న్యూటన్‌ చెట్టు... బతికే ఉంది

అనగనగా ఓ యాపిల్‌ చెట్టుంది... పేద్ద పరిశోధనకు కారణమయ్యింది... న్యూటన్‌ను గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది... ఇప్పుడు దాని వయసు 400 ఏళ్లు... ఆసక్తికరమైన దాని వివరాలుతెలుసుకుందామా?....

Published : 29 Nov 2017 01:59 IST

న్యూటన్‌ చెట్టు... బతికే ఉంది

అనగనగా ఓ యాపిల్‌ చెట్టుంది... పేద్ద పరిశోధనకు కారణమయ్యింది... న్యూటన్‌ను గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది... ఇప్పుడు దాని వయసు 400 ఏళ్లు... ఆసక్తికరమైన దాని వివరాలుతెలుసుకుందామా?
పదిహేడో శతాబ్దం నాటి సంగతి... అది ఇంగ్లండ్‌లోని లింకన్‌ షైర్‌... యువకుడైన ఐజాక్‌ న్యూటన్‌... యాపిల్‌ చెట్టు కింద దీర్ఘాలోచనలో ఉన్నాడు... అప్పుడే చెట్టు నుంచి యాపిల్‌ పండు కింద పడింది... ఆయన మెదడులో మెరుపులా ఓ ఆలోచన మొదలైంది... యాపిల్‌ పండు చెట్టు నుంచి కిందికే ఎందుకు పడిందీ అని? అదే ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి కారణమయ్యింది. ఈ కథంతా తరగతి గదుల్లో మేము ఎప్పుడో వినేశాం అంటారా? ఆగండాగండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆ కథలో ఉన్న యాపిల్‌ చెట్టు గురించి మరి!* న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టేందుకు కారణమైన యాపిల్‌ చెట్టు ఇంగ్లండ్‌లో ఇప్పటికీ బతికే ఉంది.
* మామూలుగా ఈ చెట్లు వందేళ్ల వరకూ బతుకుతాయి. అయితే దాదాపు 400వందల ఏళ్లుగా ఈ చెట్టు ఇప్పటికీ యాపిల్‌ పళ్లు కాస్తూ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
* 1816లో వచ్చిన గాలి దుమారానికి అది పూర్తిగా విరిగిపోలేదుగానీ నేలకొరిగింది. మళ్లీ అక్కడ వేళ్లు పాతుకుని వృక్షంగా మారింది. అలా దాని మొదలు ఇప్పటికీ సజీవంగానే ఎస్‌ ఆకారంలో కనిపిస్తుంది. మొదలు ఎక్కువ భాగం నేల మీద ఒరిగి ఉండటంతో అది ఇన్నాళ్లపాటు బతికి ఉంది. పురుగూపుట్రా దాని దరికి చేరకుండా జాగ్రత్త పడ్డారు.
* దీన్ని 2002లో క్వీన్‌ ఎలిజిబెత్‌II జాతీయ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇంగ్లండ్‌లోని అతి అరుదైన చారిత్రక 50 చెట్లలో దీన్నీ ఒకటి చేశారు.
* న్యూటన్‌ లింకన్‌షైర్‌లో 1642లో పుట్టారు. పచ్చిక బయళ్ల మధ్యలో యాపిల్‌ చెట్ల మధ్య ఆయన పుట్టిన చిన్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పరిసరాల్లో, చెట్ల కిందే ఆయన చిన్ననాటి ఆటలన్నీ సాగాయి.
* ఇదీ 1666లో సంగతి. అంటే ఆయనకు 24ఏళ్ల వయసున్నప్పుడన్నమాట. అప్పటికే ఆయనకి ఖగోళ, భౌతికశాస్త్ర సంబంధమైన విషయాలన్నా, గణితమన్నా బోలెడు ఆసక్తి. అప్పుడు ఆయన కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. ఆ ప్రాంతంలో అప్పుడు ప్లేగు వ్యాధి విజృంభించింది. దీంతో కళాశాలకి సెలవులిచ్చేశారు. వెంటనే అమ్మను చూసేందుకు లింకన్‌షైర్‌కి బయలుదేరాడు న్యూటన్‌. ఆ ప్రయాణమే గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతిపాదించడానికి ఓ రకంగా కారణమైంది. అలా సెలవులకు వూరెళ్లిన ఆయన తీరిగ్గా తనకిష్టమైన ఈ యాపిల్‌ చెట్టు కింద కూర్చున్నారు. తర్వాత జరిగిన కథంతా మనకు తెలిసిందే మరి.* 1726లో న్యూటన్‌ చనిపోయారు. తర్వాత ఈ చెట్టును వారి కుటుంబంలోని వారే సంరక్షించేవారు. 2000 సంవత్సరం తర్వాత ఇది అక్కడి నేషనల్‌ ట్రీకౌన్సిల్‌ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి బయటి వారు దీన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేశారు. దాని దగ్గరకు వెళ్లి చెట్టుకు హాని చేస్తున్నారని గుర్తించి చుట్టూ కంచె నిర్మించారు. అయినా కొందరు దీని విత్తనాలు, చెట్టు భాగాల్ని దొంగలించి మొక్కలు పుట్టించి న్యూటన్‌ యాపిల్‌ మొక్కలంటూ వ్యాపారమే చేసేస్తున్నారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని