వందలాది తాబేళ్లు! చూడ చాలవు కళ్లు!!

మ్యూజియం అనగానే ఏవో పురాతన వస్తువులో, బొమ్మలో, అలనాటి ఆకారాలో ఉంటాయనుకుంటాం. కానీ ఓ ప్రదర్శనశాల దీనికి భిన్నం. ఎందుకంటే ఈ మ్యూజియంలో నిజమైన ప్రాణులుంటాయి. ఇవన్నీ సింగపూర్‌లోని ‘లైవ్‌ టర్టిల్‌ అండ్‌ టార్‌టస్‌ మ్యూజియం’ సంగతులు.

Published : 06 Oct 2017 01:41 IST

వందలాది తాబేళ్లు! చూడ చాలవు కళ్లు!!

మ్యూజియం అనగానే ఏవో పురాతన వస్తువులో, బొమ్మలో, అలనాటి ఆకారాలో ఉంటాయనుకుంటాం. కానీ ఓ ప్రదర్శనశాల దీనికి భిన్నం. ఎందుకంటే ఈ మ్యూజియంలో నిజమైన ప్రాణులుంటాయి. ఇవన్నీ సింగపూర్‌లోని ‘లైవ్‌ టర్టిల్‌ అండ్‌ టార్‌టస్‌ మ్యూజియం’ సంగతులు.

* పేద్ద డిప్పతో చిన్ని తలతో నేలపై నె... మ్మ...దిగా నడిచే, నీటిలో అలా జారిపోతూ తేలియాడుతూ కనిపించే తాబేళ్లంటే మనకెంతో ఇష్టం. వాటి గునగున నడకల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ ప్రదర్శనశాలకు వెళితే అలాంటి తాబేళ్లను ఎన్నో చూడొచ్చు. బొమ్మలే కాదు.. నిజమైన కూర్మాలు బోలెడుంటాయి. చిన్న చిన్న నీటి ట్యాంకుల్లో ఈదులాడుతూ కనిపిస్తాయి. అంతేకాదు నేలపై కూడా మెల్లిమెల్లిగా నడుస్తూ దర్శనమిస్తాయి. మనం ఎంచక్కా వాటిని తాకొచ్చు. ఆహారం తినిపించొచ్చు. సరదాగా ఆడుకోవచ్చు.
* చేతిలో పట్టేంత పరిమాణం నుంచి భారీ సైజు వరకు ఉండే ఈ తాబేళ్ల సంఖ్య దాదాపు 1,600. ఇవి 60 జాతులకు చెందినవి. పిగ్‌నోస్డ్‌, అలిగేటర్‌ స్నాపింగ్‌ టర్టిల్‌, ఆఫ్రికన్‌ స్పర్డ్‌ తాబేలు వంటి అరుదైన జాతులూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో తాబేళ్లున్న ప్రదర్శనశాలగా గిన్నిస్‌ రికార్డూ ఉంది.
* చైనీస్‌ గార్డెన్‌ దగ్గరే ఏర్పాటు చేశారీ మ్యూజియాన్ని. చైనీయులు తాబేళ్లను అదృష్టానికి, సుదీర్ఘ కాలానికి గుర్తుగా నమ్ముతారట.
* డానీ, కోనీ టాన్‌ అనే తండ్రీ కూతుళ్లు కలిసి ఈ తాబేళ్లను 40 ఏళ్ల పాటు రకరకాల ప్రదేశాల నుంచి సేకరించారు.
* వందల్లో ఉన్న ఈ తాబేళ్లను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు సందర్శకులు.

మీకు తెలుసా?
* భూమిలోపల బొరియలు చేసుకుని ఉండే తాబేళ్లను టార్‌టస్‌ అంటారు. నీటిలో ఉండే తాబేళ్లని టర్టిల్స్‌ అంటారు.
* ప్రాచీన కాలంలో రోమన్‌ మిలటరీ వాళ్లు తాబేళ్లను చూసే రక్షణ కవచాల్ని తయారు చేసుకున్నారట.
* తాబేళ్లు భూమిపై 200 మిలియన్‌ ఏళ్ల నుంచే ఉన్నాయి.
* తాబేళ్ల గుంపును ‘క్రీప్‌’ అంటారు.
* సముద్రపు తాబేళ్లలో ఒక రకమైన గ్రంథులుంటాయి. వీటి సాయంతో ఇవి సముద్రంలోని ఉప్పును వేరు చేసుకుంటాయి.
* తాబేళ్ల డిప్ప దాదాపు 60 రకాల ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ఏనుగు దంతాల్లాగే వీటి డిప్పలతోనూ బోలెడు అలంకరణ వస్తువులను తయారు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు