వ్యవసాయం.. నివాసం.. సముద్రంలోనే!

సముద్రంలో వారగా బోలెడు ఇళ్లు... ఆ నీళ్లలోనే చిన్న చిన్న చెరువులు... వాటిల్లో చేపల పెంపకం... ఇంకా బోలెడంత జల వ్యవసాయం... ఎక్కడికో వెళ్లి అవన్నీ చిన్నూ చూసొచ్చాడట... మనతో పంచుకునేందుకు ఇలా వచ్చేశాడు!

Published : 27 Oct 2017 01:52 IST

చిన్నూ కబుర్లు
వ్యవసాయం.. నివాసం.. సముద్రంలోనే!

సముద్రంలో వారగా బోలెడు ఇళ్లు... ఆ నీళ్లలోనే చిన్న చిన్న చెరువులు... వాటిల్లో చేపల పెంపకం... ఇంకా బోలెడంత జల వ్యవసాయం... ఎక్కడికో వెళ్లి అవన్నీ చిన్నూ చూసొచ్చాడట... మనతో పంచుకునేందుకు ఇలా వచ్చేశాడు!

ల్లో నేస్తాలూ! ఎప్పటిలానే ఇప్పుడూ నేను గమ్మత్తయిన ప్రాంతాల్ని చూసొచ్చా. ఎక్కడంటే చైనాలో. మనం సిటీ అంటే నేలమీదే ఉంటుందనుకుంటాం. కానీ ఇక్కడ కొన్ని సిటీలు ఉన్నాయి. అవేమో ఉండేదంతా అచ్చంగా నీళ్లపైనే. మీరు నమ్మకపోయినా ఇది నిజ్జంగా నిజం.
* అక్కడి వాళ్లంతా వీటిని ఫ్లోటింగ్‌ సిటీస్‌ అనేస్తారు. ఇవి ఎక్కడున్నాయంటే చైనాలోని ఫుజియన్‌ ప్రావెన్సులో. అక్కడి తీరం వెంబడి అంతా ఎంచక్కా సముద్రపు నీళ్లపై తేలే ఇళ్లే కనిపిస్తాయి.
* అక్కడక్కడా చుట్టూ పర్వతాలుండి ఆ మధ్యలో సముద్రం ఉన్న చోట్లు ఉంటాయి కదా. అలాంటి చోట్లంతా అలలు మెల్లగా వస్తాయట. అందుకే అక్కడ ఈ ఇళ్లు వేసుకున్నారట.
* ముందు వాటిని చూసి ఎందుకబ్బా? వీళ్లిలా సముద్రంలో ఇళ్లేసుకున్నారు అనుకున్నా. అక్కడికి వెళ్లి చూస్తే అసలు విషయం అర్థమైంది. ఆ ఇళ్లకు ఆనుకుని వాళ్లు అక్కడే వ్యవసాయం చేసేస్తున్నారు. వలల్లాంటి వాటిని నీటిలో మునిగేలా చేసి కేజ్‌ల్లో చేపలు, పీతలు, ఇతర జలచరాల్ని పెంచేస్తున్నారు. ముత్యాల్లాంటివీ పండించేస్తున్నారు. మరికొందరేమో ఔషధాల్లో వాడే సముద్రనాచునూ పెంచి డబ్బు సంపాదిస్తున్నారు. ఇదంతా చిత్రంగానే అనిపించింది నాకు.
* ఆ పంటల్ని దగ్గరుండి చూసుకునేందుకే వాళ్లంతా ఇలా అక్కడే ఇళ్లు కట్టేసుకున్నారు. నీళ్లపై తేలే దుంగలు, థర్మాకోల్‌ అట్టల్ని ఆసరాగా చేసుకుని చెక్క, పాత ఇనుప రేకులతో ఈ ఇళ్లు వేసుకున్నారు.

* మన పంట పొలాల్లో మనుషులు దిగి పొలం పనులు చేస్తారా? వీళ్లేమో పడవల్లో వాటి చుట్టూ తిరుగుతూ పనులు కానిచ్చేస్తున్నారు. కొందరు ఈతకొడుతూ నీటి లోపలికీ వెళ్లి వలల్లాంటివాటిని పరిశీలించుకుంటున్నారు.
* దాదాపు 25 ఏళ్లుగా వీళ్లు ఈ సముద్రంపై వ్యవసాయానికి బాగా అలవాటు పడ్డారట.
* ఏటా చైనాలో 32 మిలియన్‌ టన్నుల సముద్రపు ఆహారం(చేపల్లాంటివి) ఉత్పత్తి అవుతుంది. ప్రపంచం మొత్తంలో లభించే ఈ ఆహారంలో మూడొంతుల్లో రెండొంతులు ఇక్కడిదేనట. అందులో కొంత భాగం ఈ ఫ్లోటింగ్‌ సిటీల నుంచే వస్తుందట. ఈ వివరాలన్నీ తెలుసుకున్నాక చైనా వ్యవసాయ పద్ధతులు భలేగా ఉన్నాయే అనిపించింది నాకు. మరి మీకూ!
* ఇలా సముద్రంలోనే ఉండి చేసే వ్యవసాయాన్ని ‘మ్యారీ కల్చర్‌’ అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని