చెట్టు‘లా... వా’

ఎత్తయిన వృక్షాలు తెలుసు... చిట్టి పొట్టి బోన్సాయ్‌ చెట్లూ చూశాం... మరైతే లావా ట్రీల గురించి తెలుసా? తెలియకపోతే చదివేయండి! చెట్లంటే కొమ్మలుంటాయి... ఆకులుంటాయి... కాండం ఉంటుంది... వేర్లు ఉంటాయి.. కానీ ఇవేవీ లేకుండా ఓ దగ్గర చెట్లు ఉన్నాయి. ఎక్కడో చూడాలనుందా? అయితే పదండి హవాయి ద్వీపంలోని పహోవాలో ఉన్న ‘లావా ట్రీస్‌ స్టేట్‌ పార్కు’కి....

Published : 08 Dec 2017 01:54 IST

చెట్టు‘లా... వా’

ఎత్తయిన వృక్షాలు తెలుసు...
చిట్టి పొట్టి బోన్సాయ్‌ చెట్లూ చూశాం... మరైతే లావా ట్రీల గురించి తెలుసా?
తెలియకపోతే చదివేయండి!

చెట్లంటే కొమ్మలుంటాయి... ఆకులుంటాయి... కాండం ఉంటుంది... వేర్లు ఉంటాయి.. కానీ ఇవేవీ లేకుండా ఓ దగ్గర చెట్లు ఉన్నాయి. ఎక్కడో చూడాలనుందా? అయితే పదండి హవాయి ద్వీపంలోని పహోవాలో ఉన్న ‘లావా ట్రీస్‌ స్టేట్‌ పార్కు’కి.
*మొత్తం 17 ఎకరాల్లో ఉన్న ఈ పార్కులో బోలెడు రకాల చెట్లూచేమలూ ఉంటాయి. వీటితో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఈ లావా వృక్షాలూ దర్శనమిస్తాయి. ఈ వింత చెట్లను చూడ్డానికే సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు.

*అసలు లావా చెట్లేంటీ? వీటి విశేషాలేంటీ? అంటే.... 1790వ సంవత్సరంలో ఇక్కడ అగ్నిపర్వతాలు పేలి ఎర్రని లావా భగభగ మండుతూ ఇక్కడి అడవి గుండా ప్రవహిస్తూ వచ్చింది. ఎత్తయిన చెట్లను పూర్తిగా కప్పేయలేదు. కానీ ఈ అడవి ఉండే ఎత్తయిన ఒహియా చెట్ల కాండాల్ని కొమ్మల్ని మొత్తం చుట్టేసింది. కొంతకాలానికి అది చల్లబడి చెట్టుపై గట్టి పొరలా ఏర్పడింది. వేడికి చెట్టంతా కాలిపోయి బూడిదైనా... చెట్టు ఆకారాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మునుపటి వృక్షాల్లానే. లావా అచ్చులే చెట్లలా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే వీటినే లావా ట్రీలుగా పిలిచేస్తారు.
*ఈ చెట్లు భలే గమ్మత్తుగా వింత రూపాల్లో కనిపిస్తాయి. లోపలంతా డొల్లగా పైన మాత్రం చెట్టు రూపంతో చిత్రంగా ఉంటాయి.
*మామూలు చెట్ల సైజు నుంచి మనకన్నా చాలా రెట్లు ఎత్తులోనూ ఉంటాయివి.
*ఈ ప్రదేశాన్ని సంరక్షణ ప్రాంతంగా మార్చి పార్కులా ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని