రంగుల లోకం... మెరుపుల సొరంగం!

అనగనగా ఓ సొరంగం ఉంది... ఒట్టిగా చూస్తే మామూలుగానే ఉంటుంది... లైట్లేసి చూస్తే కళ్లు చెదిరే విషయం ఉంది... పైగా దానిలో ఓ మ్యూజియమూ ఉంది... ఇన్ని విశేషాలు ఉంటే మరి మనమూ తెలుసుకోవాల్సిందేగా!

Published : 15 Nov 2017 01:52 IST

రంగుల లోకం... మెరుపుల సొరంగం!

అనగనగా ఓ సొరంగం ఉంది... ఒట్టిగా చూస్తే మామూలుగానే ఉంటుంది... లైట్లేసి చూస్తే కళ్లు చెదిరే విషయం ఉంది... పైగా దానిలో ఓ మ్యూజియమూ ఉంది... ఇన్ని విశేషాలు ఉంటే మరి మనమూ తెలుసుకోవాల్సిందేగా!

కప్పుడు అదో జింకు గని... భూమిలోపలున్న దానిలో ఇంకా బోలెడు ఖనిజాలు, రంగు రాళ్లూ లభించేవి. వాటన్నింటినీ 1739 నుంచి 1986 మధ్య తవ్వేశారు. అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని మూసేశారు. ఫలితంగా అక్కడో గని సొరంగం ఏర్పడింది. దానిలోనే ఇప్పుడో అద్భుతం ఉంది.
* ఇది ఉన్నది ఎక్కడంటే అమెరికాలోని న్యూజెర్సీలో.
* మామూలుగా చూస్తే అదంతా రాతి గోడలున్న సొరంగంలా కనిపిస్తుంది. అయితే అల్ట్రావైలెట్‌ లైట్‌ వేస్తే అసలు అందం ఏంటో తెలుస్తుంది. ఆ గోడలన్నీ నీలం, పచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో మెరిసిపోతాయి. మిరుమిట్లు గొలిపే అందాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అందుకే దీన్ని రెయిన్‌బో టన్నెల్‌ అనీ పిలుస్తారు.
* మూసేసిన ఈ గనిని 1990లో రిచర్డ్‌, రాబర్డ్‌ హక్‌ అనే ఇద్దరు కొనుక్కున్నారు. దీంట్లో ‘స్టెర్లింగ్‌ హిల్‌ మైనింగ్‌ మ్యూజియం’ని ప్రారంభించారు.
* దీన్ని చూడాలంటే మనం భూమి లోపల 2,550 అడుగుల కిందికి వెళ్లాలి మరి. లిఫ్టులో ఆ ప్రయాణమూ గమ్మత్తుగానే ఉంటుంది.
* మొత్తం 35 మైళ్లున్న ఈ సొరంగంలో కొన్ని చోట్ల గోడలన్నింటికీ అల్ట్రావైలెట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో మనం తలెత్తి చూస్తే సొరంగంలోనే ఇంద్రధనుస్సు రంగులు విరిసాయా అనిపించక మానదు.
* ఈ ఒక్క గనిలోనే 350కిపైగా ఖనిజాలున్నాయి. వాటిల్లో 15శాతం ఖనిజాలు మెరిసేవే.
* వాటన్నింటినీ మచ్చుకు సేకరించి దానిలోనే మ్యూజియం ఏర్పాటు చేశారు. లైటు కాంతుల్లో ఆ రాతి ముక్కల్ని చూస్తుంటే... అబ్బ... భలే అనుభూతి కలుగుతుంది. వాటి కిందే ఆ ఖనిజం వివరాలూ ఉంటాయక్కడ. వాటిని చదివి బోలెడు విజ్ఞానాన్నీ పొందొచ్చు.
* ఇప్పుడు ఇక్కడ గనిని చూడటమే ఓ వింత అయితే, అందులో ఉన్న మ్యూజియం మరో అద్భుతమే.

ఖనిజ మెరుపులు

భూమిలో ఖనిజాలుంటాయని తెలుసు. మరి వాటిల్లో కాంతి పడగానే కొన్ని మెరుస్తాయని తెలుసా? వాటినే ఫ్లోరోసెంట్‌ మినరల్స్‌ అంటారు. వాటిల్లో అన్నీ కాకపోయినా కొన్నింటి పేర్లు ఇక్కడ తెలుసుకుందాం.
* ఏక్సినైట్‌, బారైట్‌, కాల్సైట్‌, హలైట్‌, కోరండమ్‌...లు ఎరుపు రంగులో మెరుస్తాయి.
* ఆంబర్‌, అపటైట్‌, అల్యునైట్‌...లు నారింజ రంగుతో మిరుమిట్లు గొలుపుతాయి.
* అడామైట్‌, అరాగొనైట్‌, అటునైట్‌...లు పచ్చగా తళతళలాడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని