అతిథి దేవోభవ

మంచి ఆచారాలు... చాలా ప్రత్యేకతలు... సెర్బియా సొంతం... తెలుసుకుందామా ఇంకా బోలెడన్ని విశేషాలు! ఐరోపా ఖండంలో ఉన్న చిన్న భూపరివేష్టిత (చుట్టూ భూభాగాలే సరిహద్దులు) దేశం సెర్బియా. దీనికి హంగేరీ, రొమేనియా, బల్గేరియా, మెకడోనియా, క్రొయేషియా, బోస్నియా, మోంటెన్‌గ్రో, అల్బేనియాలు సరిహద్దులుగా ఉన్నాయి. *దీని రాజధాని బెల్‌గ్రేడ్‌ ఇక్కడ అతి పెద్ద నగరం. ఇది ఐరోపాలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగానూ పేరొందింది....

Published : 23 Dec 2017 02:18 IST

అతిథి దేవోభవ

మంచి ఆచారాలు... చాలా ప్రత్యేకతలు... సెర్బియా సొంతం... తెలుసుకుందామా ఇంకా బోలెడన్ని విశేషాలు!

రోపా ఖండంలో ఉన్న చిన్న భూపరివేష్టిత (చుట్టూ భూభాగాలే సరిహద్దులు) దేశం సెర్బియా. దీనికి హంగేరీ, రొమేనియా, బల్గేరియా, మెకడోనియా, క్రొయేషియా, బోస్నియా, మోంటెన్‌గ్రో, అల్బేనియాలు సరిహద్దులుగా ఉన్నాయి.
*దీని రాజధాని బెల్‌గ్రేడ్‌ ఇక్కడ అతి పెద్ద నగరం. ఇది ఐరోపాలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగానూ పేరొందింది.
*ప్రాచీన కాలంలో ఉన్న రోమన్‌ రాజ్యంలో సెర్బియా ఒక భాగం. మొత్తం 18 మంది రోమన్‌ చక్రవర్తులు పుట్టినచోటు ఈ దేశమేనని చెబుతారు. వారి రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటి సెర్బియాలోనే ఉన్నాయి.
*కరెన్సీ సెర్బియన్‌ దినార్‌. ఒక సెర్బియన్‌ దినార్‌ మన రూపాయి కంటే తక్కువే. దాదాపుగా 64పైసలు.
*70 లక్షలకు పైగా జనాభాకు 90లక్షలకు పైగా ఫోన్లున్నాయి. జనాభా వృద్ధి రేటు మాత్రం తిరోగమనంలో ఉంది.
*నలభైలక్షల మందికి పైగా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు.
*మొత్తం భూభాగంలో 31శాతానికిపైగా అడవులున్నాయి. 57శాతంలో పంటలు పండిస్తారు.
*మన దేశంలో క్రికెట్‌ని ఎక్కువగా ఇష్టపడినట్లు ఇక్కడి వారందరికీ ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం.
*ఇక్కడ చమురు, గ్యాస్‌, బొగ్గు, ఇనుపఖనిజం, కాపరు, జింకు, బంగారం, వెండి, మెగ్నీషియం, సున్నపురాయి, మార్బుల్‌, ఉప్పు అధికంగా దొరుకుతాయి.

దేశం: సెర్బియా
రాజధాని: బెల్‌గ్రేడ్‌
కరెన్సీ: సెర్బియన్‌ దినార్‌
విస్తీర్ణం: 88,361 చదరపు కిలోమీటర్లు
జనాభా: 70,58,322
అధికారిక భాష: సెర్బియన్‌

అతిథులకు ప్రత్యేకం!

ప్రపంచ వ్యాప్తంగా సెర్బియన్ల ఆతిథ్యానికి చాలా మంచి పేరుంది.
*‘అతిథి దేవోభవ’ అన్న మన భారతీయ సంప్రదాయంలాగే అతిథుల్ని దేవుడిలాగే భావించాలని వీరు నమ్ముతారు. విదేశాల్నించి రోగులు ఇక్కడ ఆసుపత్రులకు రావడానికి ఇదీ ఒక కారణం.
*అలాగే ఇక్కడ ఎవరింటికైనా అతిథిగా వెళితే ఏదో ఒక బహుమతి ఇవ్వకుండా మాత్రం పంపించరు. చాక్లెట్‌లు, పువ్వుల దగ్గర నుంచి ఏదో ఒకటి బహూకరిస్తారు.
*ఇంటికొచ్చిన చుట్టాన్ని చాలా గౌరవంగా చూస్తారు. వారు నోరు తెరిచి ఏదీ అడగకుండానే అన్నీ అందివ్వాలనుకుంటారు.
*ఇక్కడి వారు కాఫీని ఎక్కువగా ఇష్టపడతారు. మనం చిన్న చిన్న టీ పార్టీలు ఇచ్చిపుచ్చుకుంటాం. అలాగే ఇక్కడ కాఫీ తాగేందుకూ పక్కవారిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. స్నేహితులంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మనం టీ తాగినట్లు వీళ్లు కాఫీ తాగుతారు.
*మనకు బస్సుల్లో స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లున్నట్లు ఇక్కడ గర్భిణులకు రిజర్వ్‌డ్‌ సీట్లుంటాయి.

ర్రగా చూడగానే నోరూరిపోయేలా ఉండే రాస్‌బెర్రీలు ఇక్కడ అధికంగా పండుతాయి.

గడియారాల దేశం!

ప్రపంచంలో మంచి గడియారాలన్నింటినీ స్విట్జర్లాండ్‌ ఎక్కువగా తయారు చేస్తుంటుంది. అయితే స్విస్‌ వారికంటే 600ఏళ్ల ముందు నుంచే సెర్బియన్‌లు గడియారాల్ని తయారు చేయడంమొదలుపెట్టారు.
*ప్రజలంతా చూసుకోవడానికి వీలుగా మొదటి మెకానికల్‌ గడియారాన్ని రష్యాలో 1404లో తయారు చేశారు. దాన్ని చేసింది మాత్రం సెర్బియా దేశస్థుడు లేజర్‌.

దెయ్యాల పట్టణం!

సెర్బియా సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు, వాటిపై గడ్డి మైదానాలతో చూడచక్కగా ఉంటుంది.
*అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్‌ టౌన్‌ అని స్థానికులు పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టితో స్తంభాల మాదిరిగా ఏర్పడిన నిర్మాణాలు ఉంటాయి. పొడవుగా ఉండే ఇవి 220కిపైగా ఉన్నాయి. ఇవి నేల కోత వల్ల ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు. అయితే వీటిని దెయ్యాలే ఇలా నిర్మించాయంటూ స్థానికులు కథలు చెప్పుకొంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని