సర్వమతాల నిలయం... ఈ ఆలయం!

ప్రభువును ప్రార్థించడానికి చర్చికి వెళతారు...అల్లా అంటూ మసీదుకు చేరుకుంటారు... ముక్కోటి దేవుళ్లను పూజించడానికి గుళ్లకు బయలుదేరుతారు...కానీ అన్నీ మతాల ఆలయం ఒక దగ్గర ఉంది... ఇంతకీ ఎక్కడో ఏమిటో? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు. ఒక్కో మత ఆలయానికీ ఒక్కో రూపం. కానీ ఓ చోట ప్రత్యేకమైన ఆలయం ఉంది. అది అందరిది. ప్రపంచమతాల దేవాలయం. ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై’ అన్నమాటకు నిదర్శనమా గుడి. అందుకే ఈ గుడిని ‘టెంపుల్‌ ఆఫ్‌ ఆల్‌ రెలిజియన్స్‌’, ‘యూనివర్సల్‌ టెంపుల్‌’ అనే పేర్లతో పిలుస్తారు. * వివరాలు వింటేనే వింతగా అనిపిస్తున్న ఆ గుడి ఎక్కడుందో తెలుసా? రష్యాలోని కజాన్‌లో....

Published : 26 Dec 2017 02:05 IST

సర్వమతాల నిలయం... ఈ ఆలయం!

ప్రభువును ప్రార్థించడానికి చర్చికి వెళతారు...అల్లా అంటూ మసీదుకు చేరుకుంటారు... ముక్కోటి దేవుళ్లను పూజించడానికి గుళ్లకు బయలుదేరుతారు...కానీ అన్నీ మతాల ఆలయం ఒక దగ్గర ఉంది... ఇంతకీ ఎక్కడో ఏమిటో?

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు. ఒక్కో మత ఆలయానికీ ఒక్కో రూపం. కానీ ఓ చోట ప్రత్యేకమైన ఆలయం ఉంది. అది అందరిది. ప్రపంచమతాల దేవాలయం. ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై’ అన్నమాటకు నిదర్శనమా గుడి. అందుకే ఈ గుడిని ‘టెంపుల్‌ ఆఫ్‌ ఆల్‌ రెలిజియన్స్‌’, ‘యూనివర్సల్‌ టెంపుల్‌’ అనే పేర్లతో పిలుస్తారు.
* వివరాలు వింటేనే వింతగా అనిపిస్తున్న ఆ గుడి ఎక్కడుందో తెలుసా? రష్యాలోని కజాన్‌లో.

* దూరం నుంచే కనిపించేస్తుంది దీని అసలు ప్రత్యేకత. చర్చి, మసీదు, హిందూ, బౌద్ధ ఇతర మతాల సంప్రదాయాలతో ఉంటుంది నిర్మాణమంతానూ. అద్భుతమైన కట్టడాలతో, మెరిసే రంగులతో మొత్తం 16 గుమ్మటాలతో కనువిందుచేస్తుంది. క్రైస్తవుల శిలువ, ముస్లింల నెలవంక, చైనీస్‌ డోమ్‌... ఇలా మతగుర్తులు ఒకే చోట కొలువై ఉన్నాయి. ప్రపంచంలోని 16 మతాల చిహ్నాలన్నీ కనిపించేలా ఉంటుందీ దేవాలయం.

* దీని లోపలికి అడుగు పెట్టగానే ఓ దగ్గర బుద్ధుడు దర్శనమిస్తాడు. ఇంకో దగ్గర ఏసు ప్రభువు ఫొటోలు, శిలువా కనిపిస్తాయి. మరో దగ్గర ఓం గుర్తు... పెద్ద గుడి గంటలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఇలా అన్ని మతాలకూ నిలయమీ ఆలయం.

* ఇంతకీ ఈ ఆలోచన ఎవరికి వచ్చిందంటే... ఇక్కడి స్థానిక కళాకారుడు ఇల్డార్‌ ఖానోవ్‌ అనే ఆయన గురించి చెప్పుకోవాలి. ఈయన మాదక ద్రవ్యాల అలవాట్లను మానిపించి వైద్యం చేస్తుండేవాడు. ఓసారి ఇల్డార్‌కి ప్రభువు కలలో కనిపించి ఇలాంటి ఆలయాన్ని కట్టమని సూచించారట. అన్ని మతాల్నీ ఒక దగ్గర చేయాలని ఈ వినూత్న ఆలోచనతో 1992లో ఈ గుడి నిర్మాణ పనులు మొదలుపెట్టాడు ఇల్డార్‌. ఇందుకు అవసరమయ్యే డబ్బులన్నీ విరాళాల ద్వారా వచ్చినవే. ఆలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో 2013లో ఇల్డార్‌ చనిపోయారు. అయితే ఆయన ఆశయం కోసం... అనుచరులు విరాళాల సాయంతో నిర్మాణంలో మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేస్తున్నారు.
* విశ్వ విశ్వాసాలకు సూచికగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని