అక్కడ రోజూ దీపావళే!

మన ఇళ్లన్నీ దీపావళి పండగకే కాంతులతో కళకళలాడుతాయి... దివ్వెలతో వెలిగిపోతాయి.... కానీ కొన్ని చోట్ల రోజూ దీపావళి కాంతులే కనిపిస్తాయి... చమక్‌ చమక్‌మంటూ కనువిందుచేస్తాయి.... ఎక్కడో ఏమిటో తెలుసుకుందామా!

Published : 18 Oct 2017 01:35 IST

అక్కడ రోజూ దీపావళే!

మన ఇళ్లన్నీ దీపావళి పండగకే కాంతులతో కళకళలాడుతాయి... దివ్వెలతో వెలిగిపోతాయి.... కానీ కొన్ని చోట్ల రోజూ దీపావళి కాంతులే కనిపిస్తాయి... చమక్‌ చమక్‌మంటూ కనువిందుచేస్తాయి.... ఎక్కడో ఏమిటో తెలుసుకుందామా!
  

వెలుగుతో పయనం!

నం సముద్రాల్లో పడవేసుకుని షికారుకెళ్లాలంటే పొద్దు పోకముందే వెళుతుంటాం. కానీ ఓ చోటకి మాత్రం చీకటి పడగానే పడవల్లో బయలుదేరుతారు. ఎందుకో తెలుసా? రాత్రిళ్లు ఆ నీరుని ముట్టుకుంటే చాలు... ధగధగా మెరిసిపోతుంది. పడవ కదులుతున్న కొద్దీ జిగేల్‌మంటూ మెరుపులు వస్తాయి. అదేదో వెలుగే... పడవ వెంబడి వస్తున్నట్టు వింత అనుభూతి కల్గుతుంది. ఇంతకీ ఎక్కడో చెప్పలేదూ కదూ... ప్యూర్టోరికోలోని వియెక్స్‌ దీవి సముద్రతీరంలో. ఈ వింత తీరు వల్ల ఈ బీచ్‌ని ‘మ్యాజికల్‌ బయోల్యూమినిసెంట్‌ బే’ అంటూ పిలుస్తారు. ఇక్కడేదో మాయో మంత్రమో లేదు... మరి ఎందుకు ఆ తళుకులు? అంటే... ఈ నీటిలో లక్షల సంఖ్యలో పైరోడినియమ్‌ బహమెన్సె, డైనోఫ్లాగెల్లటెస్‌ అనే ప్రత్యేకమైన జీవులుంటాయి. వీటిని వేరే జీవులు తాకినా, కదిలించినా అలా కాంతులు వెదజల్లుతూ మెరిసిపోతాయన్నమాట. కారు చీకట్లలో వీటి కాంతి మరీ ఎక్కువ.

మెరిసే గుహ!

క్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి? ఆకాశంలోనే కదా...
కానీ న్యూజీలాండ్‌లోని వైటొమో గుహలోనూ చూడొచ్చు. నీళ్లతో నిండిన ఈ గుహలో పడవేసుకుని వెళ్లాలి. లోపలికెళ్లి తలెత్తి పైకి చూడగానే మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదేదో త్రీడీ ఎఫెక్ట్‌లా ఉందే అనిపించకమానదు. కానీ అవి ప్రకృతి సహజసిద్ధమైన కాంతులే. ఆ కాంతులకు కారణమేంటో తెలుసా? ఆ గుహగోడలపై ఉన్న గ్లోవార్మ్స్‌. మిణుగురు పురుగుల్లాంటివే ఇవి. చమక్కుమంటూ మెరుస్తూ అచ్చు నక్షత్రాల్లా అనిపిస్తాయి. ఈ గమ్మత్తయిన చుక్కల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తారు.

వెలుగుల తీరం!

గిసి వస్తున్న అలల తీరాన్ని చూసి ఉంటారు మరి.. కాంతులీనే సముద్ర తీరం చూశారా? జపాన్‌లోని టొయామ తీరం చూడండి ఆ ముచ్చట తీరిపోతుంది. చిమ్మచీకటిలో దర్శనమిచ్చే ఈ వెలుగుల్ని దూరం నుంచి చూస్తే తీరం వెంబడంతా వజ్రాల్ని పరిచినట్టు వింతగా అనిపిస్తుంది. మరి ఈ మెరుపులు ఎలా వస్తాయో తెలుసా? ఈ దేశంలో ప్రత్యేకమైన మెరిసే ఫైర్‌ఫ్లై స్క్విడ్స్‌ ఉంటాయి. ఇవి కొన్ని లక్షలాదిగా ఈ తీరానికి వచ్చి వరుసలు కట్టి గుడ్లుపెడతాయి. అంత పెద్ద సంఖ్యలో కాంతులీనుతూ కనిపించే ఈ స్క్విడ్స్‌ వల్లే తీరం తళుకులీనుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని