ప్రవహించే ఇంద్రధనుస్సు!

ఎక్కడైనా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉందే’ అనిపించకమానదు.

Published : 28 Oct 2017 01:40 IST

ప్రవహించే ఇంద్రధనుస్సు!
కొలంబియా

పంచవన్నెల నది!

క్కడైనా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉందే’ అనిపించకమానదు. ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటిది. ఇంతకీ నది పేరు చెప్పలేదు కదూ... పేరు కేనో క్రిస్టేల్స్‌. ఇక్కడి సెరెనియా డి లా మెకెరెనా పర్వత శ్రేణిలో ఉంటుందిది. ప్రకృతి అందాలన్నీ కనిపించే ఈ నదిలో రంగులు ఎలా వచ్చాయబ్బా అంటే... ఈ నది అడుగు భాగం వేల సంవత్సరాల క్రితం క్వార్ట్జ్‌ అనే రాయితో ఏర్పడిందట. ఈ రాయిపై జులై నుంచి నవంబరు మధ్య కాలంలో రంగు రంగుల మెకెరెనియా క్లెవెజెరా అనే నాచు పెరుగుతుంది. ఈ నాచే నదికి వర్ణాల్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఈ వర్ణాల అందాల వల్ల ఈ నదినే ‘లిక్విడ్‌ రెయిన్‌బో’ అనే పేరుతోనూ పిలుస్తారు.

కాఫీ తాగరా బాబూ!

* మన దగ్గర ఎదిగే పిల్లలంతా పాలు తాగినట్టు ఇక్కడి చిన్నారులు కాఫీ తాగుతారు. రోజూ భోజనం తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ‘కాఫీ కాన్‌ లేచే’ ఇస్తారు.
* స్పెయిన్‌ నుంచి ఈ దేశం 1813లో పూర్తి స్వాతంత్య్రంసంపాదించుకుంది.
* మన ఆభరణాల్లో వాడే పచ్చరాళ్ల గనులు ఇక్కడ చాలా ఎక్కువ. అందుకే ఈ దేశం పచ్చరాళ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు... ప్రపంచదేశాలు వాడే కాఫీ పొడిలో 12 శాతం ఇక్కడి నుంచే వస్తుంది.
* ఇక్కడి వీధుల్లో కొంతమంది ‘బయ్యింగ్‌ మినిట్స్‌’ అంటూ బోర్డులు పెట్టుకుంటారు. కాలాన్ని ఎలా అమ్ముతారబ్బా అనుకోకండి. అంటే వాళ్ల సెల్‌ఫోన్ల ద్వారా మనకు నచ్చిన చోటుకి మాట్లాడుకుని డబ్బులు చెల్లించాలన్నమాట.
* ఈ దేశంలో 70 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లో నివసిస్తారు.

* కొలంబియా... దక్షిణ అమెరికాలోని వాయువ్యభాగంలో ఉంటుందీ దేశం. తూర్పున వెనుజులా, బ్రెజిల్‌, దక్షిణాన ఈక్వెడార్‌, పెరూ, ఉత్తరాన కరీబియన్‌ సముద్రం, వాయువ్యంలో పనామా, పశ్చిమాన పసిఫిక్‌ మహా సముద్రం ఉంటాయి. మొత్తం ఐదు దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుందిది.

* ఇక్కడ చాలా స్థానిక భాషలున్నాయి. కానీ 99 శాతం మంది జనాభా స్పానిష్‌లోనే మాట్లాడతారు.
* రాజధాని బొగొటా ప్రపంచంలోని ఎత్తయిన రాజధాని నగరాల్లో ఒకటి. సముద్రమట్టానికి 8,360 అడుగుల ఎత్తులో ఉంటుందిది.
* ఈ దేశంలో మొత్తం 300 బీచులుంటాయి. మంచి సందర్శక ప్రాంతాలివి.
* మూడింట ఒకవంతు అమెజాన్‌ అడవి విస్తరించి ఉందిక్కడ.
* ఈ దేశంలో 1,800 జాతుల పక్షులు కనిపిస్తాయి.
* ఇక్కడ ఓ చట్టం ఉంది. దీని ప్రకారం టీవీల్లో, రేడియోల్లో రోజూ ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు జాతీయ గీతం ప్రసారం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని