ఎర్ర తివాచీ కాదిది... పీతల దండు!

అనగనగా ఓ దీవి... అక్కడక్కడ మాత్రమే మనుషులు... పీతలు మాత్రం లక్షలకు లక్షలు... చలికాలం వస్తే ఈచోటుపై అందరికీ బోలెడు ఆసక్తి... ఎందుకో ఏంటో ఇది చదివేస్తే మీకే తెలుస్తుంది!...

Published : 21 Nov 2017 01:54 IST

ఎర్ర తివాచీ కాదిది... పీతల దండు!

అనగనగా ఓ దీవి... అక్కడక్కడ మాత్రమే మనుషులు... పీతలు మాత్రం లక్షలకు లక్షలు... చలికాలం వస్తే ఈచోటుపై అందరికీ బోలెడు ఆసక్తి... ఎందుకో ఏంటో ఇది చదివేస్తే మీకే తెలుస్తుంది!దీవి పేరు క్రిస్మస్‌ ఐలాండ్‌. ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలో. ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది మాత్రమే ప్రజలుంటారు. ఈ మధ్య ఉన్నట్టుండి ఈ దీవిలో వీధులన్నీ ఎర్రగా మారిపోయాయి. ఏంటో ఏమో అని భయపడిపోకండి. ఇంతకీ అవన్నీ కోట్లాది పీత పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి వెనకున్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం రండి.
* ఇక్కడ కొద్దిగా నివాసప్రాంతాలున్నాయి గానీ చాలా మటుకు అడవే. అందులో లక్షల్లో ఎర్ర పీతలుంటాయి. ఇవి మిగిలిన జాతి పీతల్లా నీటిలో కాకుండా నేల మీద బతికేవన్నమాట. తడిగా ఉండే మెత్తని మట్టిలో జీవిస్తాయివి.
* ఈ అడవిలోని పండుటాకుల్ని తింటూ బతుకుతాయి. ఇక్కడివి 40, 50 లక్షల వరకూ ఉంటాయని అంచనా. అంటే ఏ చెట్టున, ఏ గట్టున చూసినా ఇవే అన్నమాట.
* అయితే అక్టోబరు, నవంబరు నెలలు రాగానే ఇక్కడ ఓ చిత్రం చోటు చేసుకుంటుంది. లక్షలాది పెద్ద పెద్ద ఎర్ర పీతలు అడవుల్లోంచి కొండలు, కోనలు దాటుకుంటూ సముద్రంలోకి వలసకు బయలుదేరతాయి.
* ఈ సమయంలో ఏ రోడ్లపై చూసినా, ఇళ్ల వాకిళ్లలోనైనా.. చకచకా నడిచే పీతలే కనిపిస్తాయి. వాటికి ఎలాంటి హానీ చేయకుండా స్థానికులు చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. రోడ్లు దాటేప్పుడు కొన్ని వాహనాల కింద పడి చనిపోతున్నాయని గుర్తించి వీటి కోసం ఏకంగా వంతెనలూ కట్టించారు. రోడ్డు కింద సొరంగ మార్గాల్లాంటివీ ఏర్పాటు చేశారు. ఇంకొన్ని రోడ్లేమో ఈ కాలంలో మొత్తం మూసేస్తారు.

* అవి సముద్రంలోకెళ్లి బోలెడు గుడ్లు పెట్టేస్తాయి. ఓ పెద్ద ఎర్ర పీత ఏకంగా లక్షకుపైగా గుడ్లు పెడుతుందట. ఆ గుడ్లు పిల్లలైపోయాక ఇప్పుడు మళ్లీ ఇంకో విచిత్రం. సముద్రంలో ఒక్కసారిగా కోట్ల పిల్లలు వచ్చేస్తాయి. వాటిని షార్క్‌లు వేటాడి తినేస్తాయి. ఆ శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ పిల్లలన్నీ మళ్లీ దీవి మీదికి పయనమవుతాయి.
* అడుగు వెయ్యడానికి కూడా ఖాళీలేకుండా చిన్న చిన్న పీత పిల్లలు ఈ దీవిలో రోడ్లెక్కెస్తాయి. ఈ చిత్రం ఈ మధ్య మళ్లీ ఇక్కడ కనిపించింది. కోట్ల పిల్లలు జరజరా పాకేస్తూ ఇళ్లవైపుకూ వచ్చేశాయి. మొత్తం రోడ్లను కమ్మేశాయి. ఇళ్ల వాకిళ్లలోకీ పరుచుకుపోయాయి. ఎర్ర తివాచీలు పరిచారా అన్నట్టు కనువిందు చేశాయి.
* ఇలాంటి ఆశ్చర్యకరమైన దృశ్యాల్ని చూసేందుకు ఈ కాలంలో బోలెడు మంది ఇక్కడికొస్తారు. మామూలుగా ఇదొక దీవిలానే ఉన్నా చలికాలంలో ఇదో పర్యాటక ప్రాంతంగా మారిపోతుంది మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని