ఒక్కపూట భోజనం @ 18 వేలు

ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్‌ టేబుల్‌ అది... ఒకేసారి 101 మంది భోజనం చేయొచ్చు...టేబులంతా ధగధగ మెరిసిపోతుంది... ఎన్నో ఏళ్ల చరిత్ర దాని సొంతం... రాజదర్పం ఉట్టిపడే ఆ టేబుల్‌ ఎక్కడో లేదు... మన హైదరాబాద్‌లోని తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉంది... హఠాత్తుగా దీని గురించి దేనికంటే...

Published : 28 Nov 2017 02:06 IST

ఒక్కపూట భోజనం @ 18 వేలు

ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్‌ టేబుల్‌ అది... ఒకేసారి 101 మంది భోజనం చేయొచ్చు...టేబులంతా ధగధగ మెరిసిపోతుంది... ఎన్నో ఏళ్ల చరిత్ర దాని సొంతం... రాజదర్పం ఉట్టిపడే ఆ టేబుల్‌ ఎక్కడో లేదు... మన హైదరాబాద్‌లోని తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉంది... హఠాత్తుగా దీని గురించి దేనికంటే... మన అతిథి ఇవాంకా ట్రంప్‌ విందు ఇక్కడే!
మల్లీశ్వరీ సినిమా చూసే ఉంటారుగా. అందులో ఈ కొన నుంచి ఆ కొన వరకు పొ....డ...వై...న డైనింగ్‌ టేబుల్‌ కనిపిస్తుంది. అచ్చం అలాగే ఉంటుందీ డైనింగ్‌ టేబుల్‌. నవాబుల రాజసానికి అద్దం పట్టే ఈ టేబుల్‌పై కూర్చుని భోజనం చేయడమంటే మాటలు కాదు. దీని వైభోగమేంటో దాని వెనుకున్న కథేంటో తెలుసుకుందామా మరి!* కళ్లు చెదిరే షాండ్లియర్‌ కాంతులు.... ఎక్కడ చూసినా పసిడి పూతలు... కూర్చీల దగ్గర్నించి పైకప్పుల వరకు అన్నీ మెరుపుల జిలుగులే. 101 మంది కూర్చోవడానికి వీలయ్యే ఈ టేబుల్‌ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కుడివైపున 50 మంది, ఎడమవైపున 50 మంది కూర్చునే ఏర్పాట్లుంటాయి దీనికి. ఇంకా టేబుల్‌ మధ్యలో అంగుళం ఎత్తులో ఉండే పెద్ద కుర్చీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రధాన అతిథి కోసమే ఇది. ఓ గమ్మత్తయిన సంగతేంటో తెలుసా? ఈ టేబుల్‌ దగ్గర మైక్‌సెట్లు లేకపోయినా మాటలు మాత్రం అంతటా వినిపిస్తాయి. నమ్మడానికి వింతగా ఉన్నా ఇంజినీరింగ్‌ నైపుణ్యమే అందుకు కారణం.
* 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తుతో ఉండే ఈ టేబుల్‌ పైభాగాన్ని తయారుచేయడానికి ఏడు పొడవైన కలప దుంగల్ని ఉపయోగించారు. అందుకు టేకు, రోజ్‌ ఉడ్‌లను వాడారు. చుట్టూ కుర్చీలకు పచ్చరంగులో ఉండే అరుదైన లెదర్‌ని ఉపయోగించారు.
* ఇక ఇది ఉండే హాలు విశేషాలకి వస్తే... పైన ఐదు షాండ్లియర్ల కాంతులు హాలంతా మిరిమిట్లు గొలుపుతాయి. బంగారాన్నే కరిగించి రంగులుగా అద్దిన పెయింటింగ్స్‌ గోడలపై మరింతగా ఆకర్షిస్తాయి. ఈ టేబుల్‌పై బంగారు పూతే కాదు... వివరాలు వింటేనే బాబోయ్‌ అనిపిస్తోంది. దీంట్లో భోజనం చేయడమంటే ఆషామాషీ కాదు మరి. అందుకే మన అతిథులకు ఆతిథ్యం ఇక్కడే ఇస్తున్నారు.
* ఇన్ని హంగులు... ఆర్భాటాలతో ఆశ్చర్యపరుస్తున్న ఈ టేబుల్ని ఎవరు? ఎప్పుడు తయారుచేయించారో తెలుసా? నిజాం ప్రధానిగా పనిచేసిన నవాబ్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా 1893లో దీని నిర్మాణం పూర్తి చేశారు. దీనికోసం ఫ్రాన్స్‌ నుంచి నిపుణుల్ని రప్పించారు. అప్పట్లో రాజకుటుంబీకులకు భోజనఏర్పాటు చూసేందుకు 25 మంది ప్రత్యేకంగా పనిచేసేవారు. ఇక్కడి కంచాలు, గిన్నెలు, చెంచాలు అన్నీ బంగారు, వెండితో చేసిన„ళళే ఉండేవట. గోడలపై ఉన్న ఆహారపదార్థాల చిత్రాల్ని చూపి నవాబు రాజులు నచ్చిన భోజనం తయారు చేయించుకునేవారట. ఇతర దేశాల రాజులూ ఇక్కడ విందు చేశారు. నిజాం వారసుల నుంచి 2010లో దీన్ని తాజ్‌హోటల్స్‌ గ్రూప్‌ అద్దెకు తీసుకుని ‘తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌’గా మార్చింది. దీన్ని ప్రారంభించినప్పుడు సచిన్‌ తెందుల్కర్‌, కరీనా లాంట ప్రముఖులెందరో వచ్చి విందు ఆరగించారు.
* అయ్యబాబోయ్‌ ఇది మహా రాజుల కోసమో, సెలబ్రెటీల కోసమో కాబోలు... మనలాంటివారు తినలేరేమో అనుకోకండి. ఇందులో ఎవ్వరైనా తినొచ్చు. నచ్చిన పదార్థాలన్నీ అపరిమితంగా ఎంతకావాలంటే అంత. అయితే షరతులు వర్తిస్తాయి. ఈ టేబుల్‌పై భోజనానికి కనీసం 40 మందైనా ఉండాలి. అప్పుడే దీనిపై భోజనం పెడతారన్నమాట. అయితే ఒక్కరు ఒక్కపూట భోజనం చేయాలంటే దాదాపుగా రూ.18 వేలు చెల్లించాల్సిందే.

- ఉండ్రు నరసింహారావు, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని