పెద్ద బుద్ధ విగ్రహాలు... అంతర్యుద్ధాలు!

అఫ్గానిస్థాన్‌లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ దేశం. ఇప్పటికీ రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నా ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది....

Published : 25 Nov 2017 01:54 IST

పెద్ద బుద్ధ విగ్రహాలు... అంతర్యుద్ధాలు!
అఫ్గానిస్థాన్‌

కల్లోలంలోనూ... కవిత్వ ప్రియత్వం! 

అఫ్గానిస్థాన్‌లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ దేశం. ఇప్పటికీ రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నా ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది. వందల ఏళ్ల కొద్దీ ఇక్కడి ప్రజలు తమ జీవిత కథల్ని పద్యాలు, పాటల రూపంలో తమ తర్వాతి తరాలకు అందిస్తున్నారు. దేశంలోని చాలా నగరాల్లో ప్రతి గురువారం ‘పోయెట్రీ నైట్‌’ పేరుతో అందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. పిల్లలు, పెద్దలు వచ్చి ఈనాటి కవిత్వంతో పాటు ప్రాచీన పద్యాలు గుర్తుకు చేసుకుని ఆలపిస్తారు.

* అఫ్గానిస్థాన్‌.... ఆసియా ఖండం మధ్యలో ఉంటుంది. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే. ఇరాన్‌, పాకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, తజికిస్థాన్‌, చైనా దేశాలు దీనికి సరిహద్దులు.
* 1919లో ఆగస్టు 19న బ్రిటన్‌ నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఒకవైపు తీవ్రవాదం..మరోవైపు పెద్దరాజ్యాల కుమ్ములాటల్లో నలిగిపోతూ రాజకీయ అనిశ్చితిలోనే ఉంది.
* అఫ్గానిస్థాన్‌ అంటే అఫ్గానుల ప్రదేశం అని అర్థమట.

* ఈ దేశ జాతీయ ఆట ‘బుజ్కెషి’. దీన్నే గోట్‌ గ్రాబింగ్‌ అని కూడా అంటారు. ఈ ఆట కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. రెండు జట్లుగా ఉండే ఈ ఆటలో గుర్రపు సవారీ చేస్తూ మేకను పట్టుకోవాలి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆట ఉందిక్కడ.

* 1985లో అఫ్గాన్‌ శరణార్థుల సంక్షోభం సమయంలో నేషనల్‌ జియోగ్రఫిక్‌ మ్యాగజైన్‌పై వచ్చిన 12 ఏళ్ల అమ్మాయి చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకుపచ్చని కళ్లతో ఆకట్టుకునే ఆ అమ్మాయి పేరు షర్బత్‌ గులా. ఆమెది అఫ్గానిస్థానే. శరణార్థుల శిబిరంలో 1984లో ఫొటోగ్రాఫర్‌ స్టీవ్‌ మెక్‌కరీ ఈ అమ్మాయి ఫొటో తీశాడు. అఫ్గానిస్థాన్‌ ప్రజలు సంక్షోభాల్లో నలిగిపోతూ శరణార్థుల్లా వలసలుపోతుండటానికి ఈమె ఫొటో ఓ సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ చిత్రం ‘మొనాలిసా ఆఫ్‌ అఫ్గాన్‌’గా ప్రపంచం దృష్టిలో పడింది. 
* ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగానూ... చలికాలంలో చాలా చల్లగానూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న భూకంపాలు తరచూ వస్తుంటాయి. పర్యావరణ మార్పుల వల్ల గడిచిన 20 ఏళ్లలో ఎక్కువ మొత్తంలో అడవులు నశించాయట.

* దేశంలో కొత్త సంవత్సరాన్ని‘నౌరోజ్‌’ అంటారు. మార్చి 21న చేసుకుంటారీ వేడుక. ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకుంటారు. భారీ జెండాలను ఎగరవేస్తారు.
* ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. సహజవాయువులు, చమురు ప్రధాన వనరులు.
* ఎక్కువగా పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష, ఖుబానీ (యాప్రికాట్‌) పండ్లను ఎగుమతి చేస్తుందీ దేశం. 
* ఈ దేశంలోని రగ్గులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. 
* అక్షరాస్యత మగ వారిలో 52 శాతం, ఆడవారిలో 24 శాతం ఉందీ దేశంలో.

దేశం: అఫ్గానిస్థాన్‌
రాజధాని: కాబూల్‌
విస్తీర్ణం: 6,52,864 చదరపు కిలోమీటర్లు
జనాభా: 3,46,56,032
భాషలు: పష్తూ, దారి (పర్షియన్‌)
కరెన్సీ: అఫ్గానీ

* ఈ దేశ కరెన్సీ అఫ్గానీ. ఈ దేశ ప్రజల్ని అఫ్గాన్స్‌ అంటారు. కానీ ఎక్కువమంది ఈ దేశ ప్రజల్నే అఫ్గానీ అని పొరపాటుగా అంటుంటారు.* ఇక్కడి ‘బమియన్‌’ గుహలు ఎంతో ప్రాచీనమైనవి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్‌ పెయింటింగ్స్‌కి నిలయమివి. ఈ పెయింటింగ్స్‌... క్రీస్తుపూర్వం 650 ఏళ్లనాటివి.
 * ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాలు ఇక్కడే ఉండేవి. ఈ బమియన్‌ బుద్ధ విగ్రహాలను తాలిబాన్లు 2001లో ధ్వంసం చేశారు.

* మంచు చిరుత, ఎగిరే ఎర్ర ఉడత వంటి ప్రత్యేకమైన జీవుల్ని చూడొచ్చిక్కడ.
* ఈ దేశంలో 14 తెగలున్నాయి. ఇక్కడి ప్రజల్లో 99 శాతం మంది ఇస్లాం మతస్థులే.
* తీవ్రంగా విద్యుత్తు కొరతున్న దేశాల్లో ఇదీ ఒకటి.
* ఈ దేశంలో శుక్రవారం దుకాణాలకు, వ్యాపారాలకు సెలవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని