రోజూ పది భూకంపాలు!

వేల దీవులు. అన్నీ కలిపి ఒకటే దేశం. అదే ఫిలిప్పీన్స్‌. ఇక్కడ ఏదో ఒక చోట రోజూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. సరాసరిన చూసుకుంటే రోజుకు పది నుంచి ఇరవై భూకంపాలు సంభవిస్తాయట....

Updated : 12 Nov 2022 16:59 IST

ఫిలిప్పీన్స్‌
రోజూ పది భూకంపాలు!

వేల దీవులు. అన్నీ కలిపి ఒకటే దేశం. అదే ఫిలిప్పీన్స్‌. ఇక్కడ ఏదో ఒక చోట రోజూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. సరాసరిన చూసుకుంటే రోజుకు పది నుంచి ఇరవై భూకంపాలు సంభవిస్తాయట. అందుకు కారణం ఏంటో తెలుసా? 

కొండల్లో వ్యవసాయం

* ఇక్కడ కొండలు ఎక్కువ. అందుకే రెండు వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడి వారు కొండలపై వ్యవసాయం చేస్తున్నారు. వాటికి గట్లుగట్లుగా కట్టి చదును చేసి వరి పండిస్తారు. వీటిని ‘ఫిలిపైన్‌ కార్డిలెరాస్‌’ అని పిలుస్తారు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగానూ గుర్తించింది.
* కొబ్బరి కాయలు ఎక్కువగా పండే దేశాల్లో ఇదీ ఒకటి. ఇతర దేశాలకు వీటిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఇది మొదటిది.

దేశం: ఫిలిప్పీన్స్‌
రాజధాని: మనీలా
జనాభా: 10,54,43,686
విస్తీర్ణం: 300,000 చదరపు కిలోమీటర్లు
అధికారిక భాషలు: ఫిలిప్పినో, ఇంగ్లిష్‌ కరెన్సీ: పెసో

మాటల్లేవ్‌...మాట్లాడుకోవడాల్లేవ్‌!

* ఇక్కడి వారు టెక్ట్స్‌ మెసేజింగ్‌ని చాలా ఎక్కువగా వాడతారు. అందుకే దీనికి ‘టెక్స్ట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అనే ముద్దుపేరూ ఉంది. ఇక్కడున్న పదికోట్లకు పైగా జనం రోజుకు నలభైకోట్లకు పైగా మెసేజ్‌లు పంపుతారట.
* ఇక్కడ ఎదిగే మడ అడవుల్లో తెలుపుగా ఉండే ‘నిలాడ్‌’ అనే పూలు పూస్తాయి. వాటి పేరులోంచే దీని రాజధాని నగరానికి ‘మనీలా’ అనే పేరొచ్చింది. కోటిమందికి పైగా జనాభా ఇక్కడే నివసిస్తారు.
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద పది షాపింగ్‌ మాల్‌లలో మూడు ఇక్కడే ఉన్నాయి. అవి ఎస్‌ఎమ్‌ మెగామాల్‌, ఎస్‌ నార్త్‌ ఎడ్సా, ఎస్‌ఎమ్‌ మాల్‌ ఆఫ్‌ ఏషియా.

* ప్రజా రవాణాలో జీప్‌నీస్‌ అనే వాహనాలు ఇక్కడే కనబడతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940ల్లో అమెరికా సైనికులు తిరిగేందుకు ఇక్కడకి జీపుల్ని తీసుకొచ్చారు. తర్వాత వాళ్లు వాటిని ఇక్కడే వదిలి వెళ్లిపోయారు. వాటిని మినీ బస్సుల్లా తయారు చేసి ఇప్పుడు ప్రజా రవాణా కోసం వాడేస్తున్నారిక్కడ.
* ఈ దేశం ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూఫలకాలు సర్దుకుంటూ ఉంటాయి. అలా పుట్టే ఒత్తిడి వల్లే ఇక్కడీ ప్రకంపనలు. అమ్మో! ఇన్ని భూకంపాలొస్తే చాలా ప్రమాదం కదూ అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే పెద్ద భూకంపాలు వస్తాయి. మిగిలినవన్నీ రిక్టరు స్కేలుపై చిన్నగా నమోదవుతాయి. అందుకే వాటి వల్ల పెద్ద ప్రమాదమేం ఉండదు.
* ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉండటం వల్లనే ఇక్కడ అగ్ని పర్వతాలూ ఎక్కువ.
* ఇక్కడ 14మైళ్లున్న ఓ దీవిలో టౌన్‌లు ఐదుంటే అగ్ని పర్వతాలు మాత్రం ఏడున్నాయి. అతి కొద్ది భూభాగంలో ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నది ఇక్కడే. మౌంట్‌ పినాటుబో, టాల్‌, మయన్‌ ఎప్పుడూ లావాను కక్కుతూనే ఉంటాయిక్కడ.
* ఫిలిప్పీన్స్‌ సముద్రం మధ్యలో ఉండే ద్వీప దేశం కాబట్టి చుట్టూ సముద్రమే ఉంటుంది. ఏ దేశంతోనూ సరిహద్దుల్ని పంచుకోదు. తైవాన్‌, ఇండోనేషియాల మధ్య ఉండే పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంటుందిది.
* ఇక్కడ మొత్తం 7,107 ద్వీపాలున్నాయి. వీటిల్లో 2000 మాత్రమే నివాసాలకు అనువైనవి. మిగిలిన ఐదువేల దీవులకు అసలు పేర్లే లేవు.
* అత్యధికంగా ఇక్కడ 175 భాషలు మాట్లాడతారు.
* పూర్వం దీన్ని స్పానిష్‌ వాళ్లు పాలించారు. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌2 గౌరవార్థం ఈ దేశానికి ఫిలిప్పీన్స్‌ అనే పేరొచ్చింది.
* 1945లో అమెరికా నుంచి స్వతంత్రం పొందింది.

మంకీ ఈటింగ్‌ ఈగల్‌!

* వీరి జాతీయ పక్షి ‘మంకీ ఈటింగ్‌ ఈగల్‌’. ఇది ఇక్కడ మాత్రమే ప్రత్యేకం. గద్దల్లో అతి పెద్దది. ఏకంగా కోతుల్నే చంపి తింటుంది. దీని రెక్కల్ని పూర్తిగా విప్పితే ఆ పొడవే ఆరడుగుల పైన ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవి ఇక్కడ అంతరించిపోయే దశలో ఉన్నాయట.
* నల్లని ఉడుతల్లా ఉండే ‘స్కన్క్స్‌’ ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి.
* గత పదేళ్లలోనే ఇక్కడ 16 రకాల కొత్త జీవ జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జెండాలోని ఎరుపు గతంలోని యుద్ధ సమయానికి, నీలం ఇప్పటి శాంతికి చిహ్నం. తెలుపు ఐక్యతకు, సమానత్వానికి గుర్తు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని