ఈ ఖండానికి టైమే లేదట!

టైమ్‌జోన్‌లు ప్రతి దేశానికీ ఉంటాయి... అయితే ఇది లేకుండా ఓ ఖండమే ఉంది... పైగా అక్కడ ఇప్పుడు వేసవి కాలమట... వినడానికే గమ్మత్తుగా ఉంది కదూ! అదేంటో, దాని సంగతులేంటో చూద్దాం రండి... అంటార్కిటికా... ఈ ఖండం పేరు గుర్తుకు రాగానే కనుచూపు మేరంతా...

Published : 13 Dec 2017 01:53 IST

ఈ ఖండానికి టైమే లేదట!

టైమ్‌జోన్‌లు ప్రతి దేశానికీ ఉంటాయి... అయితే ఇది లేకుండా ఓ ఖండమే ఉంది... పైగా అక్కడ ఇప్పుడు వేసవి కాలమట... వినడానికే గమ్మత్తుగా ఉంది కదూ! అదేంటో, దాని సంగతులేంటో చూద్దాం రండి...

అంటార్కిటికా... ఈ ఖండం పేరు గుర్తుకు రాగానే కనుచూపు మేరంతా మేటలుగా పరుచుకున్న మంచే గుర్తొస్తుంది మనందరికీ. అయితే ఇక్కడ ఒక్కశాతం మాత్రం మంచులేని మట్టి భూభాగం కనిపిస్తుంది. ఇది ఎక్కడుందంటే దక్షిణ ధ్రువం దగ్గర. మన దేశం కిందికి దక్షిణవైపుగా చాలా దూరం వెళ్లిపోతే అక్కడ ఉంటుందన్నమాట.
* అంటార్కిటికా ఖండానికి సొంతంగా టైమ్‌ జోన్‌ లేదు. అక్కడ స్థానికంగా పుట్టిన వారు ఎవరూ లేకపోవడం, ఏ ఒక్క దేశ ప్రభుత్వం కిందా అది లేకపోవడంతో స్వతహాగా దానికి మాత్రమే ఎవరూ టైమ్‌జోన్‌ని ఏర్పాటు చేయలేదట.
* దీంతో ఇక్కడ చాలా దేశాల టైమ్‌జోన్‌లు వాడుకలో ఉన్నాయి.
* ఇక్కడున్న దేశాల బేస్‌ క్యాంపుల్లో వాళ్ల సొంత దేశపు టైమ్‌లైన్లనే ఉపయోగించుకుంటారు. మరి కొందరేమో తమ బేస్‌ క్యాంప్‌కు సమీపంలో ఏ దేశం ఉంటే ఆ టైమ్‌ని వాడతారు. ఉదాహరణకు ఇక్కడ కార్లిన్‌ బేస్‌ అని ఒకటుంది. అది అర్జెంటీనా ప్రభుత్వపు అధికారిక బేస్‌క్యాంప్‌. దీనికి సమీపంలోనే అంటే దక్షిణ అమెరికా ఖండం కొనన అర్జెంటీనా దేశం ఉంటుంది. అది ఈ క్యాంప్‌కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌నే ఇక్కడ వాడేస్తారన్నమాట.

విస్తీర్ణం పెరుగుతుంది.. తగ్గుతుంది! 

అంటార్కిటికా విస్తీర్ణం మొత్తం కోటీ నలభైలక్షల చదరపు కిలోమీటర్లు. అయితే చలికాలంలో ఇక్కడికి దగ్గరగా ఉండే సముద్రాల నీరూ గడ్డకట్టేస్తుంది. దీంతో దీని విస్తీర్ణం ఇంకొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ పెరిగిపోతూ ఉంటుంది. మళ్లీ వేసవి వచ్చేసరికి ఆ మంచు కరిగిపోయి విస్తీర్ణం మామూలు లెక్కకి వచ్చేస్తుంది. వినేందుకు గమ్మత్తుగా ఉంది కదూ.
* ఇక్కడ ఇప్పుడు వేసవి కాలం. వేసవంటే మనకున్నట్లే బోలెడు ఎండ ఉంటుందేమో అనుకోకండి. వేసవి కాలంలో అక్కడుండే ఉష్ణోగ్రతల్ని తలుచుకున్నా మనకు కడుపులోంచి వణుకు పుడుతుంది. ఇక్కడడిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు వేసవే. ఈ సమయంలోనూ ఇక్కడ మైనస్‌ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలుంటాయి. దాదాపుగా -15 నుంచి -35 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఉంటుంది.
* మార్చి నుంచి మిగిలిన అన్ని నెలలూ ఇక్కడ చలికాలమే. మన దేశంలో 10 డిగ్రీలు వస్తేనే గడగడా వణికిపోతాం. మరి ఇక్కడ చలికాలంలో అయితే -40 నుంచి -70 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. ఆ చలి మన వూహకే అందదసలు.

వేసవిలోనే నివాసాలు! 

* అంటార్కిటికాలోనే పుట్టి పెరిగిన స్థానికులే లేరు. వేసవిలో మాత్రమే ఇక్కడ 4000 మంది నివసిస్తుంటారు. వాళ్లు కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లే.
* ఇక్కడ పంటలుండవు. ఆఫీసులూ ఉండవు. మరి ఇక్కడకొచ్చి ఎవరు ఎందుకు నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు? అనే అనుమానం ఎవ్వరికైనా వస్తుంది. ఇక్కడ దాదాపు నలభై దేశాలకు చెందిన 100 పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఒక్కోదేశం వాళ్లూ ఒక్కో ప్రదేశంలో ఇక్కడ బేస్‌ క్యాంపులు, పరిశోధనా కార్యాలయాలూ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడున్న మన దేశ బేస్‌క్యాంప్‌ పేరు భారతి. వీటన్నింటిలో పనిచేసే శాస్త్రవేత్తలు, వారి సహాయకులు మాత్రమే ఇక్కడుంటారు. వీళ్లంతా ఇక్కడ జంతువులు, మొక్కలు, వాతావరణం... లాంటి చాలా అంశాలపై ఇక్కడ పరిశోధనలు చేసేవాళ్లే. చలికాలం వస్తే వీళ్లూ ఖాళీ చేసి వెళ్లిపోతారు.
* వీళ్లు కాకుండా పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ ఓ ప్రాంతంలో మాత్రమే కాలనీ ఉంది. ఎవరైనా అంటార్కిటికా చూడ్డానికి వెళితే కొన్ని రోజుల పాటు అక్కడ ఉంటారన్నమాట.

ఆహారం ఎలా?

* ఇక్కడ పంటలు పండవు. మరిక్కడ ఉన్న వాళ్లకు ఆహారం కావాలి కదా. అందుకని వీళ్లు ఏం చేస్తారంటే దక్షిణ ధ్రువంకి దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా....లాంటి దేశాల నుంచి ఆహారపదార్థాల్ని ఓడలు, విమానాల్లో తీసుకెళతారు.
* పరిశోధనల కోసమని కొద్దిగా కూరగాయల్లాంటివి పండిస్తున్నారు. అయితే అవి బయటి ఉష్ణోగ్రతలకు సంబంధం లేకుండా పూర్తిగా భవనాల్లోపల, లైట్ల కాంతి మధ్య వాటిని పెంచుతున్నారు.
* ఇక్కడుండే ఇళ్లన్నీ దాదాపుగా చెక్కతో చేసినవే ఉంటాయి. చెక్క చలిని లోపలికి రానివ్వకపోవడమే అందుకు కారణం. వీళ్లంతా శరీరం మొత్తం కప్పి ఉండేలా దుస్తులు వేసుకుంటారు. స్వెట్టర్లు, గ్లౌజులు వేసుకుని శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవి లేకుండా ఇక్కడసలు మనుషులు జీవించనేలేరు.
* ఇంత చలిలో మనుషులు ఉండటం కష్టంగానీ ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి. జడల బర్రెలు, ధ్రువపు ఎలుగుబంట్లు, గుడ్లగూబలు, పెంగ్విన్‌లు.. లాంటి చాలానే జీవజాతులున్నాయి.
* ఇక్కడ దాదాపుగా 1700 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. వీటిల్లో గుల్మాలు, నేలన పెరిగే గడ్డి మొక్కల జాతులే ఎక్కువ. ఇన్ని తేడాలు, వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టే అంటార్కిటికా ఎప్పుడూమనందరికీ ప్రత్యేకంగానే కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని