్నారన్న దాని గురించి మనకు బోలెడంత ఆసక్తి. మరేమో ఓ దేశంలో ఏకంగా కోట్ల మంది ఇలా గుహ ఇళ్లల్లోనే ఉంటారు తెలుసా? ఈ కాలంలోనూ అసలు ఇలా ఉండేవాళ్లున్నారా? అనలా ఆశ్చర్యంగా చూడకండి. ఎక్కడో ఏంటో ఓ సారి చదివేయండి.
* మన పొరుగు దేశం చైనా ఉంది కదా. దాని ఉత్తర భాగంలో చాలా మంది మట్టి, రాతి కొండల్ని తొలుచుకుని వాటి లోపల గదులు నిర్మించుకుంటారు. ఒక్కో కుటుంబానికీ ఈ కొండల్లో ఇలా మూడు, నాలుగు గదులున్న ఇళ్లు ఉంటాయి. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తు, తొమ్మిదడుగుల వెడల్పుతో ఉంటాయీ గదులు.
* వీటిలో 2006 వరకూ ఏకంగా నాలుగు కోట్ల మంది నివాసం ఉండేవారు. ఇప్పుడైతే దాదాపుగా మూడు కోట్ల మంది ఉంటున్నారని అంచనా. వీళ్లంతా పేదరకంతో ఇళ్లు కట్టుకోలేకే ఇలా ఉంటున్నారేమో అనుకుంటే పొరపాటేనండోయ్‌. వీటిలో చాలా విలాసవంతమైన యోడంగ్‌లూ ఉంటాయి తెలుసా?
* కొన్నింటిలో గదులన్నీ నిలువుగా పెట్టెపై పెట్టె పేర్చినట్లు ఉంటాయి. ఇంకొన్నేమో రైలు పెట్టెల్లా వరుసగానూ ఉంటాయి. కుక్కలు, పిల్లుల్లాంటి వాటిని పెంచుకోవడానికీ వీటిల్లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తారట.

ఈ గుహ ఇళ్లని ఇక్కడ ‘యోడంగ్‌’ అని పిలిచేస్తారు. ఈ సంస్కృతి ఎక్కువగా తుర్పాన్‌, కాస్గర్‌, డున్హంగ్‌.. లాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది.
* ఈ ఇళ్లలో మొదటి తరం ఇళ్లు క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ల క్రితం నాటివట. అప్పటి నుంచి కొంత మంది ఇలా కొండలోపల తొలుచుకుని ఇళ్లు కట్టేసుకుని ఎంచక్కా అందులో బతికేస్తున్నారు. మన అపార్ట్‌మెంట్‌లలో బోలెడు కుటుంబాలు ఉన్నట్టు ఇక్కడ ఒక కొండలో ఒక కాలనీయే ఉంటుంది మరి.
* రాతి కొండల్లోనే కాదు, మట్టి కొండల్లోనూ వీళ్లు వీటిని కట్టేస్తారు. గదుల్ని జాగ్రత్తగా తొలిచి గోడలు, పైన అంతా ఇటుకలతో ప్రత్యేకమైన కట్టుబడి కడతారు. అలా వాటని ఎటువంటి ప్రమాదం లేకుండా మార్చేసుకుంటారన్నమాట. మొత్తానికి భలే ఇళ్లులేండి!

* వీటి లోపలకి సహజమైన వెలుతురు వచ్చేందుకు వీలుగా కిటికీలు, గుమ్మాల నిర్మాణం ఉంటుంది.
* కొండలోపల ఉండటం వల్ల ఈ ఇళ్లల్లో మరో సౌకర్యమూ ఉంది. వీటిల్లో చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. దీంతో ఏసీలు, కరెంటు వాడకమూ తగ్గిపోతుంది. ఇలా ఇవి పర్యావరణానికీ మంచే చేస్తున్నాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని